
పాతికేళ్ల గులాబీ
● ఉమ్మడి జిల్లాలో వికసిస్తూ.. ముళ్లను సైతం ముద్దాడుతూ ● తొలి ఎన్నికల నుంచే సత్తా చాటిన ఉద్యమ పార్టీ ● ‘తెలంగాణ’ ఏర్పాటు తర్వాత రెండుసార్లు ప్రభంజనం ● మొన్నటి ఎన్నికల్లో మాత్రం ప్రతికూలం ● కేడర్‌పైనే కీలక నేతల ధీమా ● రజతోత్సవ వేళ శ్రేణుల్లో మళ్లీ ఉత్సాహం ● బీఆర్‌ఎస్ 25 ఏళ్ల ప్రస్థానం ఆసక్తికరం
కలిసిరాని కాలం..
అయితే 2023 ఎన్నికలు బీఆర్‌ఎస్‌కు కలిసి రాలేదు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండుసార్లు అధికారంలో ఉన్న గులాబీ పార్టీకి ఒక విధంగా ఎదురుదెబ్బ తగిలింది. ఉమ్మడి ఆదిలాబాద్‌లో కేవలం బోథ్, ఆసిఫాబాద్ నియోజకవర్గాల్లోనే ఆ పార్టీ అభ్యర్థులు అనిల్ జాదవ్, కోవ లక్ష్మి గెలుపొందారు. ఇదిలా ఉంటే మొదటి నుంచి పార్లమెంట్ ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే.. ఆదిలాబాద్ పరంగా 2004లో మధుసూదన్ రెడ్డి, 2014లో గోడం నగేష్ గులాబీ పార్టీ నుంచి ఎంపీలుగా గెలిచారు. ఇక పెద్దపల్లి నుంచి 2014లో బాల్క సుమన్, 2019లో వెంకటేశ్ నేత ఎంపీలుగా మారారు. ఉమ్మడి జిల్లాలో జెడ్పీ చైర్మన్‌గా వల్లకొండ శోభారాణి సత్యనారాయణ గౌడ్, ఆ తర్వాత రాథోడ్ జనార్దన్ వ్యవహరించారు. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత నాలుగు జెడ్పీలు ఏర్పడగా, ఈ నాలుగింటిలోనూ బీఆర్‌ఎస్ పాగా వేసింది. అయితే గత ఎన్నికల్లో చేదు ఫలితాలు ఎదురుకావడం, ఈ క్రమంలో పార్టీని పలువురు నేతలు వీడినా కార్యకర్తలు మాత్రం వెన్నంటి ఉన్నారనే ధీమా గులాబీ ముఖ్యనేతల్లో వ్యక్తమవుతోంది.
సాక్షి, ఆదిలాబాద్: భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) రజతోత్సవానికి సిద్ధమైంది. ఈ నెల 27న వరంగల్‌లో భారీ మహాసభకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు పార్టీ కేడర్ సన్నద్ధమవుతోంది. 25 ఏళ్ల ఆ పార్టీ ప్రస్థానంలో రాష్ట్రంలో మాదిరే జిల్లాలోనూ అనేక ఆటుపోట్లను ఎదుర్కొంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత గులాబీ పార్టీ రెండుసార్లు అధికా రంలోకి వచ్చింది. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లాలోనూ పటిష్టంగా రూపొందింది. అయితే గత ఎన్నికల్లో ఓటమితో కొంత నైరాశ్యం చోటు చేసుకుంది. పలువురు నేతలు పార్టీని వీడినా పునాది లాంటి కార్యకర్తలు వెన్నంటే ఉన్నారన్న అభిప్రాయం నాయకత్వంలో ధీమా నింపుతోంది. పార్టీ రజతోత్సవం తర్వాత మరింత ఉత్సాహం చోటు చేసుకోనుందని, రానున్న రోజుల్లో కేసీఆర్ పాలననే ప్రజలు కోరుకుంటున్నారని ఆ పార్టీ శ్రేణులు నర్మగర్భంతో పేర్కొంటున్నారు.
మొదటి ఎన్నికలతోనే ప్రభంజనం..
బీఆర్‌ఎస్ (అప్పటి టీఆర్‌ఎస్) పార్టీ 2001 ఏప్రిల్ 27న ఏర్పడింది. 2004 సార్వత్రిక ఎన్నికల్లో మొదటిసారి రాష్ట్రంలో పోటీ చేసింది. తెలంగాణలో 26 సీట్లలో గెలుపొందింది. ఉమ్మడి జిల్లాలో ఆ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ముథోల్ నుంచి నారాయణరావు పటేల్, బోథ్ నుంచి సోయం బాపూరావు, ఖానాపూర్ నుంచి అజ్మీరా గోవింద్ నాయక్ గెలు పొందారు. పార్లమెంట్ ఎన్నికల్లో నాడు ఆదిలాబా ద్ ఎంపీ జనరల్ స్థానంగా ఉండగా, అప్పట్లో గులాబీ పార్టీ నుంచి టి.మధుసూదన్‌రెడ్డి గెలుపొందారు. ఈ విధంగా ఆ పార్టీ ఉమ్మడి జిల్లాలో ఆదిలాబాద్ పార్లమెంట్‌తోపాటు మూడు అసెంబ్లీ స్థానాలను కై వసం చేసుకుంది.
