
● నాసిరకం విత్తనంతో నష్టాలు ● బరువు పెరగని సబ్సిడీ చేపల
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు వందశాతం సబ్సిడీతో చేప విత్తన పంపిణీ లక్ష్యం నీరుగారిపోతోంది. అదునులోపు చేప విత్తనం పంపిణీ చేయకపోవడం ఒక కారణమైతే.. నాసిరకం విత్తనాలతోనూ మత్స్యకారులు నష్టపోవాల్సి వస్తోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈసారి లక్ష్యం కంటే సగానికి తక్కువగానే చేపపిల్లలను నీటిలో వదిలారు. వర్షాకాలం ఆరంభంలో కాకుండా సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు విడుదలలో జాప్యం జరిగింది. ఉమ్మడి జిల్లాలో దాదాపు 994నీటి వనరుల్లో లక్ష్యం ప్రకారం 6కోట్లకు పైగా చేపపిల్లలను వదలాల్సి ఉన్నా 3.57 కోట్ల చేపపిల్లలు వదిలారు. రవు, బొచ్చె రకాలు ఎక్కువగా ఉన్నాయి. 35ఎంఎం నుంచి 40ఎంఎం, 80నుంచి 100ఎంఎం పరిమాణం ఉన్న చేపపిల్లలను వదిలారు. అయితే అవి ఆశించిన స్థాయిలో ఎదుగక సరైన దిగుబడి రాలేదు. కొన్ని చోట్ల మత్స్యకార సంఘాల సభ్యులే సొంత డబ్బులతో చేపపిల్లలు కొనుగోలు చేసి పెంచుతున్నారు. మంచిర్యాల జిల్లాలో మొత్తం 372చెరువుల్లో 1.09కోట్ల చేపపిల్లలకు గాను 47చెరువుల్లోనే 2.99లక్షల చేపపిల్లలు వదిలారు.
జాప్యం.. నాసిరకం
ఉమ్మడి జిల్లాలో ప్రధాన ప్రాజెక్టులతోపాటు చెరువుల్లో రూ.లక్షలు వెచ్చించి, చేపపిల్లలను కాంట్రాక్టర్లకు టెండర్లు పిలిచి అప్పగించింది. గత సర్కారు హయాంలో భారీగా అవకతవకలు జరిగాయని కొన్ని చోట్ల ఒప్పందాలు ర ద్దు చేసి కొత్తవారికి అవకాశం ఇచ్చారు. అయినా విత్తనంలో నాణ్యత లేక చాలా చోట్ల లక్ష్యం మేర చేపలు బరువు పెరగలేదు. అదే సమయంలో ప్రైవేటుగా కొనుగోలు చేసిన, చేప విత్తనాలు మాత్రం బరువు పెరిగినట్లుగా చెబుతున్నారు. ఏటా వానాకాలంలో చేప విత్తనాలను ఎల్లంపల్లి, అడ(కుమురం భీం), కడెం, పీపీ రావు, సాత్నాల, స్వర్ణ, నీల్వాయి, గొల్లవాగు, ర్యాలీ తదితర ప్రాజెక్టుల్లో వదులుతున్నారు. ఈసారి ప్రధాన ప్రాజెక్టులతోపాటు చెరువుల్లోనూ ఆశించిన మేర దిగుబడి లేదని మత్స్యకారులు వాపోతున్నారు.
నాసిరకంగా ఉన్నాయి..
గతేడాది కంటే ఈ ఏడాది చేప విత్తనాలు నాసిరకంగా ఉన్నాయి. ప్రభుత్వం చేప విత్తనాలకు బదులు నేరుగా డబ్బులు సొసైటీ సభ్యులకు జాయింట్ ఖాతాల్లో వేస్తే మేమే విత్తనాలను కొనుగోలు చేసుకుంటాం.
–పుట్టి నర్సయ్య, నర్సాపూర్(డబ్ల్యూ), లక్ష్మణచాంద మండలం, నిర్మల్ జిల్లా