లేడీ సింగంలు..!
● ఠాణా గడప దాటి.. శాంతి భద్రతలకు కదిలి.. ● పెట్రో కారెక్కిన మహిళా పోలీసులు ● డ్యూటీలో సగమై.. గస్తీలో భాగమై.. ● మహిళా దినోత్సవం సందర్భంగా.. లేడీ పోలీసులకు కొత్త విధులు ● ఇకపై వారానికో రోజు బాధ్యతలు.. ● వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఎస్పీ
నిర్మల్: పోలీసుశాఖకు ఫోన్లు కామనే కదా..!? ఇందులో ప్రత్యేకత ఏముంది అంటారా..!? ఈ ఫోన్లు చేసింది మహిళా కానిస్టేబుళ్లు. ఎప్పుడూ స్టేషన్ విధుల్లో.. లేదంటే ఎక్కడైనా కార్యక్రమాల వద్ద బందోబస్తులో మాత్రమే కనిపించే ఈ లేడీ కానిస్టేబుళ్లు తొలిసారి ఠాణా గడపదాటి.. శాంతిభద్రతల పరిరక్షణకు కదిలారు. తొలిసారి లేడీ సింగంలా బాధ్యతలు నిర్వర్తించారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎస్పీ జానకీషర్మిల గురువారం ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మహిళ కానిస్టేబుళ్లు సైతం పురుషులతో సమానంగా శాంతిభద్రతల్లో భాగం అవుతారని నిరూపించుకునేందుకు.. వారానికోసారి మహిళా కానిస్టేబుళ్లు సైతం పెట్రోకార్ డ్యూటీ చేసే అవకాశం కల్పించారు. తొలిరోజు లేడీ కానిస్టేబుళ్లు అదరగొట్టారు. ఈ తరహా ప్రయోగంపై ఏకంగా డీజీపీ జితేందర్ నుంచి ఎస్పీతోపాటు నిర్మల్ జిల్లా పోలీసులు ప్రశంసలు అందుకున్నారు.
స్టేషన్‌కే పరిమితమై..
మహిళా కానిస్టేబుళ్లు(డబ్ల్యూపీసీ) అంటే స్టేషన్ లోపల పనులకే పరిమితం.. అన్నట్లుగా పోలీసు వ్యవస్థ స్థిరపడిపోయింది. మహా అంటే.. ఎక్కడైనా ధర్నాలు, నిరసనలు, ఆందోళనలు, ర్యాలీల్లో మహిళలు ఉంటే అక్కడికి వీరిని పంపిస్తుంటారు. ఖాకీ డ్రెస్ వేసుకున్నట్లే.. పేరుకు పోలీసన్నట్లే కానీ.. వీరికి పోలీసింగ్ బాధ్యతలు అప్పగించేవారు కాదు. ఇదిగో.. ఇలాంటి వ్యవస్థలో తొలిసారి ఎస్పీ జానకీషర్మిల ఓ కదలిక తీసుకొచ్చారు. తాను మహిళనే కదా.. ఓ జిల్లా బాధ్యతలు చూడటం లేదా.. అన్న ఆలోచనల్లో నుంచి తమ మహిళా కానిస్టేబుళ్లకూ ఓ అవకాశాన్ని కల్పించారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలోని డబ్ల్యూపీసీలు వారానికోరోజు పెట్రోకార్ అంటే గస్తీ, డయల్ 100, చెకింగ్ పాయింట్‌లు తదితర పోలీసింగ్ విధులను చేపట్టాలని ఆదేశించారు.
భేష్ అనిపించారు..
తమపై భరోసా ఉంచి తమ పైఅధికారి కల్పించిన అరుదైన అవకాశాన్ని మహిళా కానిస్టేబుళ్లు సద్వినియోగం చేసుకున్నారు. తొలిరోజే తామేంటో నిరూపించుకునేలా పనిచేసి ఉన్నతాధికారుల మెప్పు పొందారు. డయల్ 100కు వచ్చిన ఫిర్యాదులను అందుకుని ఘటన స్థలాలకు వెళ్లారు. అక్కడి పరిస్థితిని ఉన్నతాధికారికి వివరించి చర్యలు చేప ట్టారు. రోడ్డుభద్రత చర్యలతోపాటు రోజువారీగా పెట్రోకార్ సిబ్బంది చేయాల్సిన విధులన్నీ విజయవంతంగా పూర్తిచేశారు. చాలామంది పోలీసయ్యాక ఈరోజు చాలా హ్యాపీ అనిపించిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment