మళ్లీ వస్తున్నారు!
నిర్మల్‌ఖిల్లా: కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామస్థాయిలో రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరించేందుకు చర్యలు చేపడుతోంది. ఇప్పటికే గ్రామస్థాయిలో రెవెన్యూ శాఖకు సంబంధించి ఉద్యోగి లేకపోవడంతో పాలనపరమైన సేవలకు ఆటంకాలు కలుగుతున్నట్లు భావించింది. వివిధ రకాల భూ సమస్యలు, గ్రామస్థాయిలో ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, ఇతర ధ్రువీకరణ పత్రాల జారీ లాంటి ప్రక్రియలో సమస్యలు జఠిలమవుతున్నట్లు భావించి రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరించే క్రమంలో జీపీవోలను నియమించేందుకు ముందడుగు వేస్తోంది. గ్రామీణులకు రెవెన్యూ సంబంధిత సేవలు చేరువ చేసేందుకు గ్రామ పాలనాధికారి (జీపీవో) పేరిట రాష్ట్రవ్యాప్తంగా 10,954 పోస్టులు మంజూరు చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో జిల్లాలో నూతనంగా ఏర్పాటైన గ్రామపంచాయతీలను కలుపుకొని 428 రెవెన్యూ గ్రామాలు ఉండగా, ఆయా గ్రామాలకు నూతనంగా జీపీవోలు రానున్నారు.
గ్రామ పాలనలో వీరే కీలకం
జిల్లాలో నూతనంగా నియామకం కానున్న జీపీవో లు ఆయా గ్రామాల్లోని భూమి హక్కులు, విద్యార్థులకు ధ్రువీకరణ పత్రాల జారీ, వివిధ పథకాలకు అ ర్హుల ఎంపిక, భూమి సర్వే, ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం, విపత్తుల సమాచారం చేరవేత, ప్రభు త్వ ఆస్తుల పరిరక్షణ తదితర కీలక బాధ్యతలు చేపట్టనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భా వించే భూభారతిచట్టం అమలులో వీరు విధులు ని ర్వహించనున్నారు. రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళన పేరి ట అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం 2023లో వీఆర్వో, వీఆర్‌ఏలను వివిధ శాఖల్లోకి సర్దుబాటు చేసింది. అవసరమున్న చోట సూపర్ న్యూమరరీ పోస్టులు కూడా సృష్టించి సర్దుబాటు ప్రక్రియ చేపట్టింది. వీ ఆర్‌ఏ, వీఆర్వోలను మున్సిపల్‌శాఖలో వార్డు ఆఫీసర్లుగా, నీటిపారుదల శాఖలో లష్కర్, హెల్పర్ తదితర పోస్టుల్లో నియమించింది.
అప్పటి వీఆర్వో, వీఆర్‌ఏలకే చాన్స్
గతంలో రెవెన్యూ శాఖలో వీఆర్వోలు, వీఆర్‌ఏలు గా పనిచేసిన వారికి ప్రస్తుతం నియమించనున్న జీపీవో పోస్టుల నియామకంలో ఆప్షన్ల ద్వారా అవకాశం ఇవ్వనున్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. వీరికి రెవెన్యూ శాఖలో క్షేత్రస్థాయిలో మంచిపట్టు ఉండగా తిరిగి వీరిని గ్రామపాలన అధికారులుగా తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే జీపీవో పోస్టులపై ఆసక్తి ఉన్న వీఆర్‌ఏ, వీఆర్వోలుగా పనిచేసినవారికి విల్లింగ్ అడుగుతూ దరఖాస్తులు ఆహ్వానించింది. వారిలో గ్రామస్థాయి పాలనాధికారికోసం 178 మంది దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. మిగతా పోస్టులకు నేరుగా డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా నియామకాలు చేపట్టే అవకాశమున్నట్లు ఆ శాఖ అధికారులు స్పష్టంచేస్తున్నారు. పూర్వ శాఖలో నియమించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు జిల్లా పూర్వ వీఆర్‌ఏల సంఘం అధ్యక్షుడు షేక్ జమాల్, జేఏసీ రాష్ట్ర నాయకుడు దాదేమియా పేర్కొన్నారు.
నిర్మల్ జిల్లాలో ఇలా..
రెవెన్యూ గ్రామాలు : 428
గ్రామీణ మండలాలు : 18
రెవెన్యూ డివిజన్లు : 02