నిజామాబాద్: ఆర్మూర్‌లో బుధవారం జరిగిన జంట హత్యలతో పట్టణ ప్రజలు ఉలిక్కిపడ్డారు. పట్టణంలోని రెండో వార్డు పరిధిలోని జిరాయత్‌నగర్‌లో నివాసముండే రాజవ్వ(72), గంగవ్వ(62) అనే అక్కాచెల్లెళ్లను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హతమార్చారు.
పట్టణానికి చెందిన రాజవ్వ, గంగవ్వ అక్కాచెల్లెళ్లు. రాజవ్వకు 20 ఏళ్ల క్రితం విడాకులు కావడంతో ఒంటరిగా ఉంటుంది. గంగవ్వకు ఇద్దరు కుమారులు శ్రీనివాస్, మహిపాల్ ఉండగా.. శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్‌లో, చిన్న కుమారుడు మహిపాల్ మామిడిపల్లిలో ఉంటున్నారు. గంగవ్వ భర్త 20 ఏళ్ల క్రితం మృతి చెందడంతో అనారోగ్యంతో మంచానపడ్డ అక్క రాజవ్వకు సపర్యలు చేసుకుంటూ ఒకే ఇంట్లో నివాసముంటున్నారు. మహిపాల్ తన తల్లి గంగవ్వకు నిర్మల్ జిల్లా ముదోల్ ఆస్పత్రిలో మంగళవారం నేత్ర పరీక్షలు చేయించుకుని సాయంత్రం ఇంటి వద్ద వదిలేసి వెళ్లిపోయాడు.
బుధవారం ఉదయమే ఇద్దరు మహిళలు ధారుణ హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని దుండగులు ఒంటరిగా ఉంటున్న వారి తలలపై ఆయుధాలతో దాడి చేసి హతమార్చారు. అనంతరం హత్యలను ప్రమాదంగా చిత్రీకరించేందుకు ఇంట్లోని దుస్తులకు నిప్పు పెట్టి జారుకున్నారు. ఇంటి నుంచి పొగలు వస్తుండడంతో స్థానికులు గంగవ్వ కుమారుడు మహిపాల్‌కు సమాచారం అందించారు. అనంతరం లోపలికి వెళ్లిన స్థానికులు పొగల మధ్యన మహిళలను వెతుకుతుండగా హత్యకు గురై విగత జీవులుగా పడి ఉన్నారు.
అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. ఆర్మూర్ ఏసీపీ ప్రభాకర్ రావు, ఎస్‌హెచ్‌వో సురేష్ బాబు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. జిల్లా కేంద్రం నుంచి జాగిలాలను రప్పించి ఆధారాలు సేకరించారు.
ఘటన స్థలాన్ని పరిశీలించిన సీపీ
మహిళలను వారిపై ఉన్న నగల కోసమే హత్య చేసి ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు. ఇంటి పక్కన కల్లు కాంపౌండ్ ఉండడంతో అక్కడికి వచ్చే వారే ఒంటరిగా ఉంటున్న మహిళలను హత్య చేసి ఉంటారని భావిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరు కున్న ఇన్‌చార్జీ సీపీ ప్రవీణ్‌కుమార్ హత్యలు జరిగిన తీరును పరిశీలించారు. అన్ని కోణాల్లో విచారించి నేరస్తులను త్వరగా పట్టుకోవాలని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment