Yashwant Sinha Selected as Joint Opposition Candidate For Presidential Polls - Sakshi
Sakshi News home page

Yashwant Sinha: విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్‌ సిన్హా

Published Tue, Jun 21 2022 3:59 PM | Last Updated on Wed, Jun 22 2022 1:53 AM

Yashwant Sinha selected as joint Opposition Candidate for Presidential polls - Sakshi

సాక్షి ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్‌: వచ్చే నెలలో జరిగే భారత 16వ రాష్ట్రపతి ఎన్నికపై ఊగిసలాట ధోరణికి స్వస్తి పలుకుతూ ప్రతిపక్ష పార్టీలు ప్రతిపాదించిన యశ్వంత్‌ సిన్హా అభ్యర్థిత్వానికి టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆమోదం తెలిపారు. సీనియర్‌ నేత యశ్వంత్‌ సిన్హా అభ్యర్థిత్వంపై పలు విపక్ష పార్టీల నడుమ దాదాపుగా ఏకాభిప్రాయం కుదిరిన నేపథ్యంలో ఎన్సీపీ అధినేత, మాజీ కేంద్ర మంత్రి శరద్‌ పవార్‌ సోమవారం రాత్రి సీఎం కేసీ ఆర్‌ను ఫోన్‌లో సంప్రదించారు.

సిన్హా అభ్యర్థిత్వంపై అభి ప్రాయం కోరడంతో పాటు మద్దతు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. అయితే తమ నిర్ణయాన్ని వెల్లడించేందుకు కొంత గడువు కావాలని కోరిన కేసీఆర్‌.. యశ్వంత్‌కు టీఆర్‌ఎస్‌ మద్దతుపై విభిన్న కోణాల్లో మదింపు చేసినట్లు తెలిసింది. కాగా మంగళవారం మధ్యాహ్నం మళ్లీ ఫోన్‌ చేసిన పవార్‌కు సీఎం తన అంగీకారాన్ని తెలియజేసినట్లు సమాచారం.  

తొలుత పావులు కదిపినా..
కొంతకాలంగా జాతీయ పార్టీ ఏర్పాటు సన్నాహాల్లో నిమ గ్నమైన కేసీఆర్‌.. తొలుత కాంగ్రెస్, బీజేపీయేతర ఉమ్మడి అభ్యర్థిని బరిలోకి దించే దిశగా పావులు కది పారు. అయితే ఈ నెల 9న రాష్ట్రపతి ఎన్నిక షెడ్యూల్‌ విడుదల తర్వాత పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ రంగ ప్రవేశం చేయ డంతో, తదనంతర రాజకీయ పరిణామాలను కేసీఆర్‌ అధినేత నిశితంగా గమనిస్తూ వచ్చారు.

ఈ నెల 15న బీజే పీయేతర విపక్ష పార్టీల సమావేశానికి హాజరు కావాల్సిందిగా మమత నుంచి ఆహ్వానం అందినా భేటీకి వెళ్లలేదు. ‘బీజేపీ, కాంగ్రెస్‌కు సమదూరం’ అనేది తమ విధానం కాగా.. కాం గ్రెస్‌ను కూడా మమత ఆహ్వానించడం, రాష్ట్రపతి అభ్యర్థిగా అందరికీ ఆమోద యోగ్యమైన వ్యక్తిపై ఏకాభి ప్రాయ సాధన ప్రస్తావన లేకపోవడం, తదితర కారణాలతో ఆ భేటీకి తాము దూరంగా ఉన్నట్లు టీఆర్‌ఎస్‌ వర్గాలు వెల్లడించాయి.

