న్యూఢిల్లీ: కరోనా సంవత్సరం 2020లో గడ్డు పరిస్థితులను చూసిన దేశ ప్రజలంతా 2021కు గ్రాండ్ వెల్‌కమ్ చెబుతున్నారు. 2020 గుర్తొస్తే చాలు ప్రజలు దడుచుకునేలా చేసిన కరోనా సంవత్సరానికి ప్రజలు గుడ్‌బై చెబుతూ కోటీ ఆశలతో 2021కు స్వాగతం పలుకుతున్నారు. అయితే కరోనా నేపథ్యంలో బహిరంగ ప్రదేశాల్లో న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించడంతో ఇళ్లలోనే కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకునే వారి సంఖ్య భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలో పలు పట్టణాల ప్రజలంతా ఇంటికే ఫుడ్‌ను ఆర్డర్ చేసుకునేందుకు ఆసక్తి చూపారు. దీంతో ప్రముఖ ఫుడ్ డెలివరి సంస్థ జొమాటోకు నిన్న రాత్రి ఆర్డర్లు వెల్లువెత్తాయి.
నిమిషాల్లో వేలల్లో ఆర్డర్లు వచ్చిపడటంతో జొమాటో ఉద్యోగులంతా ఉక్కిరిబిక్కిరయ్యారని ఆ సంస్థ సీఈఓ దీపీందర్ గోయల్ పేర్కొన్నారు. సాధారణంగా పండుగలు, కొన్ని ప్రత్యేక రోజుల్లో జొమాటోకు నిమిషానికి 2,500 ఆర్డర్లు వస్తుంటాయి, కానీ న్యూ ఇయర్ సందర్భంగా గురువారం రాత్రి మాత్రం ఒక్క నిమిషంలోనే సుమారు 4,100 ఫుడ్ ఆర్డర్లు వచ్చాయని ఆయన వెల్లడించారు. ఈ ఆర్డర్లలో ఎక్కువగా బిర్యానీలు, పిజ్జాలు ఉన్నట్లు చెప్పారు. కాగా అనేక నగరాల్లో నూతన సంవత్సర వేడుకలపై ఆంక్షలు ఉండడంతో అత్యధికులు ఫుడ్ డెలివరీ సంస్థలపై ఆధారపడటంలో జొమాటో సేవలకు విపరీతమైన డిమాండ్ వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment