‘బాలింత కుటుంబాన్ని ఆదుకోవాలి’
కడెం: రక్తహీనతతో ఈ నెల 8న మృతి చెందిన మండలంలోని ఇస్లాంపూర్ గ్రామానికి చెందిన బాలింత శ్రీవిద్య కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని మానవ హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు ఆత్రం భుజంగరావు అన్నారు. ఆదివారం వేదిక నిజ నిర్ధారణ కమిటీ బృందంతో కలిసి ఇస్లాంపూర్ వెళ్లి బాధిత కుటుంబ సభ్యులను కలిసి మృతికి గల కారణాలు తెలుసుకున్నారు. మృతురాలిని 7, 8, 9 నెలల్లో ఆస్పత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయించలేదని, చివరిగా ప్రసూతి కోసం ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించగా రక్తహీనత ఉందని నాలుగు బాటిళ్ల రక్తం ఎక్కించి ప్రసవం చేశారన్నారు. అనంతరం గుండె సంబంధిత వ్యాధి ఉందని, హైదరాబాద్‌కు తీసుకెళ్లాలని చెప్పగా తమవద్ద ఆర్థిక స్థోమతలేదని, ఆమె ఆరోగ్యంగా ఉండడంతో ఇంటివద్దే ఉంచామని ఆమె భర్త భగవంతరావు తెలిపారు. మృతురాలి కూతురు ఆలనపాలన కోసం రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించి, ఆమె భర్తకు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట వేదిక ప్రధాన కార్యదర్శి రఘోత్తమ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు అమృతరావు, కమిటీ సభ్యులు మేడ మురళీధర్, ప్రకాష్, తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment