సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమకే మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలంటూ పట్టభద్రులు, టీచర్ల ఓటర్లకు నిత్యం పదుల సంఖ్యలో కాల్స్, మేసేజ్‌లు వస్తున్నాయి. కాల్ లిఫ్ట్ చేసే వరకూ ఫోన్లు మోగుతూనే ఉంటున్నాయి. ఒకరు ఇద్దరు కాదు లక్షలాది మంది ఓటర్ల ఫోన్ నంబర్లకు ఇలా ఫోన్లు వస్తున్నాయి. కొందరు చాటుగా ఫోన్ నంబర్లు తీసుకుని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడంతో నిత్యం ఓటర్లకు కాల్స్ వస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల స్థానానికి ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఓటర్లందరూ విద్యావంతులే. కానీ, వారికి తెలియకుండానే ఫోన్ నంబర్లు సేకరించి నేరుగా అభ్యర్థులు ఫోన్లు వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. ఈ ఫోన్ నంబర్లనూ పైసలకు అమ్ముకోవడం గమనార్హం.
ప్రైవేట్ వ్యక్తుల చేతిలో..
ఓటరు నమోదు సమయంలో ఎన్నికల సంఘం అధికార వెబ్‌సైట్, మాన్యువల్‌గా దరఖాస్తు చేసిన సమయంలో ఫోన్ నంబర్లను కూడా పేర్కొన్నారు. అలా అనేక మంది ఓటర్ల ఫోన్ నంబర్లు నిక్షిప్తమయ్యాయి. అయితే అధికార వెబ్‌సైట్‌లో నమోదు చేసిన వ్యక్తిగత వివరాలు గోప్యంగా ఉంచాలి. కానీ జిల్లాల్లో ఎన్నికల విభాగంలో పని చేస్తున్న కొందరు అధికారులు బయటకు ఇస్తున్నారు. బరిలో ఉన్న అభ్యర్థులు వివరాలు వాటిని కొనుగోలు చేసి వాడుకుంటున్నారు. ప్రచారం నుంచి సర్వేలదాకా పలు సంస్థలు, సోషల్‌మీడియా వేదికగా వాడుకుంటున్నాయి. చాలా మందికి ఒకటికి రెండుసార్లు ఫోన్లు చేస్తూ ఓటర్లకు చిరాకు తెప్పిస్తున్నారు. తక్కువ స మయంలో ఎక్కువ మందిని పలకరించేలా, నేరుగా ఫోన్ నంబర్లపైనే అభ్యర్థులు ఆధారపడుతున్నారు.
లక్షలాది ఫోన్ నంబర్ల సేకరణ
ఓట్ల కోసం లక్షలాది మంది ఓటర్ల వివరాలు సేకరించారు. ఎన్నికలు ముగిసినప్పటికీ వివిధ వ్యాపార ప్రకటనలు, ఇతరత్ర అవసరాల కోసం కూడా ఈ ఓటర్ల ఫోన్ నంబర్లు ఉపయోగించుకునే అవకాశం ఉంది. మహిళల ఫోన్ నంబర్లతోపాటు వారి సోషల్ మీడియా అకౌంట్లు లింకు ఉన్న వాటికి కూడా ప్రకటనలు పంపుతున్నారు. ఇలాంటి ఫోన్ కాల్స్‌తో సైబర్ నేరాలకు ఆస్కారం ఉంటుంది. అయితే కొందరు ఆ నంబర్ల నుంచి కాల్ రాగానే బ్లాక్ లేదా, స్పామ్‌గా రిపోర్టు చేస్తున్నారు.
ఓటరు నమోదు సందర్భంగా లక్షలాది మందివి సేకరణ ఒక్కో పీడీఎఫ్ కాపీకి రూ.20 వేల నుంచి రూ.50 వేలు కొనుగోలు చేస్తున్న ఎమ్మెల్సీ అభ్యర్థులు ఓటర్లకు నిత్యం కాల్స్, మెసేజ్‌లు
‘నేను మీ ఎమ్మెల్సీ అభ్యర్థిని.. బ్యాలెట్ పేపర్‌లో నాది ఫలానా నంబర్. మీ పోలింగ్ బూత్ నంబర్ ఇదీ.. మీ మొదటి ప్రాధాన్యత ఓటు నాకే వేసి గెలిపించాలి’ ఇదీ మంచిర్యాల జిల్లా కేంద్రానికి చెందిన ఓ పట్టభద్రుడికి వచ్చిన ఫో న్. ఇలా అతడికి రోజూ పదుల సంఖ్యలో కా ల్స్ వస్తున్నాయి. కానీ, సదరు ఓటరు ఏ అభ్యర్థికీ తన ఫోన్ నంబర్ ఇవ్వలేదు. అయినా కా ల్స్ ఎలా వస్తున్నాయో అర్థం కాక తల పట్టుకుంటున్నాడు. టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థులూ ఇదే తరహాలో ఫోన్లు, మెస్సేజ్‌లు చేస్తున్నారు.
‘మా వద్ద పట్టభద్రులు, టీచర్ ఓటర్ల పేర్లు, అడ్రస్, ఫోన్ నంబర్ సహా వివరాలు ఉన్నాయి. మీకు కావాలంటే చెప్పండి. రూ.30 వేలు ఇస్తే మీకు పీడీఎఫ్ కాపీ పంపుతాం’ అని ఓ స్వతంత్ర అభ్యర్థికి ఓ వ్యక్తి ఆఫర్ చేశాడు. ‘నేను అంత ఇవ్వలేను’ అని ఆ అభ్యర్థి చెబితే..‘రాజకీయ పార్టీల వాళ్లు మాకు ఒక్కో పీడీఎఫ్‌కు రూ.50 వేలు ఇచ్చారు. ఇప్పటికే వారందరూ ఓటర్లకు ఫోన్లు, మెసేజ్‌లు, వాట్సాప్‌లో సందేశాలు పంపుతున్నారు. మీరు కూడా అలాగే ప్రచారం చేసుకోవచ్చు’ అని సూచించాడు.
Comments
Please login to add a commentAdd a comment