‘నయనం’ ప్రధానం
● విద్యార్థి దశలోనే దృష్టి లోపాలు
● ఆర్బీఎస్కే స్కీం కింద పరీక్షలు
● జిల్లాలో 1,578 మందికి సమస్య
● త్వరలో వీరికి కళ్లద్దాల పంపిణీ
నిర్మల్‌చైన్‌గేట్: ఒకప్పుడు వయస్సు మీరిన వారికి వచ్చే కంటి సమస్యలు ఇప్పుడు చిన్నారులకూ వస్తున్నాయి. పోషకాహార లోపం, సెల్‌ఫోన్ వినియోగం, ఎక్కువ సమయం టీవీలు చూడడంతో కంటి సమస్యలు పెరుగుతున్నాయి. విద్యార్థుల శ్రేయస్సు కోసం రాష్ట్రీయ బాల స్వాస్థ్య (ఆర్బీఎస్‌కే) కార్యక్రమం, జిల్లా అంధత్వ నివారణ సంస్థ, వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో ఈనెల 17నుంచి ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లోని విద్యార్థులకు ఉచిత నేత్రపరీక్షలు నిర్వహిస్తున్నారు. పిల్లల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా వైద్యారోగ్య శాఖ, ఆర్‌బీఎస్‌కే కార్యక్రమం సంయుక్తంగా ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాల్లో ఐదు నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న వారికి కంటి పరీక్షలు నిర్వహిస్తోంది. వైద్య నిపుణుల బృందాలు పాఠశాలల్లో ఇప్పటివరకు 46,453 మందికి స్క్రీనింగ్ చేశాయి. మూడు విడతల్లో నిర్వహించిన వైద్యపరీక్షల్లో 1,578 మంది పిల్లలు కంటిచూపు సమస్యతో బాధపడుతున్నట్లు గుర్తించారు. కొంతమంది దూరపు చూపు, మరికొందరు దగ్గరి చూపు సమస్యతో ఇబ్బంది పడుతున్నట్లు నిర్ధారించారు. మెజార్టీ పిల్లలు కనీసం అక్షరాలు చదవలేకపోతున్నట్లు తేల్చారు.
అతుక్కుపోతున్నందునే..
పాఠశాలల నుంచి ఇంటికి చేరిన వెంటనే చాలామంది పిల్ల లు సెల్‌ఫోన్లు, టీవీలకు అతుక్కుపోతున్నారు. గంటల తరబడి వీడియో గేమ్‌లు ఆడుతున్నారు.. కార్టూన్ సీరియళ్లు చూస్తున్నారు. హోం వర్క్ కంటే వీటిపైనే అధికంగా దృష్టి సారిస్తుండడంతో చిన్న వయసులోనే సోడాబుడ్డి లాంటి కంటి అద్దాలు ధరించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. కరోనా సమయంలో ఆన్‌లైన్ విద్యతో తల్లిదండ్రులు కూడా విద్యార్థులను తప్పనిగా సెల్‌ఫోన్ వినియోగంవైపు మళ్లించాల్సిన అవసరం ఏర్పడింది. అదికాస్త అలవాటుగా మారి దుష్పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
వివిధ ఆస్పత్రులకు తరలించి..
మసక చూపుతో బాధపడుతున్న నిర్మల్, ఖానాపూర్ నియోజకవర్గాలకు చెందిన పిల్లలను జిల్లా జనరల్ ఆస్పత్రి, ముధోల్ నియోజకవర్గానికి చెందిన పిల్లలను భైంసా ఏరియాస్పత్రికి తరలించి పరీక్షలు చేయిస్తున్నారు. ఒక్కో ఆస్పత్రిలో రోజుకు 80–100 మంది విద్యార్థులకు మూడో విడత చెకప్ చేస్తున్నారు. వీరిలో కంటి అద్దాలు అవసరమైన వారికి నిర్ధారించిన సైట్ పర్సంటేజీ, ఫ్రేమ్‌లు, అద్దాలకు ఆర్డర్లు కూడా ఇస్తున్నారు. వార్షిక పరీక్షల ప్రారంభానికి ముందే వీరికి అద్దాలు పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే 1,578 మంది విద్యార్థులకు సంబంధించి అద్దాలకు ఆర్డర్ ఇచ్చినట్లు అధికారులు తెలిపారు.
పరీక్షలు నిర్వహిస్తున్నాం
వైద్యశిబిరంలో నిపుణులైన వైద్యులు విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహిస్తున్నాం. గతంలో దృష్టిలోపం ఉన్న విద్యార్థులకు తిరిగి పరీక్షలు చేయిస్తున్నాం. జిల్లా జనరల్ ఆస్పత్రితో పాటు భైంసా ఏరియాస్పత్రిలో కంటి వైద్యశిబిరం కొనసాగుతుంది.
– శ్రీనివాస్, ఆర్బీఎస్‌కే ప్రోగ్రాం అధికారి
సమస్యలకు కారణాలివే..
కంటి సమస్యతో బాధపడుతున్న విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. విటమిన్ ‘ఏ’ కంటి సమస్యలు రాకుండా చూస్తుంది. ఇందుకు పిల్లలకు పాలు, గుడ్లు, కూరగాయలు, ఆకుకూరలు, చేపలు రోజువారీ ఆహారంలో ఇవ్వాలి. సెల్‌ఫోన్లు, టీవీలు చూసినపుడు వాటి స్క్రీన్ నుంచి వచ్చే కాంతి కిరణాలు పిల్లల కంటిపై పడి దృష్టిలోపం రావడానికి కారణమవుతున్నాయి. శారీరక శ్రమ లేకపోవడం కూడా కంటి సమస్యలకు కారణం కావచ్చు. ఎంత చిన్న కంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యులకు చూపించాలి.
– సురేశ్, సీనియర్ నేత్ర వైద్యుడు
‘నయనం’ ప్రధానం
‘నయనం’ ప్రధానం
‘నయనం’ ప్రధానం
Comments
Please login to add a commentAdd a comment