
ప్రభుత్వ బడుల్లో ఏఐ విప్లవం..
నిర్మల్‌ఖిల్లా: తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించేందుకు కృత్రిమ మేధ(ఏఐ) ఆధారిత బోధనను ప్రవేశపెట్టింది. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా విద్యార్థులకు కనీస అభ్యసన సామర్థ్యాలు అందించే లక్ష్యంతో, రాష్ట్ర విద్యాశాఖ ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా, ప్రతీ జిల్లా నుంచి ఎంపిక చేసిన పాఠశాలల్లో ఏఐ బోధనను అమలు చేస్తున్నారు. వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రణాళిక అమలు కోసం ప్రతీ జిల్లా నుంచి ఐదుగురు ఉపాధ్యాయులకు హైదరాబాద్‌లో డిజిటల్ లిటరసీ, ఏఐ శిక్షణ అందించారు. వచ్చే విద్యా సంవత్సరం 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు డిజిటల్ అభ్యసన పరిజ్ఞానం అందించేందుకు ప్రణాళికలు రూపొందించారు.
గణితంతో ప్రారంభం
విద్యాశాఖ ఐటీ విభాగం జి కంప్రైస్, ఎడ్యుఆక్టివ్ 8, కోడ్ మిత్ర వంటి ఏఐ యాప్‌లను అభివృద్ధి చేసింది. ఈ యాప్‌ల ద్వారా గణిత పాఠ్యాంశాలను ఉత్సాహభరితంగా నేర్చుకునేలా రూపొందించారు. సంకలనం, వ్యవకలనం, గుణాకారం, భాగహారాలను కృత్యాధారంగా బోధించే ఈ పద్ధతి విద్యార్థుల జ్ఞాపకశక్తిని, ఆసక్తిని పెంచుతుందని శిక్షణ పొందిన ఉపాధ్యాయులు చెబుతున్నారు. వెనుకబడిన విద్యార్థులకు కూడా ప్రేరణ కలిగేలా ఈ యాప్‌లు రూపొందాయి.
దశలవారీగా అమలు
జిల్లాలో ఐదు పాఠశాలలను ఎంపిక చేసి, ఏఐ బోధనకు సన్నద్ధం చేస్తున్నారు. 50 మందికి పైగా విద్యార్థులున్న 535 ప్రాథమిక పాఠశాలలకు దశలవారీగా 5–10 కంప్యూటర్లు సరఫరా చేయనున్నారు. ఈనెల 23న మెగా పేరెంట్స్ మీటింగ్ ద్వారా తల్లిదండ్రులకు అవగాహన కల్పించనున్నారు. రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ జి. రమేశ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం వేగం పుంజుకుంది.
తెలంగాణ ప్రభుత్వం ఏఐ ఆధారిత బోధనతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా నాణ్యతను పెంచేందుకు కృషి చేస్తోంది. గణితంతో ప్రారంభమైన ఈ చొరవ, భవిష్యత్తులో మరిన్ని పాఠ్యాంశాలకు విస్తరించనుంది. ఈ సంస్కరణలు విద్యార్థుల సామర్థ్యాలను పెంచి, ప్రభుత్వ బడుల బలోపేతానికి దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
నాణ్యమైన విద్యకు తెలంగాణ సంకల్పం
పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక కార్యాచరణ
ప్రాథమిక పాఠశాలల్లో బోధన
జిల్లా నుంచి ఐదుగురికి రాష్ట్రస్థాయిలో శిక్షణ
వచ్చే విద్యాసంవత్సరం ప్రణాళికలు సిద్ధం