● జిల్లాలో ఎన్నో రంగులు.. ● ఇప్పటికీ ‘వెలుగులు’లేని ఊళ్
నిర్మల్: రంగులు లేని జీవితం ఉండదు. మనసును బట్టి మనిషి రంగు మారుతుంది. కొన్నిసార్లు ఆ మనిషి ఎంచుకునే రంగులూ తనేంటో చెబుతాయట. గట్ల(ఘాట్)కింద, గంగ(గోదావరి) ఇవతల ఉన్న మన జిల్లాలోనూ ఎన్నో రంగులున్నయ్. కల్లాకపటం తెలియని పల్లె మనుషుల మనసంతా తెలుపైతే.. అలాంటి కొన్ని పల్లెలు ఇప్పటికీ వెలుగును చూడకపోవడం నలుపే. తాము ఎంతటి దుస్థితిలో ఉంటున్నా ప్రశ్నించలేని ప్రశాంతత నీలమైతే.. తట్టుకోలేక తన్నుకొచ్చిన చైతన్యం ఎరుపవుతుంది. ఇలా ఎన్నోరంగులను తనలో ఇముడ్చుకున్న జిల్లాలో ఎన్ని హోలీపండుగలు వెళ్లిపోతున్నా.. ఇప్పటికీ ‘రంగులలోకం’ చూడని అడవిబిడ్డలూ ఉండటం శోచనీయమే. హోలీ పండుగవేళ సప్తవర్ణాల్లో జిల్లా.. ఎలా ఉందంటే..
తెలుపు..
నల్లరేగడి నేలలు పర్చుకున్న జిల్లాలో ‘తెల్ల’బంగారం పండుతోంది. ఇప్పటికీ సగానికిపైగా జిల్లాకు అదే పెద్ద దిక్కవుతోంది. ఇప్పుడంటే మైసా(భైంసా)లో మిల్లులు తగ్గిపోయాయి కానీ.. ఒకప్పుడు కనుచూపు మేరంతా ‘కాటన్’ సంచులు నిండిన ఎడ్లబండ్లే ఉండేవి. ‘బాపూ.. కాలేజీల ఫీజు కట్టాలటనే..’అని పట్నంలో చదువుతున్న కొడుకు అడిగితే.. ‘ఆగు బిడ్డా.. రేపు మైసాకు పోయచ్చినంక పైసల్ పంపిస్త..’ అనేవాళ్లు. ఇక ఇదే జిల్లాలో ఇంకోదిక్కు.. తెల్లటి మనసున్న అడవి బిడ్డలు ఉన్నారు. ఎన్నికష్టాలున్నా.. ఏ ‘రంగులు’ లేని స్వచ్ఛమైన నవ్వులతోనే జీవితాన్ని గడిపేస్తున్నారు.
నలుపు..
జిల్లాలో ఇప్పటికీ ‘నల్లని ఊళ్లు’ ఉన్నాయి. నల్లని ఊళ్లా.. అవేంటి..!? అని ఆశ్చర్యపోవచ్చు. ఏ వెలుగూ లేకపోతే ఉండేది ‘నల్లటి’ చీకటే కదా..! ఇప్పటికీ జిల్లాలో కనీసం కరెంటు లేని ఊళ్లు, రోడ్లు లేని పల్లెలు ఉన్నాయి. ఎప్పుడో ఇచ్చిన సోలార్‌లైట్లు అప్పుడప్పుడు మిణుకుమిణుకు మంటుంటే.. ఆముదం పోసిన దీపాల వెలుగుల్లోనే జీవితాలు గడిపేస్తున్నారు. తరాలు గడిచిపోతున్నా.. చాకిరేవు, రాగిదుబ్బ, సోముగూడ, మిద్దెచింత ‘చీకట్లు’ తొలగడం లేదు. అంకెన, రాయదారి, కోరకంటి, వస్‌పెల్లి, ధోంధరి, గంగాపూర్, గండిగోపాల్‌పూర్, ఇస్లాంపూర్, అల్లంపెల్లి, బాబానాయక్‌తండా, కుసుంపూర్, చామన్‌పెల్లి, కొత్తగూడ, జిల్లెడుకుంట, పంగిడిచెరు, పెండల్‌దరిలకు ఇప్పటికీ సరైన దారీ లేదు.
పసుపు..
