
సన్నబువ్వ తిని.. సమస్యలు తెలుసుకుని..
● తర్లపాడ్‌లో సన్న బియ్యం లబ్ధిదారు ఇంట్లో కలెక్టర్ భోజనం
ఖానాపూర్: మండలంలోని తర్లపాడ్ గ్రామానికి చెందిన సన్నబియ్యం లబ్ధిదారు ఇంట్లో కలెక్టర్ కలెక్టర్ అభిలాష అభినవ్ మంగళవారం భోజనం చేశారు. ముందుగా ఎస్సీ కాలనీ రేషన్ షాపులో సన్న బియ్యం పంపిణీ ప్రక్రియను అదనపు కలెక్టర్ కిశోర్‌కుమార్, ఆర్డీవో రత్నాకళ్యాణి, ఇతర అధికారులతో కలిసి పరిశీలించారు. బియ్యం నాణ్యత, రుచి, పంపిణీ ప్రక్రియపై గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం లబ్ధిదారులైన పల్లెర్ల సుజాత–రాజేశ్వర్ దంపతుల ఇంటికి వెళ్లి సన్న బియ్యంతో వండిన భోజనం చేశారు. ఈ సందర్భంగా మహిళా సంఘ సభ్యులతో చర్చించిన కలెక్టర్, ఐకేపీ ద్వారా డెయిరీ, పౌల్ట్రీ ఫాంతోపాటు ఇతర సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. లబ్ధిదారులు సన్న బియ్యం తీసుకుని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం కాలనీలోని సమస్యలను గ్రామస్తులు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. అంగన్‌వాడీ కేంద్రంలో విద్యుత్ సౌకర్యం లేని విషయాన్ని గ్రామస్తులు చెప్పగా, వెంటనే విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలని తహసీల్దార్ సుజాత, ఎంపీడీవో సునీతను కలెక్టర్ ఆదేశించారు. అంగన్‌వాడీ కేంద్రం చుట్టూ ప్రహరీ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. యువత రాజీవ్ యువ వికాసం కార్యక్రమానికి దరఖాస్తు చేయాలని, ఇల్లు లేనివారికి దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీవో రత్నాకర్‌రావు, ఆర్‌ఐలు సత్యనారాయణ, నగేష్ తదితరులు పాల్గొన్నారు.