● మంత్రి కేటీఆర్ బుధవారం ఉదయం 10.30గంటలకు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా నేరుగా దిలావర్‌పూర్ మండలం గుండంపల్లి చేరుకున్నారు. ముందుగా లక్ష్మీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో పూజలు చేశారు. ఆ తర్వాత ఎస్సారెస్పీ బ్యాక్‌వాటర్‌లో నిర్మించిన శ్రీలక్ష్మీనర్సింహస్వామి ఎత్తిపోతల పథకం పంప్‌హౌస్‌కు వెళ్లి వాటర్ పంపింగ్ మోటార్ల బటన్ ఆన్‌చేశారు. అనంతరం దిలావర్‌పూర్–మాడేగాం శివారులోని వాటర్ డెలివరీ సిస్టర్న్ వద్దకు వెళ్లారు. అప్పటికే అక్కడికి గోదావరి నీళ్లు చేరుకున్నాయి. గోదారమ్మకు పూజలు చేసి, చీరెసారె సమర్పించారు. కాలువలకు నీటిని వదిలారు. పక్కనే ఏర్పాటు చేసిన సభలో సమీపగ్రామాల ప్రజలతో మాట్లాడారు.
● గుండంపల్లి హెలీప్యాడ్ నుంచి హెలికాప్టర్‌లో సోన్ మండలం పాక్‌పట్ల సమీపంలోని పాత పోచంపాడ్‌లో నిర్మించనున్న ప్రియూనిక్ ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ, మాదాపూర్ ఐబీ నుంచి గాంధీనగర్ వరకు రోడ్డు వెడల్పు, అటవీశాఖ మొసళ్లు, పక్షుల ఆవాస కేంద్రం పనులకు శంకుస్థాపన చేశారు. ఇక్కడ కూడా వివిధ జిల్లాల రైతులు, మండల ప్రజలనుద్దేశించి మాట్లాడారు.
● పాత పోచంపాడ్ నుంచి హెలికాప్టర్‌లో జిల్లాకేంద్రంలోని సమీకృత కలెక్టరేట్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి వాహనాల్లో స్థానిక పాత అర్బన్ తహసీల్ ఆఫీస్ వద్దకు వచ్చారు. ఇక్కడ నిర్మించనున్న సమీకృత వెజ్, నాన్‌వెజ్ మార్కెట్ పనులతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి శంకుస్థాపనలు చేశారు. పక్కనే నూతనంగా నిర్మించిన పెన్షనర్ల సంఘం మీటింగ్‌హాల్‌ను ప్రారంభించారు.
● సమీకృత మార్కెట్‌నుంచి నేరుగా ఎన్టీఆర్ మినీస్టేడియం చేరుకున్నారు. అక్కడ పార్టీ కార్యకర్తలు, నాయకులు కేటీఆర్, ఐకేరెడ్డి తదితరులకు ఘనస్వాగతం పలికారు. అక్కడే సభకు హాజరైన ప్రజలను ఉద్దేశించి మంత్రులు మాట్లాడారు.
● సభానంతరం నేరుగా మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఇంటికి చేరుకున్నారు. అక్కడ మంత్రి కుటుంబసభ్యులతో కలిసి కేటీఆర్ భోజనం చేశారు. అక్కడి నుంచి మళ్లీ సమీకృత కలెక్టరేట్ హెలీప్యాడ్‌కు వెళ్లి మధ్యాహ్నం 2.30గంటల సమయంలో హెలికాప్టర్‌లో కామారెడ్డి జిల్లా బాన్సువాడకు బయలుదేరారు.
Comments
Please login to add a commentAdd a comment