ఎదగని బాల్యం!
● వయసుకు తగిన బరువు, ఎత్తు లేని చిన్నారులు.. ● జిల్లా వ్యాప్తంగా 791 మంది గుర్తింపు ● 176 మంది పిల్లల్లో పోషకాహార లోపం
లోకేశ్వరం: ఆరోగ్యానికి పోషకాహారం ఎంతో అవసరం. ఎదిగే పిల్లలు అనారోగ్యం బారిన పడకుండా ఉండాలంటే సమతుల ఆహారం అందించాలి. ఇందు కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పాలు, గుడ్లు, బాలామృతం, మ ధ్యాహ్న భోజనం అందిస్తున్నాయి. అయినా పిల్లలు ఇంకా బలహీనంగానే ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా 791 మంది ఎత్తుకు దగ్గ బరువు, వయసుకు తగిన ఎత్తు లేరని, 176 మంది చిన్నారులు పోషకాహార లోపంతో బాధపడుతున్నట్లు తాజా నివేదికలు చెబుతున్నాయి.
జిల్లా వివరాలు..
జిల్లా వ్యాప్తంగా 926 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో ఆరు నెలల నుంచి 3 ఏళ్లలోపు చిన్నారులు 27,473 మంది, 3 నుంచి 6 ఏళ్లలోపు పిల్లలు 25,187 మంది ఉన్నారు. వీరిలో 967 మంది చిన్నారులు ఎత్తుకు తగిన బరువు లేకపోవడం, మరికొందరు వయసుకు తగిన ఎత్తు పెరగకపోవడం ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలో 4,765 మంది గర్భిణులు ఉండగా, బాలింతలు 5,051 మంది ఉన్నారు. వీరి ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకోవడంతోపాటు పుట్టిన శిశువు ఆరేళ్ల వయసు వచ్చే వరకు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం అందిస్తున్నాయి. అయినా వందల మంది చిన్నారులు పోషకాహారం లోపంతో బాధపడుతుండడం ఆందోళన కలిగించే అంశం.
వేధిస్తున్న సిబ్బంది కొరత ..
పేద, మధ్య తరగతి కుటుంబాల ఆరోగ్య కల్పతరువు అంగన్‌వాడీ కేంద్రాలు. అయితే ఈ కేంద్రాల్లోనే అనేక సమస్యలు ఉన్నాయి. ఒక్కో సెంటర్‌కు ఒక టీచర్, ఒక ఆయా తప్పనిసరిగా ఉండాలి. జిల్లావ్యాప్తంగా 926 కేంద్రాలకు 833 మంది టీచర్లు మాత్రమే ఉన్నారు. 93 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆయాలు 541 మంది మాత్రమే ఉన్నారు. ఇంకా 385 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ముధోల్, భైంసా సీడీపీవో పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. ఇన్‌చార్జీలతో నెట్టుకొస్తున్నారు. చిన్నపిల్లలు కేంద్రాలకు రాకుంటే ఆయా ఇళ్లకు వెళ్లి కేంద్రానికి తీసుకురావాలి. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు మెనూ ప్రకారం వంట చేసి పెట్టాలి. టీచర్ ఆట వస్తువులతో పిల్లలను ఆడిస్తూ పూర్వ ప్రాథమిక విద్యను బోధించాల్సి ఉంటుంది. సిబ్బంది కొరతతో లబ్ధిదారులకు పోషకాలతో కూడిన ఆహారం అందడం లేదు. అక్షరాలకు శ్రీకారం చుట్టే అంగన్‌వాడీ కేంద్రాలు చాలా వరకు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. ఇరుకు గదులు, గాలి, వెలుతురు సరిగా లేకుండా, రేకుల షెడ్లు, పూరి గుడిసెల్లో కొనసాగుతున్నాయి. జిల్లా 926 కేంద్రాలకు ఉండగా వీటిలో పక్కగా భవనాలు కేవలం 194 ఉన్నాయి. 363 అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. 369 ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహిస్తున్నారు.
ప్రత్యేక దృష్టి సారించాం
పోషకాహార లోపం, ఇతర సమస్యలతో ఎదగని చి న్నారుల కోసం ప్రత్యేక మెనూ కొనసాగిస్తున్నాం. నిబంధనల ప్రకారం 7 నెలల నుంచి 3 ఏళ్ల పిల్లలకు నెలకు 16 గుడ్లు మాత్రమే ఇస్తాం. కానీ ఎత్తుకు తగిన బరువు, వయసుకు తగిన ఎత్తు పెరగని చిన్నారుల కోసం ప్రతీరోజు గుడ్డు, బాలామృతం ప్లస్‌తోపాటు భోజనం అందిస్తాం. పది రోజుల కోసారి వైద్య సిబ్బందితో పరీక్షలు చేయిస్తున్నాం. ఆందోళనకరంగా ఉన్న పిల్లలకు మెరుగైన వైద్యం అందిస్తున్నాం.
– ఫైజాన్ అహ్మద్, అదనపు కలెక్టర్ నిర్మల్
ప్రాజెక్టుల వారీగా పిల్లలు, అంగన్‌వాడీ ఖాళీల వివరాలు...
ప్రాజెక్టులు 6 నెలల నుంచి బరువు తక్కువ పోషకాహార లోపం అంగన్‌వాడీ ఆయా
6 ఏళ్ల పిల్లలు ఉన్న పిల్లలు ఉన్న పిల్లలు టీచర్ ఖాళీలు ఖాళీలు
నిర్మల్ 21,152 318 46 36 140
భైంసా 11,764 152 34 27 67
ఖానాపూర్ 11,350 221 75 14 104
ముధోల్ 9,361 100 21 16 74
మొత్తం 53,627 791 176 93 385
Comments
Please login to add a commentAdd a comment