HSBC survey: ఏదేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతి అంటూ ఎప్పుడో చెప్పారు రాయప్రోలు సుబ్బారావు. ఆ మహానీయుడి మాటలను ఇప్పుడు నిజం చేస్తున్నారు ప్రవాస భారతీయులు. విదేశాల్లో స్థిరపడినా ఇప్పటికీ భారతీయ మూలాలను మరచిపోవడం లేదు. విదేశాల్లోనే మూడో తరం ఎన్నారైలు వచ్చినా ఇప్పటికీ ఇక్కడి మట్టి పరిమళాలను గుర్తు చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రవాస భారతీయులు వివిధ అంశాలపై ఏమనుకుంటున్నారనే విషయాలపై గ్లోబల్ పల్స్ రిపోర్టు పేరుతో ఇటీవల హెచ్‌ఎస్‌బీసీ సర్వే చేపట్టింది. వివిధ దేశాలకు చెందిన 4,152 మంది నుంచి అభిప్రాయాలను సేకరించి క్రోడీకరించింది. అందులో ఇప్పటికీ ప్రవాసులకు భరతమాత మీద ప్రేమ తగ్గలేదని తేటతెల్లం చేసింది.
ఎన్నారైలు ఎక్కువగా వెలితిగా భావిస్తున్న అంశాలు
- ఓవరాల్‌గా ఎన్నారైలలో 57 శాతం మంది ఫ్యామిలీ, 52 శాతం మంది ఫుడ్, 46 శాతం మంది స్నేహితులు, 36 శాతం మంది కల్చర్, 25 శాతం మంది ప్రాంతీయను మిస్ అవుతున్నామని తెలిపారు. నోరూరించే ఇండియన్ ఫుడ్‌కి సంబంధించి ఇండియాలో పుట్టి పెరిగి అమెరికాలో సెటిలైన మొదటి తరానికి, అమెరికాలోనే పుట్టి అక్కడే చదువుతున్న మూడో తరం మధ్య అంతరం పెద్దగా లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇండియన్ ఫుడ్‌ను ఎక్కువగా మిస్ అవుతున్నామని మొదటి తరంలో 55 శాతం మంది అభిప్రాయపడగా రెండో తరంలో 51 శాతం మూడో తరానికి వచ్చే సరికి 42 శాతంగా ఉంది.
ప్రవాసులు ఎక్కువగా కలిపి ఉంచుతున్న అంశాలు
- ఈట్, ఇండియన్ ప్రత్యేక వంటకాలు 63 శాతం మంది
- ఇండియన్ పండగలు, పేరంటాలు జరుపుకోవడం 52 శాతం
- స్వదేశంలో ఉన్న కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులకు సొమ్ము పంపడం
- ఇండియాలో జరుగుతున్న సమాకాలీన అంశాల పట్ల ఆసక్తి కలిగి ఉండటం, ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవడం
- తరచుగా ఇండియాకు వస్తుండటం
విదేశాల్లో భారతీయులను బలంగా కలిపి ఉంచే అంశాలు
క్రికెట్, స్పోర్ట్స్, సైన్స్, టెక్నాలజీ ఇలా వివిధ అంశాల్లో భారత్ సాధించే విజయాలు తమ మధ్య బంధాలను బలంగా మారుస్తున్నాయని 80 శాతం మంది ప్రవాసులు అభిప్రాయపడ్డారు. భారత విజయాల తర్వాత ఇండియాతో గల అనుబంధం అని 77 శాతం మంది భవిష్యత్తులో భారత్ సూపర్ పవర్ కావాలనే ఆకాంక్ష అని 68 శాతం మంది తెలిపారు.
మనిషే అక్కడ.. మనసు ఇక్కడే
విదేశాల్లో స్థిరపడినప్పటికీ ఇప్పటికీ తాము ఇండియన్లనే అని నమ్మే ప్రవాస భారతీయుల్లో మొదటి తరం వారు 83 శాతం ఉండగా రెండో, మూడో తరం వ్యక్తులు 70 శాతం ఇదే తరహా భావనలో ఉంటున్నారు. ఇందులో మొదటి తరంలో రిటైర్ అయిన తర్వాత ఇండియాకు వచ్చేయాలని ఫీలవుతున్న వారు 40 శాతానికి పైగానే ఉన్నారు.
వచ్చే మూడేళ్లలో ఇండియాలో పెట్టుబడులు పెడతారా ?
35 శాతం మంది తమ పెట్టుబడులను స్వల్పంగా పెంచుతామని చెప్పారు. ఆ తర్వాత 25 శాతం మంది భారీగా ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తి చూపించారు. 24 శాతం మంది ప్రస్తుతం ఉన్న విధంగానే కంటిన్యూ అవుతామన్నారు. కేవలం 7 శాతం మంది మాత్రమే తమ పెట్టబడులు తగ్గిస్తామంటూ తెలిపారు. ఇప్పటికిప్పుడు ఇండియాలో పెట్టుబడులు పెట్టేందుకు 80 శాతం మంది సుముఖత వ్యక్తం చేశారు.
ఎన్విరాన్‌మెంట్‌పై ఆసక్తి
తాము నివసిస్తున్న దేశం లేదా ఇండియాలో రాబోయే రెండేళ్లలో ఏ రంగంలో ఎక్కువ పెట్టుబడులు పెడతారని ప్రశ్నించగా 73 శాతం మంది ఎన్విరాన్‌మెంట్ , సోషల్ ఇన్షియేటివ్ రంగాల్లో ఇన్వెస్ట్ చేస్తామంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు.
చదవండి: రిటైల్ డైరెక్ట్ స్కీమ్‌కు ఎన్ఆర్ఐల నుంచి భారీ స్పందన
Comments
Please login to add a commentAdd a comment