నాట్యగురువు సౌమ్య
● చిన్నారులకు కూచిపూడిలో శిక్షణ ● రికార్డ్ ప్రదర్శనల్లో భాగస్వామ్యం
భైంసాటౌన్: చిన్ననాటి నుంచే నృత్యంపై ఉన్న మక్కువతో తాను నేర్చుకుని ఎంతోమంది చిన్నారులకు నేర్పుతూ దానినే ఉపాధిగా మలుచుకున్నారు భైంసాకు చెందిన రంగు సౌమ్య. జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయి వేదికల్లోనూ తన శిష్యబృందంతో ప్రదర్శనలు ఇప్పిస్తున్నారు. ఫలితంగా నృత్యరంగంలో భైంసాకు ప్రత్యేక గుర్తింపు తెస్తూ అందరి అభినందనలు అందుకుంటున్నారు. సౌమ్యకు చిన్నప్పటి నుంచే నృత్యంపై మక్కువ ఉన్నా పెళ్లయిన తరువాత భర్త ప్రోత్సాహంతో నిజామాబాద్‌లో నృత్య గురువులు భీమన్, దేవులపల్లి ప్రశాంత్ వద్ద నాలుగేళ్లపాటు కూచిపూడి నృత్యంలో శిక్షణ తీసుకున్నారు. అనంతరం భైంసాలో తానే సొంతంగా శ్రీనయనం నృత్యా కళానిలయం పేరిట చిన్నారులకు ప్రధానంగా కూచిపూడి నృత్యంలో శిక్షణ ఇస్తున్నారు. మొద ట ఐదుగురు చిన్నారులతో మొదలై, నేడు వందమందికి పైగా శిక్షణ తీసుకుంటున్నారు. తన వద్ద శిక్షణ పొందిన చిన్నారులతో పలు పుణ్యక్షేత్రాల్లో ప్రదర్శనలు ఇప్పిస్తూ ఎన్నో ప్రశంసాపత్రాలు, అవార్డులు అందుకున్నారు. తన భర్త, కుటుంబీకుల ప్రోత్సాహంతోనే తాను నృత్య రంగంలో రాణిస్తున్నట్లు ఈ సందర్భంగా రంగు సౌమ్య తెలిపారు.
శిష్యబృందంతో ఇచ్చిన ప్రదర్శనలు
● అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని పురస్కరించుకుని తన శిష్యబృందంతో నృత్య ప్రదర్శన ఇచ్చి ప్రశంసాపత్రాలు అందుకున్నారు.
● ఇటీవల అరుణాచలంలో ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు 15 మంది చిన్నారులతో కలిసి నృత్య ప్రదర్శన ఇచ్చారు.
● హైదరాబాద్‌లో నిర్వహించిన గిన్నిస్‌బుక్ రికార్డ్ నృత్య ప్రదర్శనలోనూ పాల్గొని పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు అందుకున్నారు.
● గతనెలలో రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్ శివారులోని సమతా స్ఫూర్తి కేంద్రంలో సమతాకుంభ్–2025 పేరిట తృతీయ బ్రహ్మోత్సవాలు నిర్వహించగా 3వేల మంది చిన్నారులతో నృత్య రూపకాలు ప్రదర్శించారు. ఈ ప్రదర్శనలు ఇండియన్ వరల్డ్ రికార్డ్స్, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌కు నమోదయ్యాయి. ఇందులో భైంసా నుంచి శ్రీనయనం నృత్య కళానిలయానికి చెందిన 21 మంది చిన్నారులు పాల్గొని ప్రశంసాపత్రాలు అందుకున్నారు.
నాట్యగురువు సౌమ్య
Comments
Please login to add a commentAdd a comment