‘టెన్‌’షన్‌ వద్దు | - | Sakshi
Sakshi News home page

‘టెన్‌’షన్‌ వద్దు

Published Fri, Mar 21 2025 1:17 AM | Last Updated on Fri, Mar 21 2025 1:15 AM

‘టెన్‌’షన్‌ వద్దు

‘టెన్‌’షన్‌ వద్దు

● నేటి నుంచి పదో తరగతి పరీక్షలు ● జిల్లాలో 9,129 మంది విద్యార్థులు ● 5 నిమిషాలపాటు వెసులుబాటు

నిర్మల్‌ రూరల్‌: విద్యార్థి జీవితంలో ప్రథమ మెట్టుగా భావించే పదో తరగతి పరీక్షలు శుక్రవా రం నుంచి ప్రారంభం కానున్నాయి. విద్యార్థులు, తల్లిదండ్రులతోపాటు జిల్లా అధికారులు కూడా ఈసారి ఫలితాలపై ఆసక్తిగా ఉన్నారు. వరుసగా రెండేళ్లు ఫలితాల్లో జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. జిల్లాలో 47 సెంటర్లలో విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పరీక్షలు జరుగుతాయి. పరీక్షకు ఐదు నిమిషాల వెసులుబాటు కల్పించారు. ఈసారి గ్రేడింగ్‌కు బదులుగా మార్కులను కేటాయిస్తారు. విద్యార్థులకు ఇప్పటికే హాల్‌ టికెట్లను అందజేశారు. పోలీసులు, ఆరోగ్యశాఖ, ఆర్టీసీ తదితర శాఖల సమన్వయంతో విద్యాశాఖ 10వ తరగతి పరీక్షలకు ఏర్పాట్లు చేసింది.

జిల్లాలో 9,129 మంది విద్యార్థులు..

ఈసారి జిల్లాలో 9,129 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయనున్నారు. ఇందులో బాలురు 4,444, బాలికలు 4,685 మంది ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలల నుంచి మొత్తం 6,158 మంది విద్యార్థులు పరీక్షలు రాయనుండగా, ఇందులో 2,765 బాలురు, 3,393 బాలి కలు ఉన్నారు. ప్రైవేట్‌ పాఠశాలల నుంచి 2,971 మంది రాయనుండగా, 1,679 మంది బాలురు, 1,292 బాలికలు ఉన్నారు. నిర్మల్‌లో 22, భైంసాలో 19, ఖానాపూర్‌లో 06 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఒక్కో సెంటర్‌కు ఒక ముఖ్య పర్యవేక్షణ అధికారి, డీవోను నియమించారు. ఏడుగురు కస్టోడియన్‌ ఆఫీసర్లు, 563 మంది ఇన్విజిలేటర్లను నియమించారు.

ఐదు నిమిషాల వరకు అనుమతి..

పరీక్షలు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు నిర్వహిస్తారు. విద్యార్థులు 5 నిమిషాల వరకు పరీక్ష కేంద్రానికి ఆలస్యంగా వచ్చిన అనుమతిస్తారు. కానీ విద్యార్థులు పరీక్ష కేంద్రానికి గంట ముందుగా చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. విద్యార్థులకు ఇప్పటికే హాల్‌ టికెట్లను పంపిణీ చేశారు. ఇంకా పొందని వారు వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్‌ చేసుకుని పరీక్షకు హాజరు కావచ్చని సూచించారు.

‘హ్యాట్రిక్‌ ’ కొట్టాలి...

‘పదవ తరగతి విద్యార్థులందరికీ ఆల్‌ ది బెస్ట్‌.. మళ్లీ మన జిల్లా రాష్ట్రంలోనే ఫస్ట్‌ రావాలి.. హ్యా ట్రిక్‌ కొట్టాలి’ అంటూ జిల్లావాసులు చెబుతున్నా రు. రెండేళ్లుగా ఫలితాల్లో జిల్లా రాష్ట్రంలోనే మొద టి స్థానంలో నిలిచింది. ఈసారి కూడా ఆ స్థానా న్ని నిలబెట్టుకోవాలని జిల్లావాసులు ఆకాంక్షిస్తున్నారు. కలెక్టర్‌ అభిలాష అభినవ్‌ సైతం పలుమా ర్లు పదో తరగతి పరీక్షల నిర్వహణపై డీఈవో, ఇతర జిల్లా అధికారులతో సమీక్షలు నిర్వహించా రు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈసారి కూడా ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లామని, మళ్లీ ఫస్ట్‌ వస్తామని డీఈవో రామారావు ధీమాగా ఉన్నారు.

వివరాలు..

పరీక్ష రాయనున్న విద్యార్థులు 9,129

బాలురు 4,444

బాలికలు 4,685

పరీక్ష కేంద్రాలు 47

నిర్మల్‌లో 22

భైంసాలో 19

ఖానాపూర్‌లో 06

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement