
ఆకట్టుకున్న రైతు మహోత్సవం స్టాల్స్
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్‌లో మూడు రోజుల పాటు నిర్వహించనున్న రైతు మహోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాల్స్ ఆకట్టుకుంటున్నాయి. వ్యవసాయ, అనుబంధ శాఖల విభాగాలు, పలువురు రైతుల ఆధ్వర్యంలో సుమారు 150 స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. తెలంగాణతో పాటు ఏపీ నుంచి సైతం పలువురు రైతులు వచ్చి తమ స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు.
● నందిపేట మండలంలోని చింరాజ్‌పల్లి గ్రామానికి చెందిన 750 మంది రైతులు రైతు ఉత్పత్తిదారుల సంఘం ఏర్పాటు చేసుకుని పసుపు, మిర్చి పంటలను మార్కెట్ చేసుకుంటున్నారు. వీరు ఏర్పాటు చేసిన స్టాల్‌లో వారి పంట ఉత్పత్తులను ప్రదర్శించారు.
● జక్రాన్‌పల్లి మండలం చింతలూరు గ్రామానికి చెందిన ఆదర్శ రైతు చిన్నికృష్ణుడు 170 దేశీ వరి రకాల సేంద్రియ విత్తనాలను ప్రదర్శనకు ఉంచారు.
● బీర్కూర్ మండలంలోని మల్లాపూర్‌కు చెందిన సత్యవతి అనే మహిళా రైతు సుభాష్ పాలేకర్ విధానంలో 3 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. పసుపు, కంది, అరటి పంటలను ప్రకృతి విధానంలో పండిస్తున్నారు. ఈ మహిళా రైతు స్టాల్ ఆకట్టుకుంది.
● ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాలకు చెందిన తిరుమల్‌రెడ్డి అనే రైతు ‘నల్లమల హనీబీ పార్క్’ పేరిట తీసుకొచ్చిన నాణ్యమైన తేనె, అదేవిధంగా నిర్మల్‌కు చెందిన శ్రీనివాస్ అనే రైతు తీసుకొచ్చిన నాణ్యమైన తేనైపె పలువురు ఆసక్తి చూపారు.
● బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో టెర్రస్ గార్డెన్స్ ఏర్పాటు విషయమై ఏర్పాటు చేసిన స్టాల్ ఆకట్టుకుంది. ప్రతిఒక్కరూ ఇంటిపైన కూరగాయలు సేంద్రియ విధానంలో సాగు చేసుకుంటే ఆరోగకరమైన సమాజం నెలకొంటుందని సందేశం ఇచ్చేలా ఏర్పాటు చేసిన ఈ స్టాల్‌కు అనేకమంది వచ్చి వివరాలు తెలుసుకున్నారు. రాష్ట్ర సహకార యూనియన్ చైర్మన్ మానాల మోహన్‌రెడ్డి, నుడా చైర్మన్ కేశవేణు ఈ స్టాల్‌ను సందర్శించి సందర్శకులకు టెర్రస్ గార్డెన్స్ ప్రాధాన్యత గురించి వివరించారు.
వ్యవసాయ అనుబంధ శాఖలు,
రైతు ఉత్పత్తిదారు సంఘాలు,
రైతుల ఆధ్వర్యంలో ఏర్పాటు