మహిళలే బ్రాండ్‌! | - | Sakshi
Sakshi News home page

మహిళలే బ్రాండ్‌!

Published Fri, Mar 21 2025 1:17 AM | Last Updated on Fri, Mar 21 2025 1:15 AM

మహిళలే బ్రాండ్‌!

మహిళలే బ్రాండ్‌!

● అన్నిరంగాల్లో రాణించాలి ● కలెక్టర్‌ అభిలాష అభినవ్‌ ● కలెక్టరేట్‌లో మహిళా దినోత్సవం ● వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం

నిర్మల్‌చైన్‌గేట్‌: మహిళాశక్తిని చాటుతూ, వినూత్న కార్యక్రమాలతో రాష్ట్రంలోనే నిర్మల్‌ జిల్లా ప్రత్యేకంగా నిలుస్తోందని కలెక్టర్‌ అభిలాష అభినవ్‌ అన్నారు. మహిళలు మరింతగా రాణించాలని, అన్నిరంగాలలో పట్టు సాధించాలని పిలుపునిచ్చారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌హాల్‌లో గురువారం మహిళా దినోత్సవం నిర్వహించారు. ఈసందర్భంగా డీఆర్డీవో విజయలక్ష్మి ఆధ్వర్యంలో మహిళలే బ్రాండ్‌గా రాష్ట్రంలోనే తొలిసారిగా వినూత్నంగా రూపొందించిన ‘వాక్‌ ఫర్‌ దేశీ సీడ్స్‌’, ‘మిట్టి దీదీ’ కార్యక్రమాలను కలెక్టర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారన్నారు. అందుకే జిల్లా మహిళలను అవార్డులు వరిస్తున్నాయని తెలిపారు. జిల్లా పేరును జాతీయస్థాయిలో నిలబెట్టినందుకు మహిళలు జిల్లాకు బ్రాండ్‌ అన్నారు. భవిష్యత్తులో స్వయం సహాయక సంఘాలు మరిన్ని అవార్డులు, ప్రోత్సాహకాలు సాధించాలని ఆకాంక్షించారు.

విత్తన చొరవ అభినందనీయం..

మితిమీరిన ఎరువులు వాడిన పంట ఉత్పత్తులను ఆహారంగా తీసుకోవడంతోనే వ్యాధుల బారిన పడుతున్నామని కలెక్టర్‌ పేర్కొన్నారు. సంప్రదాయ పంటలు, సంప్రదాయ ఆహారపు అలవాట్లవైపు మళ్లే విధంగా మహిళా సమాఖ్యలు చొరవ తీసుకోవడం అభినందనీయమన్నారు. ప్రత్యేకంగా నాణ్యమైన దేశీ విత్తనాలను సేకరించి, మహిళా సంఘాలకు విత్తనాలను అందజేసి, సాగు చేయించడంతోపాటు సీడ్‌బ్యాంక్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. భూసార పరీక్షలనూ మహిళా సంఘాల ద్వారానే చేయిస్తామన్నారు. ఈ రెండింటికీ సంబంధించిన ‘వాక్‌ ఫర్‌ దేశీ సీడ్‌’, ‘మిట్టిదీదీ’ పోస్టర్లను జిల్లా అధికారులు, మహిళా సమాఖ్య సభ్యులతో కలిసి ఆవిష్కరించారు. మహిళలతో కలిసి కేక్‌ కట్‌ చేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ కిశోర్‌కుమార్‌, డీఆర్డీవో విజయలక్ష్మి, జిల్లామహిళా సమాఖ్య సంఘం అధ్యక్షురాలు గంగామణి, మహిళా సమాఖ్య సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

సేకరించిన దేశీ విత్తనాలు..