రంగుకే పేరు తెచ్చిన పసిడిపంట పసుపు. ఈ సీజన్‌లో నిర్మల్ డివిజన్‌లోని నీటి కాలువలు, చెరువులు ఉన్న పంట ఏరియాల వెంట వెళ్తూ ఉంటే.. ఉడకబెడుతున్న పసుపు వాసన ఆహా.. అనిపిస్తుంది. పక్కజిల్లాలో వచ్చిన పసుపుబోర్డు జిల్లా రైతులలో ఇంకా ఆశలు పెంచింది. కానీ ఇప్పటికిప్పుడు పసిడి లెక్క ధర పెరిగే అవకాశాలు మాత్రం కనిపించడం లేదు.
ఎరుపు..
‘ఎర్రటి’బొట్టు పెట్టుకున్న అమ్మలే జిల్లాకు పట్టుగొమ్మలు. అవును.. జిల్లా మహిళల ఖిల్లా. సీ్త్ర, పురుష జనాభా నిష్పత్తిపరంగా చూస్తే రాష్ట్రంలోనే నిర్మల్ జిల్లా అధిక మహిళానిష్పత్తితో ప్రథమస్థానంలో ఉంది. ప్రతీ వెయ్యిమంది పురుషులకు 1,046 మంది మహిళలు ఉన్నారు. ‘ఎరుపంటే’.. చైతన్యానికి ప్రతీక. జిల్లాలోనూ ఇప్పుడంతా మహిళల రాజ్యమే. కలెక్టర్, ఎస్పీ, ఆర్డీవో, డీఆర్డీవో వంటి జిల్లా అధికారులే కాదు.. మండల, గ్రామస్థాయిలోనూ స్వయంశక్తితో సాధికారత సాధిస్తుందీ చైతన్యమూర్తులైన మహిళలే.
ఆకుపచ్చ..
జిల్లాలో ఓ దిక్కు తెల్లబంగారం మెరుస్తుంటే.. మరోవైపంతా.. ‘పచ్చదనమే’. నిర్మల్ జిల్లాకేంద్రం నుంచి అలా ఖానాపూర్, కడెంవైపు వెళ్తుంటే ఆకుపచ్చకోక కట్టిన అడవి అందాలు ఆకట్టుకుంటాయి. ఒక్కసారి గంగాపూర్ వాచ్‌టవర్ ఎక్కిచూస్తే ‘ఆహా..’ అనిపిస్తుంది. అలాంటి పచ్చదనం క్రమంగా తగ్గుతోంది. జిల్లాలో ఇప్పటికీ చెట్ల నరికివేత యథేచ్ఛగా సాగుతోంది. కలప అక్రమ రవాణా అలాగే ఉంది.
నీలం..
‘నీలి’వర్ణాన్ని నిండా నింపుకుని గలగల పారేటి గోదారమ్మ జిల్లాపొడవునా ‘సాగు’తోంది. ‘సరస్వతమ్మ’తో జలసిరులు సాగనంపుతూ అన్నదాతకు అండగా ఉంటోంది. ఓ దిక్కు స్వర్ణమ్మ, మరోదిక్కు కడెం, ఇంకోదిక్కు సుద్ధవాగులూ జిల్లాకు జీవం పోస్తున్నాయి. వరి, మొక్కజొన్న, జొన్న, పసుపు వంటి ఎన్నో పంటల సాగుతోపాటు జిల్లావాసులకు ‘భగీరథ’తో తాగునీటిని అందిస్తున్నాయి ఈ నీలివర్ణపు జలాలే.
కాషాయం..
జిల్లాలో ఇటీవల కాషాయవర్ణం మెరుస్తోంది. రాజకీయపరంగా బీజేపీని కాషాయంతో పోలుస్తుంటారు. జిల్లా చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా తొలిసారి బీజేపీ నిర్మల్, ముధోల్‌లో రెండు ఎమ్మెల్యే స్థానాలు గెలిచింది. ఎంపీ ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు కాషాయపార్టీకి జిల్లానే అధిక్యతనిచ్చింది. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఆ పార్టీకి అధిక ఓట్లను కట్టబెట్టింది. ఇద్దరు ఎమ్మెల్యేలను, ఎంపీని, ఎమ్మెల్సీలనూ గెలిపించినా కేంద్రంలో అధికారంలో ఉన్న కాషాయపార్టీది జిల్లాపై శీతకన్నే. జిల్లా మీదుగా రైల్వేలైన్, నవోదయ, యూనివర్సిటీ వంటి ఎన్నో పనులను చేయాల్సి ఉన్నా.. కేవలం ‘కాషాయ’వర్ణాన్ని చూపి, మాయచేస్తోందన్న ఆరోపణలూ ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment