
ఐటీడీఏ పీవోకు నివేదిక
● ఇటీవల ఆశ్రమ పాఠశాలల్లో తనిఖీ ● సమగ్ర నివేదిక అందించిన పారాలీగల్ వాలంటీర్లు ● అభినందించిన కలెక్టర్ ● త్వరలో ఆస్పత్రుల పరిశీలన
నిర్మల్: జిల్లాలోని గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను వేసవి సెలవుల్లో పరిష్కరించాలని జిల్లా పారాలీగల్ వాలంటీర్ల బృందం సభ్యులు గురువారం ఐటీడీఏ పీఓ ఖుష్బూగుప్తాను కోరా రు. జిల్లా న్యాయసేవాసాధికార సంస్థ చైర్మన్, న్యా యమూర్తి రాధిక ఆదేశాల మేరకు ఇటీవల 22 మందితో కూడిన పారాలీగల్ వాలంటీర్లు జిల్లాలోని 17 ఆశ్రమ పాఠశాలలను పరిశీలించారు. ఈమేరకు సదరు నివేదికను న్యాయమూర్తితోపాటు కలెక్టర్ అభిలాషఅభినవ్‌కు అందించారు. అనంతరం ఉట్నూర్ వెళ్లి ఐటీడీఏ పీవోను కలిసి సమగ్ర నివేదిక అందించారు. జిల్లాలోని ఆశ్రమ పాఠశాలల్లో పరిస్థితులను బృందం సభ్యుడు, పెన్షనర్స్ సంఘం జాతీయనేత ఎంసీ.లింగన్న ఆమెకు వివరించారు.
త్వరలో ఆస్పత్రుల పరిశీలన..
పారాలీగల్ వాలంటీర్ల సేవలను కలెక్టర్ అభిలాషఅభినవ్ ప్రశంసించారు. బృందంలో ఉన్నవారందరూ రిటైర్డ్ అయిన పెన్షనర్స్ ఉన్నప్పటికీ పకడ్బందీగా సర్వీస్ చేస్తున్నారని అభినందించారు. ఆశ్రమ పాఠశాలలపై ఇచ్చిన నివేదిక ఆధారంగా చర్యలు చేపడతామన్నారు. న్యాయసేవాసాధికార సంస్థ చైర్మన్ ఆదేశాల మేరకు త్వరలో ప్రభుత్వ ఆస్పత్రుల పరిశీలన చేపట్టనున్న నేపథ్యంలో బృందం సభ్యులతో కలిసి కలెక్టర్ సంబంధిత వైద్యాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో పారాలీగల్ వాలంటీర్ల బృందం సభ్యులు, పెన్షనర్లు పాల్గొన్నారు.