చిరుధాన్యాలు: కొర్రలు, అరికెలు, సామలు, ఊదలు, అండుకొర్రలు

మధ్యస్థ ధాన్యం: రాగులు, సజ్జలు, జొన్నలు

ఉత్తమ ధాన్యం: గోధుమలు, ధాన్యం(వడ్లు)

ధాన్యంలో రకాలు: చిట్టి ముత్యాలు, తులసిబసు, అంబేమొహర్‌, కోతంబరి, తులసి బాస్మతి, బహురూపి(బలానికి), మైసూర్‌మల్లిగ(చిన్న పిల్లల్లో ఎదుగుదలకు), రత్నచోడి(కండర పటుత్వానికి), ఇంద్రాణి(ఈ విటమిన్‌ కోసం), కుజుపఠాలియా, కాలాబట్టి(రోగనివారణకు), కర్పకౌని(శరీర సమతుల్యతకు), నవారా(మధుమేహ బాధితులకు), రక్తశాలి(రక్తహీనత నివారణకు) కులాకార్‌, పుంగర్‌, మా పిళ్ళై సాంబ తదితర రకాలు.

కూరగాయలు:

అన్నపూర్ణ రామ్ములక్కాయ, కాశీ రామ్ములక్కాయ, చిట్టీ రామ్ములక్కాయ, కేసరీ రామ్ములక్కాయ, దేశీ టమాట, వంకాయ, బెండ, సూర్యముఖి/త్రిశూల మిరప, మధ్యస్థ పొడవుకారం మిరపకాయ, బీరకాయ, గుత్తి బీరకాయ, ఆకుపచ్చ కాకరకాయ తదితర కూరగాయలతో పాటు చిలగడ, కర్రపెండలం దుంప విత్తనాలు.

మట్టి పరీక్షలు.. దేశీ విత్తనాలు..

ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ) టెక్నాలజీని సద్వినియోగం చేసుకుంటూ భూసార పరీక్షలు చేయడమే ‘మిట్టిదీదీ’ కార్యక్రమం. ఒకప్పటి దేశీవిత్తనాలను కాపాడుకుంటూ ముందుతరాలకు అందించేలా సాగు చేయించడమే ‘వాక్‌ ఫర్‌ దేశీ సీడ్స్‌’ కార్యక్రమం. ఈ రెండు కూడా మహిళా రైతు ఉత్పత్తి సంఘాల ఆధ్వర్యంలో చేపట్టనుండటం, దేశీ విత్తనాలతో పండించిన పంటలనూ సంఘాలే కొనుగోలు చేయనుండటం విశేషం. ఇప్పటికే జిల్లాలో 200 మంది మహిళా రైతులతో దాదాపు 20 ఎకరాల్లో ప్రయోగాత్మకంగా సాగు చేయించేందుకు సిద్ధం చేసినట్లు డీఆర్డీవో విజయలక్ష్మి వివరించారు. పశ్చిమబెంగాల్‌, ఒడిశా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌ తదితర ప్రాంతాల నుంచి దేశీవిత్తనాలను సేకరించినట్లు చెప్పారు.

పథకాలు సద్వినియోగం చేసుకోవాలి..

జిల్లాకు మహిళా సంఘాలే బ్రాండ్‌ అంబాసిడర్లని కలెక్టర్‌ కొనియాడారు. నిర్మల్‌ కొయ్యబొమ్మల కోసం పొనికికర్ర ఉత్పత్తికి మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో పొనికి వనాలు పెంచడం గొప్ప విషయమన్నారు. మహిళలను కోటీశ్వరులు చేయడమే ప్రభుత్వ లక్ష్యమ ని, అందుకుగాను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళా సాధికారితకు ఎన్నో పథకాల ను ప్రవేశపెట్టాయని వివరించారు. మహిళలు సద్వినియోగం చేసుకోవా లని, వ్యాపారం, స్వయంఉపాధితో ఆర్థికంగా ఎదగాలన్నారు. జిల్లా స్వయం సంఘాలు బ్యాంకు లింకేజీ, రుణ వితరణ, తదితర అంశాలలో అగ్రగామిగా ఉందన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement