
పత్తి రైతుపై విత్తన భారం..
● బీటీ పత్తి విత్తన ధరల పెంపు ● ఒక్కో ప్యాకెట్ పై రూ.37 పెరుగుదల ● జిల్లా రైతులపై రూ.99 లక్షల అదనపు భారం
ఆరేళ్లుగా పెరిగిన ధరలు..
నిర్మల్‌చైన్‌గేట్: వానాకాలం సీజన్ సమీపిస్తున్న వేళ, బీటీ పత్తి విత్తనాల ధరలు పెరిగాయి. 475 గ్రాముల బీటీ–2 ప్యాకెట్ గత ఏడాది రూ.864 ఉండగా, ఈ సారి రూ.901కి చేరింది. దీంతో ఒక్కో ప్యాకెట్‌పై రూ.37 అదనంగా చెల్లించాల్సి వస్తోంది. జిల్లా రైతులకు ఈ సీజన్‌లో సుమారు 2.7 లక్షల విత్తన ప్యాకెట్లు అవసరమవుతాయి. ఈ పెరిగిన ధరల ప్రభావంతో జిల్లా రైతాంగంపై రూ.99 లక్షల అదనపు ఆర్థిక భారం పడనుంది.
1.8 లక్షల ఎకరాల్లో పత్తి సాగు
జిల్లాలో వర్షాకాలంలో వివిధ పంటలు 4.40 లక్షల ఎకరాల్లో సాగవుతాయి. ఇందులో పత్తి సాగు 1.8 లక్షల ఎకరాల వరకు ఉంటుంది, వరి తర్వాత ఇది రైతులకు కీలక పంటగా నిలుస్తోంది. ఒక్కో ఎకరాకు 2.5 నుంచి 3 బీటీ–2 ప్యాకెట్లు (475 గ్రాములు) వినియోగిస్తారు. ఈ ప్యాకెట్‌లో 450 గ్రాముల బీటీ విత్తనాలు, 25 గ్రాముల నాన్–బీటీ విత్తనాలు ఉంటాయి. గతేడాది రూ.864కు అందుబాటులో ఉన్న ఈ ప్యాకెట్ ధరను ఈ సారి విత్తన కంపెనీలు రూ.37 పెంచాయి. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ ధరలు రూ.901కి చేరాయి. దీని వల్ల రైతులపై ఆర్థిక ఒత్తిడి పడనుంది.
రైతులపై పెరుగుతున్న ఆర్థిక ఒత్తిడి
విత్తనాలపై సబ్సిడీ ఎత్తివేత, ఏటా ధరల పెంపు వంటి కారణాలతో రైతుల భారం మరింత పెరుగుతోంది. ఈ సీజన్‌లోనైనా సబ్సిడీ పునరుద్ధరణ జరుగుతుందని రైతులు ఆశించారు, కానీ ఆ దిశగా ఎలాంటి సంకేతాలు కనిపించలేదు. సుమారు 40 కంపెనీలు తమ బీటీ–2 విత్తనాలను ఈ కొత్త ధరలతో విక్రయించనున్నాయి. అయితే, బీటీ–1 రకం విత్తనాల ధర గతేడాది రూ.635గా ఉండగా, ఈ సీజన్‌లో కూడా అదే ధరను కొనసాగించాలని నిర్ణయించారు. కానీ ఈ రకాన్ని రైతులు ఎక్కువగా ఉపయోగించరు. సీజన్ మరో నెల రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో, వ్యవసాయ శాఖ విత్తన నిల్వల కోసం సన్నాహాలు చేస్తోంది.
సంవత్సరం.. ధర
2020 రూ.730
2021 రూ.767
2022 రూ.810
2023 రూ.853
2024 రూ.864
2025 రూ.901 (వచ్చే ఖరీఫ్‌కు ధర)
డీలర్ల నుంచి రశీదు తీసుకోవాలి
రైతులు అవసరం మేరకు విత్తనాలు వాడాలి. రైతులు విత్తనాల కొనుగోలు సమయంలో తప్పనిసరిగా డీలర్ల నుంచి రశీదు తీసుకోవాలి. వాతావరణ పరిస్థితులు, నాసిరకం విత్తనాలు విత్తిన సమయంలో పంట ఏపుగా పెరగకపోతే సంబంధిత పత్తి కంపెనీల నుంచి నష్టపరిహారం అందుకునేందుకు డీలర్ల నుంచి తీసుకున్న రశీదు ఆధారంగా ఉంటుంది.
– నాగరాజు, మండల వ్యవసాయ అధికారి, నిర్మల్‌ర

పత్తి రైతుపై విత్తన భారం..