
ధైర్యంగా చదువుకోవాలి
● ఎస్పీ జానకీషర్మిల
నిర్మల్‌టౌన్: విద్యార్థినులకు పోలీసులు అండగా ఉంటారని, ధైర్యంగా చదువుకోవాలని ఎస్పీ జానకీషర్మిల సూచించారు. జిల్లాలో వారంలో ఒకరోజు కేజీబీవీలో మహిళా పోలీసులు నిర్వహిస్తున్న ‘పోలీస్ అక్క’ కార్యక్రమంపై జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయం నుంచి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించా రు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలోని 18 పాఠశాలలకు 18 మంది మహిళా కానిస్టేబుళ్లను పర్యవేక్షణ అధికారులుగా నియమించా మని తెలిపారు. వారు వారంలో ఒకరోజు పాఠశాలను సందర్శిస్తారని, రాత్రి అక్కడే బస చేసి పిల్లలతో గడుపుతూ.. వారి సమస్యలు తెలుసుకుంటారని వివరించారు. విద్యార్థులను మానసికంగా ఉత్తేజపరిచి, తదుపరి చదువులపై సలహాలు సూచనలు చేస్తారన్నారు. ఉదయం మానసిక ఉల్లాసం, శారీరక ఉత్తేజం కోసం యోగా చేయిస్తారని తెలిపారు. ఏఎస్పీలు అవినాష్‌కుమార్, రాజేశ్‌మీనా, ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైలు పాల్గొన్నారు.