నిజామాబాద్ రూరల్: రూరల్ మండలంలోని తాళ్ల కొత్తపేట్ వద్ద ఇటీవల జరిగిన దారిదోపిడీ ఘటనలో నిందితులను అరెస్టు చేసినట్లు సీఐ సురేష్ శుక్రవారం తెలిపారు. ఈమేరకు జిల్లా కేంద్రంలోని సౌత్ రూరల్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఎడపల్లి మండలం కుర్నాపల్లి గ్రామానికి చెందిన పంచాల జితేష్ ఈనెల 19న రాత్రివేళ బైక్‌పై జిల్లా కేంద్రం నుంచి స్వగ్రామానికి బయలుదేరాడు. రూరల్ మండలంలోని తాళ్లకొత్తపేట్ వద్ద గంగా రైస్‌మిల్‌లో హమాలీ పని చేస్తున్న కుందన్ కుమార్, విజయ్ కుమార్, సుందర్ కుమార్ ముగ్గురు కలిసి జితేష్‌ను అడ్డుకొని, గాయపరిచారు. అనంతరం అతడి వద్ద నుంచి రూ.1000నగదుతో పాటు సెల్‌ఫోన్, సోనీ కెమెరాను దోచుకున్నారు. మరుసటి రోజు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా, విచారణ చేపట్టి, నిందితులను పట్టుకున్నట్లు తెలిపారు. ఈ కేసును ఛేదించిన రూరల్ సీఐ సురేష్, ఎస్సై మహ్మద్ ఆరీఫ్‌లను ఏసీపీ అభినందించారు. జితేష్‌కు ముందు చిందకుంటకు చెందిన రాజేశ్వర్ రెడ్డిపై కూడా నిందితులు దాడికి యత్నించగా అతను తప్పించుకున్నాడని తెలిసింది.