ఇందూరు గడ్డ బీజేపీకి అడ్డా
సుభాష్‌నగర్: ఇందూరు గడ్డ బీజేపీకి అడ్డా అని, ఢిల్లీ ఎన్నికల ఫలితాల తర్వాత రాజకీయాల్లో అనేక మార్పులు వచ్చాయని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా , బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని పార్టీ నగర కార్యాలయంలో కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లా ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా అర్బన్ నియోజకవర్గ మండలాల అధ్యక్షులు, కార్యకర్తలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపునకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని, ప్రత్యేక వ్యూహరచనతో ముందుకు సాగాలని సూచించారు. ఎన్నికల హామీల మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగ భృతి రూ.3వేలు, లక్ష ఉద్యోగాలు ఇవ్వలేదని ఆరోపించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం అమలు కాక పేద విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారని అన్నారు. 317 జీవో విషయంలో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇలాంటి అనేక రకాల సమస్యలపై ప్రశ్నించే గొంతుకలైన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమరయ్యకు మొదటి ప్రాధాన్యతగా ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఓటర్లకు వ్యక్తిగతంగా కలుస్తూ వివరించాలని కార్యకర్తలకు సూచించారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ కులాచారి, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు మహేందర్, రంగారెడ్డి జిల్లా అర్బన్ అధ్యక్షుడు సామ రంగారెడ్డి, నాయకులు నాగోళ్ల లక్ష్మీనారాయణ, న్యాలం రాజు, కొండా ఆశన్న, మండలాల అధ్యక్షులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ
Comments
Please login to add a commentAdd a comment