
సంపూర్ణ ఆరోగ్యం లక్ష్యంగా..
● అంగన్‌వాడీ కేంద్రాల్లో పోషణ పక్వాడ ● ఈ నెల 22 వరకు కొనసాగనున్నకార్యక్రమం
జిల్లా సమాచారం..
లక్ష్మణచాంద: చిన్నారులు, గర్భిణులు, బాలింతలలో పోషకాహార లోపాన్ని అధిగమించి, వారిని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దేందుకు సీ్త్రశిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంగన్‌వాడీ కేంద్రాలలో పోషణ పక్వాడ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమం ఈ నెల 8న ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ప్రారంభమైంది. 22వ తేదీ వరకు కొనసాగనుంది. చిన్నారులు, కిశోర బాలికలు, గర్భిణులు, బాలింతలలో పోషకాహార లోపాన్ని తొలగించడంలో ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
జిల్లాలో ఇలా...
జిల్లాలో నాలుగు ఐసీడీఎస్ డివిజన్‌లలో కలిపి మొత్తం 926 అంగన్‌వాడి కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 816 మెయిన్ అంగన్‌వాడీ కేంద్రాలు, 110 మినీ అంగన్‌వాడీ కేంద్రాలు. ఈ కేంద్రాల ద్వారా 0–6 సంవత్సరాల వయస్సు గల 57,077 మంది చిన్నారులు, 5,916 మంది గర్భిణులు, 6,012 మంది బాలింతలు సేవలు పొందుతున్నారు.
పోషణ పక్వాడ కార్యకలాపాలు
ఆరోగ్య పరిశీలన: గర్భిణులు, చిన్నారుల బరువు తనిఖీ చేయడం, రెండేళ్లకన్నా తక్కువ వయస్సు గల చిన్నారుల పెరుగుదలను పరిశీలించడం.
తల్లిపాల అవగాహన: గ్రామాల్లో ఇంటింటి సందర్శనలు చేసి తల్లిపాల ఆవశ్యకతపై అవగాహన కల్పించడం.
పోషకాహార విద్య: గర్భిణీలు, బాలింతలకు పోషకాహారం ప్రాముఖ్యతను ప్రత్యేక కార్యక్రమాల ద్వారా వివరించడం.
వ్యక్తిగత పరిశుభ్రత: వ్యక్తిగత పరిశుభ్రత, స్వచ్ఛమైన తాగునీటి ప్రాముఖ్యతపై అవగాహన కల్పించడం మరియు రక్త పరీక్షలు నిర్వహించడం.
పోషకాహార వంటకాలు: ఆహార పదార్థాలు, చిరుధాన్యాల ప్రాముఖ్యతను వివరిస్తూ వంటకాలు తయారు చేసి, పోషకాహార విలువలను ప్రత్యక్షంగా తెలియజేయడం.
టీకాల షెడ్యూల్ తనిఖీ: వ్యాధి నిరోధక టీకాల షెడ్యూల్‌ను పరిశీలించడం.
గర్భిణుల సంరక్షణపై అవగాహన: గర్భిణుల సంరక్షణలో భర్తల పాత్రపై అవగాహన కల్పించడం.
ఈ కార్యక్రమాల ద్వారా జిల్లాలోని చిన్నారులు, గర్భిణులు, బాలింతల ఆరోగ్య స్థితిని మెరుగుపరచడంతోపాటు, సమాజంలో పోషకాహారం, ఆరోగ్యంపై అవగాహన పెంపొందించే లక్ష్యంతో సీ్త్ర శిశుసంక్షేమ శాఖ పనిచేస్తోంది.
అందరూ పాల్గొనాలి
చిన్నారులు, గర్భిణులు, బాలింతలు, కిశోర బాలికల్లో పోషకాహార లోపం నివారించేందుకు సీ్త్ర శిశుసంక్షేమ శాఖ, ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పోషణ పక్వాడ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అంగన్‌వాడీ కేంద్రాలలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాల్లో అందరూ భాగస్వాములు కావాలి. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.
– నాగలక్ష్మి, ఇన్‌చార్జి, డీడబ్ల్యూవో
జిల్లాలోని ప్రాజెక్టులు 04
అంగన్‌వాడీ కేంద్రాలు 926
0 నుంచి 6 ఏళ్ల లోపు చిన్నారులు 57,077
బాలింతలు 6,012
గర్భిణులు 5,916