
టీచకపర్వం..!
● జిల్లాలో వరుస ఘటనలు ● ఇటీవల ఒకే స్కూల్లో ఇద్దరు.. ● తాజాగా ఓ బాలికపై మరొకరు.. ● పోక్సో కేసునమోదు, సస్పెన్షన్ ● ‘గురుకులం’లోనూ ‘కీచకుడు’! ● గురువుల పరువుతీస్తున్న తీరు..
నిర్మల్: జిల్లాలో టీచర్ల కీచకపర్వం కొనసాగుతూనే ఉంది. మార్గదర్శకంగా నిలవాల్సిన గురువులే సభ్యసమాజం ముందు సిగ్గుతో తలదించుకునే పనులు చేస్తున్నారు. పాఠాలు బోధించే ఉపాధ్యాయులు కీచకులుగా మారుతున్న తీరు కలవర పెడుతోంది. ఇటీవలే నర్సాపూర్ స్కూల్ ఘటనలో ఇద్దరు సీనియర్ ఉపాధ్యాయుల తీరు, వారిపై నమోదైన కేసుల గురించి మర్చిపోకముందే మరో ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఘటన బడి బయట చోటుచేసుకున్నా.. మైనర్‌పై అఘాయిత్యానికి పాల్పడిందీ ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడే. ఈ కేసులో సదరు ఉపాధ్యాయుడిని డీఈవో సస్పెండ్ చేశా రు. బాల్యాన్ని బాధ్యతతో ముందుకు నడిపించాల్సిన వాళ్లే ముళ్లుగా మారి చిదిమేస్తున్న తీరు గురువులపై గౌరవాన్ని తగ్గిస్తోంది.
ఎటుపోతున్నారు.. సారూ..!?
గుడిలాంటి బడిలో ఉపాధ్యాయుడే దేవుడు. అలాంటి సార్లే దారి తప్పితే సమాజానికి ఏం మెసేజ్ వెళ్తుంది..? తమ బిడ్డల వయసులో ఉన్నవారిపై కన్నేశారన్న విషయమే కలచివేస్తోంది. విద్యాబుద్ధులు, నడవడికను నేర్పించాల్సిన బాధ్యతలో ఉన్నవాడే.. తను మనిషినన్న విషయం మర్చిపోయి మృగంలా మారుతున్నాడు. తండ్రిలాంటి వాడు తనతో ఎందుకలా చేస్తున్నాడో కూడా తెలియనితనంలో ఎంతోమంది బాధితులవుతున్నారు. కొంతమంది కీచక టీచర్ల కారణంగా పవిత్రమైన ఉపాధ్యాయవృత్తికే మచ్చ తెస్తోంది.