● కాల్‌టెక్స్ ఇళ్ల చోరీ కేసు చేధించిన పోలీసులు ● మరో ముగ్గురి కోసం బృందాల గాలింపు ● వివరాలు వెల్లడించిన ఏసీపీ రవికుమార్
బెల్లంపల్లి: సంచలనం సృష్టించిన బెల్లంపల్లి కాల్‌టెక్స్ ఏరియాలోని రెండిళ్లలో జరిగిన చోరీ కేసును పోలీసులు ఎట్టకేలకు చేధించారు. నలుగురు నిందితుల్లో ఒకరిని అరెస్టు చేసి దొంగిలించిన నాలుగు మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. సోమవారం బెల్లంపల్లి రూరల్ సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ ఏ.రవికుమార్ వివరాలు వెల్లడించారు. గత నెల 29వ తేదీ తెల్లవారుజామున బెల్లంపల్లి కాల్‌టెక్స్ ఏరియాలో సాన శ్రావణ్, అత్తె సుధాకర్ ఇళ్లలో అగంతకులు దొంగతనానికి పాల్పడ్డారు. ఇళ్ల తాళాలు పగులగొట్టి 14.5 తులాల బంగారం, కిలోన్నర వెండి, రూ.20 వేల నగదు, నాలుగు మోటారు సైకిళ్లను దొంగిలించారు. బాధితులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బెల్లంపల్లి రైల్వేస్టేషన్ పరిసరాల్లో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కన్పించడంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా అతను గజానంద్ పార్థి అని కాల్‌టెక్స్ ఏరియాలో దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నాడు. మరో ముగ్గురు నిందితులు లాల్‌జీ, రోషన్, ఘోటియా పరారీలో ఉన్నట్లు ఏసీపీ వెల్లడించారు. మధ్యప్రదేశ్ రాష్ట్రం గుణా జిల్లా కనేరా గ్రామానికి చెందిన నలుగురు సభ్యుల అంతర్రాష్ట్ర దొంగల ముఠా ఇళ్లలో చోరీ చేసినట్లు పేర్కొన్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని, త్వరలోనే పట్టుకుంటామన్నారు.
పలు రాష్ట్రాల్లో నిందితులపై కేసులు
మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నలుగురు దొంగలు తాళం వేసి ఉన్న ఇళ్లతో పాటు ఇంట్లో కుటుంబ సభ్యులు ఉన్నా కూడా చోరీ చేస్తున్నట్లు దర్యాప్తులో తేల్చారు. నిందితులు మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో దొంగతనాలు చేస్తూ పోలీసులకు దొరక్కుండా తప్పించుకుంటున్నారు. వీరిపై ఆయా రాష్ట్రాల్లో దొంగతనం కేసులు నమోదై ఉన్నాయి. నిందితుడిని పట్టుకున్న బెల్లంపల్లి రూరల్‌సీఐ అఫ్జలుద్దీన్, టూటౌన్ ఎస్సై కె.మహేందర్, తాళ్ల గురిజాల ఎస్సై సీహెచ్ రమేశ్, నెన్నెల ఎస్సై ప్రసాద్, పోలీసు సిబ్బందిని ఏసీపీ అభినందించారు.