
గుట్టుగా గంజాయి దందా..
ఉట్నూర్‌రూరల్: మండలంలో గంజాయి దందా గుట్టుగా సాగుతున్నట్లు తెలుస్తోంది. సోమవారం ఉట్నూర్ మండల కేంద్రంలో పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో 2 కిలోల గంజాయి పట్టుబడింది. ఆదివారం రాత్రి రాములుగూడెంలో రైతు సాగు చేస్తున్న 20 గంజాయి మొక్కలు స్వాధీనం చేసుకున్నారు. తాజాగా మంగళవారం ఉట్నూర్ ఇన్‌చార్జి ఎస్సై సునీల్ ఆధ్వర్యంలో బీర్పాయిపేటలో వాహనాలు తనిఖీ చేస్తుండగా మండలంలోని లక్సెట్టిపేటకు చెందిన సట్ల గంగన్న , బీర్సాయిపేటకు చెందిన జైనేని ఎల్లయ్య అనుమానస్పదంగా కనిపించడంతో వారిని తనిఖీ చేయగా 4.900 గంజాయి లభించింది. గంజాయి విలువ రూ.లక్షా 22 వేలు ఉంటుందన్నారు. వారిని విచారించగా మహారాష్ట్రకు చెందిన గుర్తు తెలియని వ్యక్తుల వద్ద నుంచి గంజాయి కొనుగోలు చేసి హైదరాబాద్ కరీంనగర్ ప్రాంతాలకు తరలించి విక్రయిస్తున్నట్లు ఒప్పుకున్నారు. గంజాయిని స్వాధీనం చేసుకుని నిందితులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.