కంచె.. కాటేస్తోంది..!
విద్యుత్ కంచెలతో జరిగిన కొన్ని ప్రమాదాలు..
2024లో.. మృతి చెందిన రైతులు 21 మృతి చెందిన మూగజీవాలు 65
2025లో.. మృతి చెందిన రైతులు 13 మృతి చెందిన మూగజీవాలు 76
● ఇటీవల ఉమ్రి(కే) గ్రామానికి చెందిన కదం దత్తురాం సమీపంలోని వ్యవసాయ మోటారు నుంచి నీరు తెచ్చే క్రమంలో విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు.
● సోన్ మండలం పాక్‌పట్ల గ్రామానికి చెందిన రైతు బోర నర్సయ్య ఇటీవల ఎర్త్‌వైర్‌కు ఏర్పాటు చేసిన బల్పు తీసే క్రమంలో షాక్‌కు గురై మృతి చెందాడు.
● రెండేళ్ల క్రితం బాసర మండలం కిర్గుల్(కె) గ్రామానికి చెందిన రాజలింగం, నర్సాపూర్(జి) మండలం గొల్లామాడ గ్రామానికి చెందిన నిమ్మన్న అనే రైతులు పంట రక్షణ కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు తగిలి మృతి చెందారు.
● ముధోల్ మండల కేంద్రానికి చెందిన కౌలు రైతు లక్ష్మణ్ రెండేళ్ల క్రితం మొక్కజొన్న పంటకు నీరుపెట్టేందుకు వెళ్లి విద్యుత్ కంచెకు తగిలి మృతి చెందాడు.
● మూడేళ్ల క్రితం తానూరు మండలం భోసి గ్రామానికి చెందిన తండ్రీ కొడుకులు కర్జల రాములు, మురళి పంట రక్షణ కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు తగిలి పొలంలోనే మృతి చెందారు.
● మూడేళ్ల క్రితం తానూరు మండలం హిప్నెల్లి తండాకు చెందిన జాదవ్ రాము, హిప్నెల్లి గ్రామానికి చెందిన విఠల్ పంట రక్షణ కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలకు తగిలి మృతి చెందారు.
● సారంగాపూర్ మండలం ధని గ్రామంలో నిర్మల్ పట్టణానికి చెందిన కౌన్సిలర్ అంగ నరేశ్ పేకాడుతుండగా పోలీసులు దాడిచేశారు. వారి నుంచి తప్పించుకునే క్రమంలో పంటకు ఏర్పాటు చేసిన విద్యుత్ కంచెకు తాకడంతో షాక్‌తో మృతిచెందాడు.
● తానూర్ మండలంలోని మహలింగికి చెందిన రైతు తురాఠి గంగాధర్ ఈనెల 9న పంట రక్షణకు ఏర్పాటు చేసిన విద్యుత్ కంచె తీగలకు తగిలి మృతి చెందాడు.
● పంటల రక్షణకు అక్రమంగా ఏర్పాటు
● ప్రాణాలు కోల్పోతున్న అమాయకులు
● చోద్యం చూస్తున్న అధికారులు
తానూరు : జిల్లాలో ఎక్కువ మంది వ్యసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. వరి, సోయా, కంది, మొక్కజొన్న, కూరగాయలు, తదితర పంటలు సాగు చేస్తున్నారు. జిల్లాలోని చాలా గ్రామాలు అడవిని ఆనుకుని ఉన్నాయి. దీంతో వన్యప్రాణులు రైతుల వ్యవసాయ క్షేత్రాలపై తరచూ దాడిచేస్తున్నాయి. పంటలకు నష్టం కలిగిస్తున్నాయి. అడవి పందుల బెడద అధికంగా ఉంది. ఈ నేపథ్యంలో రైతులు పంటల రక్షణకు విద్యుత్ కంచెలు ఏర్పాటు చేసుకుంటున్నారు. కొందరు సోలార్ కంచెలు ఏర్పాటు చేసుకుంటున్నారు. అయితే విద్యుత్ కంచెల ఏర్పాటు చట్ట విరుద్ధం. వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం విద్యుత్ కంచెలు ఏర్పాటు చేయడం నేరం. దీంతో కంచెలు ఏర్పాటు చేసిన రైతులు ఈ విషయం ఎవరికీ చెప్పడం లేదు. దీంతో ఈ కంచెలే వన్యప్రాణులతోపాటు, రైతుల ప్రాణాలను బలి గొంటున్నాయి. వ్యవసాయానికి 24 గంటల విద్యు త్ సరఫరా చేస్తుండడంతో పొలాలకు వెళ్లిన వారు కంచెను గమనించకుండా దానికి తాకుతున్నారు. షాక్‌కు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. కొన్ని గ్రామాల్లో రోడ్డు పక్కనే ఉన్న పంటలకు విద్యుత్ కంచెలు ఏర్పాటు చేస్తుండడంతో వాహనదారులు, రోడ్డు వెంట వెళ్లేవారు గమనించకుండా ప్రమాదాలబారిన పడుతున్నారు. విద్యుత్ చౌర్యంతో కంచెలు ఏర్పాటు చేయడం, వన్యప్రాణాల మృతికి విద్యుత్ కంచెలు కారణమవుతున్నా.. ఇటు విద్యుత్ అధికారులు, అటు అటవీశాఖ అధికారులు తమకు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో రైతులు, రైతు కూలీలు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు.
వన్యప్రాణుల మృత్యువాత..
విద్యుత్ కంచెలకు తగిలి వన్యప్రాణులు సైతం మృత్యువాత పడుతున్నాయి. జింకలు, దుప్పులు, అడవి పందులు విద్యుత్ షాక్‌తో చనిపోతున్నాయి. అయినా వన్యప్రాణులను రక్షించేందుకు అటవీ శాఖ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఇప్పటికై నా అధికారులు స్పందించి రైతులకు అవగాహన కల్పించాలని రైతులు కోరుతున్నారు.
ఏడాదిన్నర వ్యవధిలోనే ...
విద్యుత్ అధికారుల లెక్కల ప్రకారం.. 2024లో మొత్తం 21 మంది రైతులు, 65 మూగ జీవాలు విద్యుత్ షాక్‌తో మృతి చెందాయి. 2025 మార్చి వరకు 13 మంది రైతులు, 76 మూగజీవాలు మృతి చెందాయి. ఇందులో అధికంగా పంటలకు ఏర్పాటు చేసిన విద్యుత్ కంచెల కారణంగా మరణించినట్లు తెలిపారు.
రైతులకు అవగాహన కల్పించాలి
కొంతమంది రైతులు పంట రక్షణ కోసం అక్రమంగా విద్యుత్ కంచెలు ఏర్పాటు చేయడంతో రైతులు, మూగ జీవాలు మృత్యువాత పడుతున్నాయి. తరచూ విద్యుత్ సమస్య కూడా తలెత్తుతోంది. సోలార్ కంచె ఏర్పాటు చేసుకుంటే ప్రమాదాలు జరగవు. అధికారులు గ్రామాల్లో రైతులకు విద్యుత్ కంచెతో కలిగే అనర్థాలు, సోలార్ కంచె ఏర్పాటుపై అవగాహన కల్పించాలి.
– మహేశ్, యువరైతు, ఎల్వి
క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం
రైతులు పంటల రక్షణకు అక్రమంగా విద్యుత్ తీగలు ఏర్పాటు చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. పంట రక్షణ కోసం సోలార్ విద్యుత్ కంచెలు ఏర్పాటు చేసుకోవాలి. దీనిపై గ్రామాల్లో విద్యుత్ అధికారులతో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాం. సోలార్ కంచెలతో వన్య ప్రాణులతోపాటు, రైతులకు కూడా ఎలాంటి ప్రమాదం జరగదు. – సుదర్శన్, విద్యుత్ ఎస్‌ఈ
రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ..
విద్యుత్ మోటర్ ఆన్‌ఆఫ్ చేసే క్రమంలో రైతులు బోర్డు వద్ద తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
పొలంలో విద్యుత్ బల్బులు వెలిగించేందుకు ఏర్పాటు చేసిన ఎర్త్ వైర్‌కు దూరంగా ఉండాలి .
పంటల రక్షణ కోసం రైతులు వేసిన కంచెకు ఉదయం విద్యుత్ సరఫరా కాకుండా చూడాలి.
కంచె.. కాటేస్తోంది..!
Comments
Please login to add a commentAdd a comment