అప్పట్లోనే అసమ్మతి వర్గం..
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అధినేత కేసీఆర్ నాడు పార్టీ నుంచి గెలిచిన ప్రజాప్రతినిధులందరినీ రాజీనామా చేయాలని కోరారు. అయితే అప్పట్లో ఎంపీ మధుసూదన్‌రెడ్డి, ఖానాపూర్ ఎమ్మెల్యే గోవింద్‌నాయక్ కేసీఆర్‌కు మద్దతుగా రాజీనామా చేయగా, బోథ్ నుంచి గెలుపొందిన సోయం బాపూరావు, ముథోల్ నుంచి గెలుపొందిన నారాయణ రావు పటేల్ అసమ్మతివర్గంగా నిలిచారు. దీంతో మొదటి ఎన్నికల తర్వాత రాష్ట్రంలో, ఇటు జిల్లాలో నూ అసమ్మతి కారణంగా పార్టీకి గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయి. ఉప ఎన్నికల్లో మళ్లీ ఎంపీగా పోటీ చేసిన మధుసూదన్‌రెడ్డి, ఖానాపూర్‌లో తిరిగి పోటీ చేసిన గోవింద్ నాయక్ ఇద్దరూ ఓటమి చెందారు. మళ్లీ పుంజుకున్న వైనం..
2009 ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో బీఆర్‌ఎస్‌కు చెన్నూర్ నుంచి నల్లాల ఓదెలు, మంచిర్యాల నుంచి గడ్డం అరవింద్‌రెడ్డి, సిర్పూర్ నుంచి కావేటి సమ్మయ్య గెలుపొందారు. దీంతో పార్టీ మళ్లీ పుంజుకుంది. ఆ తర్వాత ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం తీవ్రరూపం దాల్చడం, సబ్బండ వర్గాలు కలిసి రావడంతో బీఆర్‌ఎస్‌కు కలిసి వచ్చింది. అప్పట్లో కేసీఆర్ ఆదేశాల మేరకు ఎమ్మెల్యేలు రాజీ నామా చేయగా, తిరిగి ఉప ఎన్నికల్లో ఆ మూడు స్థానాల నుంచి గెలుపొందింది. ఈ విధంగా పార్టీ తన స్థానాన్ని పదిలపర్చుకుంది. రాజకీయ సుస్థిరత సాధించింది. 2009 ఎన్నికల్లో ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచి టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన జోగు రామన్న మధ్యలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ నేపథ్యంలో ప్రజల అభీష్టం మేరకు ఆ పార్టీకి రాజీనామా చేసి 2012లో బీఆర్‌ఎస్‌లో చేరారు. గులాబీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలు పొందారు. దీంతో ఎమ్మెల్యేల సంఖ్య నాలుగుకు పెరగగా ఉమ్మడి జిల్లాలో పార్టీ బలంగా మారింది.
ఇక వెనుదిరిగి చూడని వైనం..
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడటం, బీఆర్‌ఎస్‌కు ప్రజల్లో ఆదరణ పెరగడంతో ఇతర పార్టీల్లోని ముఖ్య నేతలంతా బీఆర్‌ఎస్‌లోకి వలస వచ్చారు. దీంతో పార్టీ బలంగా తయారైంది. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ దూసుకుపోయింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జెడ్పీని సైతం కై వసం చేసుకుంది. మున్సిపాలిటీల్లోనూ పాగా వేసింది. 2014 ఎన్నికల్లో ఉమ్మడి ఆది లాబాద్ జిల్లాలో బీఆర్‌ఎస్ ఏకంగా ఏడు స్థానాల్లో గెలుపొందింది. నిర్మల్, సిర్పూర్‌లో ఐకేరెడ్డి, కోనప్పలు బీఎస్పీ నుంచి గెలుపొంది ఆ తర్వాత బీఆర్‌ఎస్‌లో చేరారు. ఆ ఎన్నికల్లో ముథోల్ నుంచి ఏకై క స్థానం గెలుపొందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి కూడా ఆ తర్వాత కాలంలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. 2018 ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఉమ్మడి జిల్లాలో ఏకంగా తొమ్మిది స్థానాల్లో గెలుపొందగా, ఆసిఫాబాద్ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీచేసిన ఆత్రం సక్కు గెలుపొందారు. ఆ తర్వాత ఆయన కూడా గులాబీ పార్టీలో చేరడంతో పదికి పది స్థానాలు బీఆర్‌ఎస్ హస్తగతం అయ్యాయి. ఈ విధంగా ఉద్యమకాలంలో ఉమ్మడి జిల్లాలో గులాబీ పార్టీ మొదట్లో ఆటుపోట్లు ఎదుర్కొన్నా, ప్రత్యేక రాష్ట్రంలో తిరుగులేని పార్టీగా అవతరించింది.