ఇలా.. ఇంకెన్నేళ్లు..!? | - | Sakshi
Sakshi News home page

ఇలా.. ఇంకెన్నేళ్లు..!?

Published Wed, Apr 9 2025 12:07 AM | Last Updated on Wed, Apr 9 2025 12:07 AM

ఇలా..

ఇలా.. ఇంకెన్నేళ్లు..!?

● వాళ్ల ప్రాణాలకూ విలువనివ్వరా? ● వెయ్యిమంది త్యాగాలకు లెక్కలేదా? ● అధికారికంగా నివాళులూ అర్పించలేరా? ● ‘వెయ్యి ఉరులమర్రి’ సాక్షిగా వివక్ష ● నేడు ఆ అమరవీరుల త్యాగాలదినం

దేశ ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామానికి కొనసాగింపుగా తెలంగాణ–మహారాష్ట్ర ప్రాంతంలోనూ ఉమ్మడి శత్రువులపై గోండులు, రోహిల్లాలు, మరాఠీలు, దక్కనీలు పోరు చేశారు. నిర్మల్‌ కేంద్రంగా 1858–60 వరకు ఈ పోరాటం సాగింది. అడవుల్లోకి చొచ్చుకొస్తూ.. ఆదివాసుల ఉనికినే ప్రశ్నార్థకంగా మారుస్తున్న ఆంగ్లేయ, నైజాం సేనలపై జనగాం (ఆసిఫాబాద్‌) కేంద్రంగా చేసుకున్న గోండువీరుడు మర్సుకోల రాంజీగోండు పోరాటం ప్రారంభించాడు. నిజాం సేనలతో కలిసి నిర్మల్‌ కలెక్టర్‌ ప్రజలను పీడిస్తున్నాడని రాంజీగోండు ఈ ప్రాంతం వైపు వచ్చాడు. తాంతియాతోపే అనుచరులైన రోహిల్లా సిపాయిలు ఆయనకు తోడయ్యారు. రోహిల్లా సర్దార్‌ హాజీతో కలిసిన రాంజీ.. ఉమ్మడి శత్రువులైన ఆంగ్లేయ, నిజాం సేనలపై విరుచుకుపడ్డాడు. సరైన ఆయుధ సంపత్తి లేకున్నా దట్టమైన అడవులు, సహ్యాద్రి కొండలు, గోదావరి నదులను ఆసరాగా చేసుకుని వారిపై దాడులు చేసి దెబ్బతీశారు.

ఒకే మర్రికి.. వెయ్యిమంది ఉరి..

దొంగదెబ్బతో బంధించిన రాంజీ సహా వెయ్యి మందిని శత్రుసేనలు చిత్రహింసలు పెట్టాయి. ఇలాంటి వాళ్లు మళ్లీ తమపై పోరాడేందుకు కూడా సాహించకూడదని నరకం చూపించాయి. వారందరినీ నిర్మల్‌ శివారులోని ఎల్లపెల్లి దారిలో నేలలో ఊడలు దిగిన మర్రిచెట్టు వద్దకు ఈడ్చుకెళ్లి అందరూ చూస్తుండగా రాంజీ సహా వెయ్యి మందిని 1860 ఏప్రిల్‌ 9న ఉరితీశారు. దేశ స్వాతంత్య్ర చరిత్రలోనే మునుపెన్నడూ జరగని ఈ ఘటన జలియన్‌వాలాబాగ్‌ కంటే దాదాపు 60 ఏళ్ల ముందే చోటు చేసుకోవడం గమనార్హం. ఆ దారుణం కంటే ఇక్కడ ఎక్కువమందే ప్రాణత్యాగాలు చేసినా.. చరిత్రలో సరైన గుర్తింపు దక్కకపోవడం శోచనీయమని నిర్మల్‌ జిల్లావాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా నిర్మల్‌గడ్డపై జరిగిన పోరుకు, వారి త్యాగాల తీరుకు తగిన గుర్తింపు తీసుకురావాలని కోరుతున్నారు.

జిల్లాకేంద్రంలో రాంజీగోండు విగ్రహం

‘సాక్షి’ అక్షర నివాళులు..

