నిర్మల్: రాజకీయంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే నిర్మల్ ఓ కేంద్రబిందువుగా కొనసాగుతోంది. త్వరలోనే ఎన్నికలు రానున్నవేళ జిల్లాలో చోటుచేసుకుంటున్న మార్పులు అందరినీ ఆకర్షిస్తున్నాయి. తాజాగా ఉద్యమనేత, బీఆర్‌ఎస్ అసమ్మతి నాయకుడు కూచాడి శ్రీహరిరావు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడంపై చర్చమొదలైంది. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన కాంగ్రెస్‌లో చేరడమే ఇందుకు కారణం.
ఆయన హస్తంగూటికి చేరడంతో తమకెలాంటి ఇబ్బంది లేదని చెబుతున్న బీఆర్‌ఎస్, బీజేపీ క్షేత్రస్థాయిలో మరింత ఆరాతీస్తున్నాయి. ఇక దేశం, రాష్ట్రమంతటా ఎలా ఉన్నా.. జిల్లాలో రాజకీయ పరిస్థితులు కొంత భిన్నంగా ఉండటం సహజం. ఇక్కడ క్యాడర్ కాదు కదా.. కనీసం ఎన్నికల గుర్తు కూడా సరిగ్గా తెలియని పార్టీలు ఘనంగా గెలిచిన రోజులున్నాయి. అందుకే శ్రీహరిరావు కాంగ్రెస్‌లో చేరడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఆత్మాభిమానం కోసం..
తను కావాలనుకుంటే సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ వద్దకు వెళ్లి పనులు చేయించుకోగలను, కానీ.. ఉద్యమకారులకు గుర్తింపులేని చోట ఆత్మాభిమానం చంపుకొని ఉండలేనంటూ కూచాడి శ్రీహరిరావు కాంగ్రెస్‌గూటికి చేరారు. తనకు రాజకీయగురువుగా పేర్కొనే మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డినే ఢీకొనేందుకు రేవంత్‌రెడ్డి సమక్షంలో హస్తం కండువా వేసుకున్నారు.
గత ఎన్నికల్లో కారు గుర్తు గెలుపుకోసం ఎంత శ్రమించినా కనీసం ఇచ్చిన హామీమేరకు ఎమ్మెల్సీ కూడా ఇవ్వకపోవడమూ కూచాడి కాంగ్రెస్ వైపు వెళ్లడానికి కారణమన్న వాదనలున్నాయి. ఏదిఏమైనా గత ఎన్నికల్లోనే పోటీకి తమనేత దూరంగా ఉన్నారని, ఈసారైనా పోటీచేస్తేనే తనకు, తమకు ఉనికి ఉంటుందన్న వాదనను ఆయన అనుచరులు బలంగా వినిపిస్తున్నారు. అందుకే వారంతా ఆయన వెంటే కాంగ్రెస్‌బాట పట్టారు.
లాభమేనంటున్న బీజేపీ..
శ్రీహరిరావు బీఆర్‌ఎస్‌లో ఉంటే ఇబ్బంది కానీ కాంగ్రెస్‌లో చేరితే తమకే లాభమన్న వాదనను బీజేపీ నాయకులు వినిపిస్తున్నారు. ఒకవేళ ఆయన ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తే చీల్చేది బీఆర్‌ఎస్ ఓట్లేనని చెబుతున్నారు. నిర్మల్ నియోజకవర్గంలో కీలకంగా ఉన్న మైనార్టీ ఓట్లు కూడా రెండు పార్టీల మధ్య చీలితే మెజార్టీ ఓట్లు తమకే వస్తాయన్న అంచనాలు వేస్తున్నారు. ఖానాపూర్, ముధోల్ నియోజకవర్గాల్లో కూచాడి ప్రభావం పెద్దగా ఉండదని, నిర్మల్‌లో ఆయన రాక వందశాతం తమ పార్టీకే లాభమన్న భావన బీజేపీనుంచి వ్యక్తమవుతోంది.
కాంగ్రెస్‌లో జోష్ పెరిగేనా?
ఏఐసీసీ స్థాయికి ఎదిగిన మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రా మారావుపటేల్ తదితరులు వెళ్లిపోవడంతో జి ల్లాలో కాంగ్రెస్ కుదేలైంది. మళ్లీ కోలుకుంటుందో లేదోనన్న స్థాయికి దిగజారింది. ఒకరిద్దరు నేతలు మినహా పెద్దగా చెప్పుకోదగ్గ నాయకులెవరూ మిగల్లేదు. ఇలాంటి సందర్భంలో సారంగపూర్ జెడ్పీటీసీ పత్తిరెడ్డి రాజేశ్వర్‌రెడ్డి, ప్రముఖ న్యాయవాది అల్లూరి మల్లారెడ్డి చేర డం, యువనాయకులు అర్జుమంద్‌అలీ, జునై ద్, సేవాదళ్ మాజీ నేత ఎంబడి రాజేశ్వర్ తది తరులు యాక్టివ్ కావడం కొంత ఊరటనిచ్చింది.
అయినా ఎన్నికల్లో పోటీచేసే స్థాయిలో లేదనుకుంటున్న సమయంలో శ్రీహరిరావు చేరడం కాంగ్రెస్‌లో కొంత జోష్ నింపింది. అంతా అయిపోయిందని అనుకుంటున్న తరుణంలో రానున్న ఎన్నికలపై ఆశలు పెట్టుకునేస్థాయికి పార్టీ చేరడంతో క్యాడర్ సంతృప్తి వ్యక్తంచేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment