
ఉన్నది 11.4 టీఎంసీలే..
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నీటి మట్టం గణ నీయంగా తగ్గింది. ఈ ఏడాది ఎగువ ప్రాంతాల నుంచి (2024 జూన్ నుంచి 2025 ఏప్రిల్ వరకు) 289 టీఎంసీల ఇన్‌ఫ్లో వచ్చింది. వరద, ఎస్కేప్ గేట్ల ద్వారా మిగులు జలాలను, కాలువల ద్వారా ఆయకట్టుకు నీటిని విడుదల చేశారు. ఆవిరితో కలుపుకుని మొత్తం 285 టీఎంసీల నీరు వెళ్లిపోగా ఈ ఏడాదిలో వచ్చిన ఇన్‌ఫ్లోలో మిగిలింది కేవలం 4 టీఎంసీలు మాత్రమే. ప్రాజెక్ట్ డెడ్ స్టోరేజీ 5 టీంసీలు కాగా, వరద వచ్చే సమయానికి ప్రాజెక్టులో 7.4 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఆ నీటిని కలుపు కుని ప్రస్తుతం ప్రాజెక్ట్‌లో 11.4 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
117 టీఎంసీలు గోదావరి పాలు
ఈ ఏడాది ఇన్‌ఫ్లో కొనసాగిన సమయంలో వరద గేట్ల ద్వారా 108, ఎస్కేప్ గేట్ల ద్వారా 9 టీఎంసీలు మొత్తం 117 టీఎంసీల నీరు గోదావరికిలోకి వదిలేశారు. మొత్తం ఇన్‌ఫ్లో 289 టీఎంసీలు కాగా.. 117 టీఎంసీల నీరు ఇలా వచ్చి అలా వెళ్లిపోయింది. 172 టీఎంసీల నీరు మిగలగా అందులో వరద కాలువ ద్వారా 49 టీఎంసీలు విడుదల చేయగా 12 టీఎంసీల నీరు ఆవిరైంది. తాగు నీటి అవసరాలకు 6 టీఎంసీల నీటిని వినియోగించారు. ఆయకట్టుకు 101 టీఎంసీల నీటిని వినియోగించారు. దీనిలో సింహభాగం కాకతీయ కాలువకు విడుదల చేసినట్లు రికార్డులు తెలుపుతున్నాయి. అయితే ఏ కాలువ ద్వారా ఎంత నీటిని విడుదల చేశారో స్పష్టమైన లెక్కలు ఇచ్చేందుకు అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్ట్‌లో 11.44 టీఎంసీల నీరు నిల్వ ఉండగా, డెడ్ స్టోరేజీ 5 టీఎంసీలు పోగా మిగిలేది 6.44 టీఎంసీలు మాత్రమే. ఆవిరిపోను మిగిలిన నీరు తాగునీటి అవసరాలకు ఉపయోగపడుతుంది. పూడిక కారణంగా ప్రాజెక్టు నీటినిల్వ సామర్థ్యం 32 టీఎంసీలు తగ్గిపోయింది. భవిష్యత్‌లో మరింత పూడిక పేరుకుపోతే ప్రాజెక్ట్ కేవలం తాగు నీటి అవసరాలకే ఉపయోగపడుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్ట్ నీటి నిల్వసామర్థ్యాన్ని పెంచేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు
ఈ ఏడాది ఇన్ ఫ్లో 289 టీఎంసీలు
గణనీయంగా తగ్గిన
ఎస్సారెస్పీ నీటిమట్టం
భారీ వరద వచ్చినా ఫలితం లేదు
డెడ్ స్టోరేజీ పోను
మిగిలేది 6.44 టీఎంసీలే..