స్వాతంత్రం కోసం సర్వస్వం అర్పించిన సమరయోధులనూ గుర్తించాలని, రాంజీసహా వెయ్యిమంది అమరవీరుల త్యాగాలకు విలువనివ్వాలని అవకాశం దొరికినప్పుడల్లా.. ‘సాక్షి’ గొంతెత్తుతూనే ఉంది. వరుస కథనాలను ప్రచురిస్తూ.. ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తూ నాటి చరితను, వారి ఘనతను ప్రజల్లోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోంది. వెయ్యిమంది వీరుల త్యాగాలదినం సందర్భంగా బుధవారం నిర్మల్‌ పట్టణంలోని డాక్టర్స్‌లైన్‌లో గల డా.కావేరి లైబ్రరీలో సంస్మరణ కార్యక్రమాన్ని నిర్వహించనుంది.

బళ్లారి నుంచి దళం..

రాంజీసేనల దాడుల విషయం కలెక్టర్‌ ద్వారా హైదరాబాద్‌ రాజ్యంలో అప్పటి రెసిడెంట్‌ డేవిడ్సన్‌, నాటి పాలకుడు అఫ్టల్‌ఉద్దౌలా వరకు తెలిసింది. వీరి పోరును తీవ్రంగా పరిగణించిన పాలకులు అణచివేత కోసం కర్ణాటకలోని బళ్లారిలో ఉన్న 47వ నేషనల్‌ ఇన్‌ఫ్రాంటీని నిర్మల్‌ రప్పించారు. కల్నల్‌ రాబర్ట్‌ నేతృత్వంలోని ఈ దళానికీ ఇక్కడి ప్రాంతంపై పట్టులేకపోవడంతో రాంజీసేన చేతిలో దెబ్బతింది. ఈ కసితో కల్నల్‌ రాంజీసేనను దొంగదెబ్బ తీసి, సోన్‌–కూచన్‌పల్లి ప్రాంతంలో గోదావరి ఒడ్డున పట్టుకున్నాడు.

వాళ్ల పోరాటం తెలుసుకుంటే రోమాలు నిక్కబొడ్చుకుంటయ్‌. తమపై సాగిస్తున్న అరాచకాలను ఎదుర్కొనేందుకు.. వారు ముందుకురికిన తీరు రక్తాన్ని ఉడికిస్తుంది. చరిత్ర సైతం గోసపెట్టుకునేలా వారు చేసిన ప్రాణత్యాగాలు కళ్లను చెమరుస్తాయి. వారి వీరగాథ గుర్తుకొచ్చినప్పుడల్లా చేతులు వాటంతటవే జోడిస్తాయి. కానీ.. అలాంటి వీరుల ప్రాణత్యాగాలను ప్రభుత్వాలు చిన్నచూపు చూడటమే కలచివేస్తోందని నిర్మల్‌ జిల్లావాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ గడ్డపైనే పోరాడి, తమ ప్రాణాలను తృణప్రాయంగా వదిలిన రాంజీగోండు సహా వెయ్యిమంది వీరుల త్యాగాలకు ఇంకెప్పుడు అధికారిక నివాళులర్పిస్తారు..!? అన్న ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానం రావడం లేదు. నేడు (ఏప్రిల్‌ 9) రాంజీసహా వెయ్యిమంది వీరుల త్యాగాలదినం.. – నిర్మల్‌

మనవంతు ప్రయత్నం..

జిల్లాలో ఎన్నో చారి త్రక కట్టడాలు ఉన్నాయి. వెయ్యి ఉరులమర్రి ఘటన ఇక్కడే చోటు చేసుకుంది. వీటిని ముందుతరాలకు అందించేందుకు మావంతు ప్రయత్నం కొనసాగుతోంది. – అభిలాష అభినవ్‌, కలెక్టర్‌

ఇలా.. ఇంకెన్నేళ్లు..!?1
1/2

ఇలా.. ఇంకెన్నేళ్లు..!?

ఇలా.. ఇంకెన్నేళ్లు..!?2
2/2

ఇలా.. ఇంకెన్నేళ్లు..!?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement