21 రకాల కేటగిరీలను చేర్చిన కేంద్రం
వచ్చే నెల నుంచి దరఖాస్తులు చేసుకునే అవకాశం
డొంకేశ్వర్(ఆర్మూర్): సదరం సేవలు మరింత సులభం కానున్నాయి. మీ సేవ కేంద్రాల్లో స్లాట్ నమోదు చేసుకొని వేచిచూసే బాధలు దూరం కానున్నాయి. స్వయంగా దివ్యాంగులే దరఖాస్తు చేసుకునేలా కేంద్రం కొత్తగా యూనిక్ డిజెబిలిటీ ఐడీ (యూడీఐడీ) పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ పోర్టల్‌లో సదరం సర్టిఫికెట్ లేనివారు కొత్తగా దరఖాస్తు చేసుకోవచ్చు. సమగ్ర వివరాలతోపాటు పాస్‌పోర్టు సైజ్ ఫొటో, సంతకం, ఆధార్ లేదా మరేదైనా గుర్తింపు కార్డును అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అనంతరం సదరం శిబిరం జరిగే స్థలాన్ని ఎంపిక చేసుకొని అప్లికేషన్‌ను సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఆ దరఖాస్తును అధికారులు పరిశీలించి సదరం క్యాంపునకు ఎప్పుడు హాజరు కావాలనే వివరాలను దరఖాస్తుదారుని సెల్‌ఫోన్‌కు పంపుతారు. శిబిరంలో సంబంధిత వైద్య నిపుణులు మెడికల్ రిపోర్టులను పరిశీలించి వైకల్యాన్ని నిర్ధారిస్తారు. కాగా, దరఖాస్తు ఏ స్థాయిలో ఉందో తెలుసుకునే అవకాశం కూడా పోర్టల్‌లో ఉంది. అయితే, పోర్టల్‌ను సిద్ధం చేసిన ప్రభుత్వం ప్రస్తుతం ట్రయల్ నిర్వహిస్తోంది. మార్చి నెల నుంచి పోర్టల్ అందుబాటులోకి రానున్నట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి సాయాగౌడ్ తెలిపారు.
‘స్మార్ట్’గా సదరం సర్టిఫికెట్
సదరం సర్టిఫికెట్లు ఇప్పటి వరకు ఏ4 సైజు పేపర్‌లో జారీ అయ్యేవి. ఇక మీదట స్మార్ట్ కార్డు రూపంలో ఇవ్వనున్నారు. కార్డుపై ఐడీ నెంబరుతోపాటు లబ్ధిదారుని ఫొటో, పేరు, వైకల్య రకం, వైకల్య శాతం వివరాలు ఉంటాయి. స్మార్ట్ కార్డును పోస్టుద్వారా ఇంటికే పంపుతారు. ఇప్పటికే సదరం సర్టిఫికెట్ ఉన్న వారికి కూడా స్మార్ట్ కార్డులను జారీ చేస్తున్నారు.
పెరిగిన సేవలు
ఇప్పటి వరకు మీ సేవ కేంద్రాల్లో సదరం స్లాట్ నమోదు చేసుకునేందుకు కేవలం ఐదు రకాల కేటగిరీల వారికే అవకాశం ఉండేది. ఇప్పుడు కేంద్రం కొత్తగా రూపొందించిన యూడీఐడీ పోర్టల్‌లో మొత్తం 21 రకాల కేటగిరీలను చేర్చింది. ఇందులో ప్రధానంగా తలసేమియా, ఆటిజం, యాసిడ్ బాధితులు, న్యూరో సంబంధిత బాధితులు కూడా సదరం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment