అమ్మా.. నీ తప్పుకు నన్ను చంపేశావా?
‘అమ్మా.. ఇంకో మూడు నెలలైతే లోకం చూసేవాడిని కదమ్మా.. ఎందుకమ్మ ఇంత పనిచేశావు. నీ కడుపులో నన్ము మోయలేకపోయావా.. ఆరు నెలలుగా నీ కడుపులో హాయిగా పెరుగుతున్నా.. నీవు మింగిన మాత్రలకు నాకు ఊపిరి ఆడడం లేదమ్మా.. లోకం చూపించి అనాథాశ్రమంలో పడేసినా బాగుండేది.. తెల ్లవారేసరికే నా ఊపిరి తీశావేంటమ్మా.. నీవు చేసిన తప్పుకు నన్ను బలి ఇచ్చావా..’
గుడిహత్నూర్: ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలోని గురుజ వాగులో పడేసిన పిండానికి మాటలు వస్తే ఇలాగే ప్రశ్నించేదేమో. క్షణికావేశంలో చేసిన తప్పుకు గర్భం దాల్చిన ఓ యువతి.. బయటి ప్రపంచానికి ఆ విషయం తెలియకుండా ఉండేందుకు ఆరు నెలల గర్భంలోనే పిండాన్ని చంపేశారు. ఈ హృదయ విదారక సంఘటన గురుజ గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి... మంగళవారం ఉదయం గ్రామ శివారులోని వాగు ప్రాంతానికి బహిర్భూమికి వెళ్లిన కొందరు గ్రామస్తులకు మృత శిశువు కనిపించింది. పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్సై మహేందర్ సంఘటనా స్థలానికి చేరుకొని శిశువు మృతదేహాన్ని రిమ్స్‌కు తరలించారు. ఈ ఘటనపై విచారణ చేపట్టారు. స్థానికులు అందించిన వివరాలను సేకరించి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకొని వెంటనే దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో ఓ యువతి, ఇద్దరు యువకులతోపాటు ఆర్‌ఎంపీని అదుపులోని తీసుకున్నట్లు తెలిసింది. పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన ఓ యువతి.. ఆరు నెలల గర్భాన్ని తీయించుకునేందుకు ఆర్‌ఎంపీని ఆశ్రయించినట్లు సమాచారం. మంగళవారం రాత్రి గ్రామంలో తిరిగిన సదరు ఆర్‌ఎంపీ ప్రాణాపాయమని తెలిసినా.. ఆరు నెలల గర్భాన్ని తొలగించారు. ఆ పిండాన్ని ఇలా వాగులో పడేసి ఉంటారని ప్రచారం జరుగుతోంది. దర్యాప్తు పూర్తి కానందున పూర్తి వివరాలు బుధవారం అందిస్తామని సీఐ భీమేష్ తెలిపారు. మృత శిశువును పరీక్షించిన వైద్యులు మగ శిశువుగా నిర్ధారించారు. పిండం వయస్సు సుమారు 6 నెలలు దాటి ఉండవచ్చని సమాచారం.
గురుజలో ఆరు నెలల పిండం
కడుపులోనే చంపి.. వాగులో పడేసి..
విచారణ జరుపుతున్న పోలీసులు...
Comments
Please login to add a commentAdd a comment