దూరంగా ఉంటే విమర్శలకు తావిచ్చినట్లవుతుందని..
జాతీయ పార్టీ స్థాపన దిశగా కసరత్తు చేస్తూనే, మరోవైపు కాంగ్రెస్‌ మినహా మిగతా విపక్ష పార్టీల నేతలతో కేసీఆర్‌ సత్సంబంధాలు నెరుపుతున్నారు. ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ (పశ్చిమ బెంగాల్‌), అరవింద్‌ కేజ్రీవాల్‌ (ఢిల్లీ), భగవంత్‌ మాన్‌ (పంజాబ్‌), ఎంకే స్టాలిన్‌ (తమిళ నాడు), ఉద్ధవ్‌ థాక్రే (మహారాష్ట్ర), హేమంత్‌ సొరేన్‌ (జార్ఖండ్‌) తదితరులతో పాటు శరద్‌ పవార్, అఖిలేశ్‌ యాదవ్, తేజస్వీ యాదవ్, హెచ్‌డీ దేవెగౌడ, కుమారస్వామి వంటి నేతలతో భేటీ అవుతూ వస్తున్నారు.

ఈ పరిస్థితుల్లో రాష్ట్రపతి ఎన్నిక విషయంలో పలు విపక్ష పార్టీలు ఏకతాటి పైకి వస్తున్నా, టీఆర్‌ఎస్‌ దూరంగా ఉంటే విమర్శలకు తావు ఇచ్చినట్లు అవుతుందనే భావన పార్టీలో వ్యక్తమైంది. మరో వైపు కాంగ్రెస్‌ను సాకుగా చూపుతూ రాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉండటం వల్ల బీజేపీ విషయంలో పార్టీ వైఖరి అనుమానాలకు తావిస్తుందనే అభిప్రాయం కూడా టీఆర్‌ ఎస్‌ అంతర్గత చర్చల్లో వ్యక్తమైంది. 

సిన్హాకు మద్దతు సరైనదే..!
ఈ అంశాలన్నిటినీ పరిగణనలోకి తీసుకోవడంతో పాటు ముఖ్యంగా విపక్ష పార్టీల ఐక్యతకు టీఆర్‌ఎస్‌ అడ్డుపడుతోం దనే భావన నష్టం చేకూరుస్తుందనే అంచనాకు కేసీఆర్‌ వచ్చి నట్లు తెలిసింది. బీజేపీ, కాంగ్రెస్‌కు సమదూరమనే విధా నంతో జాతీయ రాజకీయాల్లో ఏకాకి అయ్యే అవకాశం ఉం దని కూడా భావించినట్లు సమాచారం.

మరోవైపు యశ్వంత్‌ సిన్హా 2018లో బీజేపీని వీడి తృణమూల్‌ కాంగ్రెస్‌లో చేరారు. ప్రస్తుతం ఆ పార్టీకి రాజీనామా చేసి రాష్ట్రపతి అభ్యర్థిగా బరి లోకి దిగుతున్నారు. ఇలా కాంగ్రెస్‌ నేపథ్యంలేని యశ్వంత్‌ సిన్హాకు మద్దతు పలకడం సరైనదేనని భావించి తాజా నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

టీఆర్‌ఎస్‌ ఓటు విలువ 2.28 శాతం
రాష్ట్రపతి ఎన్నికకు గాను దేశవ్యాప్త ఎలక్టోరల్‌ కాలేజీలో 776 మంది ఎంపీలు, 4,033 మంది ఎమ్మెల్యేలకు ఓటు హక్కు ఉండగా, టీఆర్‌ఎస్‌కు రాష్ట్రంలో 16 మంది ఎం పీలు, 103 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దేశ వ్యాప్తంగా ఎమ్మెల్యేలు, ఎంపీల ఓటు విలువ 10.86 లక్షలు కాగా, టీఆర్‌ఎస్‌ ఎంపీలు, ఎమ్మెల్యేల ఓటు విలువ 24,796గా ఉంది.

దేశ వ్యాప్త ఎలక్టోరల్‌ కాలేజీలో టీఆర్‌ఎస్‌ ఓటు విలువ 2.28 శాతంగా ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్‌ సిన్హా నామినేషన్‌ పత్రాల్లో ఆయనకు మద్దతుగా టీఆర్‌ఎస్‌ ఎంపీలు కూడా సంతకాలు చేయనున్నట్లు సమాచారం. దీనిపై సీఎం కేసీఆర్‌ ఒకటి రెండురోజుల్లో అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement