ఎన్నో అందాలు.. మరెన్నో విశిష్టతలు
సుదీర్ఘ ప్రయాణాలకు అమెరికా పెట్టింది పేరు
తూర్పు నుంచి పశ్చిమం వరకు
రోజుల తరబడి ప్రయాణాలు
ఇండియా నుండి అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా వంటి దేశాలకు వెళ్లే వాళ్ళను విమానాశ్రయాల్లో గమనిస్తే మూడుకాళ్ళ ముసలివాళ్ళు ఎక్కువగా కనబడుతుంటారు. ఇలాంటి వారికి వేలాది మైళ్ళ ప్రయాణం చేయగలిగే శక్తి ఉత్సాహలనిచ్చే అసలు అదృశ్యశక్తి దూర దేశాల్లోకి అంతర్జాలమే వాహనంగా దూరిపోయిన మన ఎన్‌ఆర్‌ఐ పిల్లలదేనన్నది నిస్సందేహం.
హార్డ్‌వేర్ బతుకుల్లో సాఫ్ట్‌వేర్ పిల్లలు
పండు ముదుసళ్లకు తప్పని ఫారిన్ ట్రిప్పులు !
ఎందుకు నాయనా ఈ వయసులో మాకు శ్రమ! అని ఆమ్మో నాన్నో తప్పించుకోజూస్తే.. ‘అలాకాదు మా చదువుల కోసం మీరు చేసిన అప్పులకు, పగలనకా రాత్రనకా కష్టపడి పనిచేసి మేము కూడబెట్టిన ఆస్తులకు, త్వరలోనే వారసులు రాబోతున్నారు కాబట్టి తప్పక రండి, మీరూ వాళ్ళ సేవ చేసుకొని తరించవచ్చు’ అంటారు.
అలాంటిదే ఒక సేవా సందర్భం 2013లో నాకూ వచ్చింది. అప్పటి వరకు మాతో హైదరాబాద్ లోనున్న మూడేళ్ల మా మనవడిని అప్పుడు లాస్ ఎంజీల్స్‌లోనున్న మా అబ్బాయి దగ్గర దింపిరావడానికి ఆగష్టు 17న నేను అమెరికా బయలుదేరి వెళ్ళాను. గమ్యం చేరేవరకు ప్రతి ఎయిర్‌పోర్టులో అధికారులతో నేను పదే పదే ఎదుర్కున్న ప్రశ్న.. మా మనవడి గురించి.! మీ దగ్గర ‘పేరెంట్స్ పర్మిషన్, వాలిడ్ డాకుమెంట్స్ ఉన్నాయా లేవా ? ’ అని. మా జర్నీలో ఫ్లయిట్ మారినప్పుడల్లా కనబడ్డ ప్రతి టాయ్ కావాలని చేస్తున్న మా మనవడి డిమాండ్స్ అయిష్టంగానైనా ఒకటీ అరా తీరుస్తూ ఎలాగైతేనేం ఎట్టకేలకు లాస్ ఎంజీల్స్ చేరి అప్పగింతలు పూర్తిచేశా. నాలాంటి వాడిని అమెరికా వెళ్లి ఏం చేశారని ఎవ్వరూ అడగరు, ఏం చూశారన్నదే ముఖ్యమైన ప్రశ్న. నా లెక్కకు అందరూ అడిగే ఈ ఐదు చూసేస్తే అమెరికా యాత్ర పూర్తయినట్లే.
1 ) ఆ దేశ స్వాతంత్య్రానికి ప్రతీకయైన న్యూయార్క్‌లోని స్టాచ్యు అఫ్ లిబర్టీ
2 ) వాషింగ్టన్ డి సి లోని అమెరికా అధ్యక్షుడి నివాసం శ్వేతసౌధం అదే వైట్ హౌస్
3 ) కాలిఫోర్నియాలోని హాలీవుడ్ సినీ ప్రపంచం
4 ) పిల్లల ప్రపంచం డిస్నిల్యాండ్
5) నిద్రపోని నగరం క్యాసినోల ప్రపంచం లాస్ వేగాస్‌ను మరిచిపోయానంటారేమో, నా లాంటివాడు అటు వెళ్తే ఉన్న ఆరోగ్యమే కాదు పొదుపు చేసి పెట్టుకున్న పెన్షన్ డబ్బులు కూడా పోతాయేమోనని భయం.
లాస్ ఏంజెల్స్ ఒకప్పుడు మెక్సికోలో భాగం, దీన్ని ఓ ఒప్పందం పేరిట 1848లో అమెరికా తీసేసుకున్నదట. లాస్ ఎంజీల్స్‌లో ఉన్నాను కాబట్టి అక్కడి హాలీవుడ్ సినీ ప్రపంచాన్ని చుట్టేసాను, యూనివర్సల్ స్టూడియోలో ఒక రోజంతా గడిపాను. అటునుండే వెళ్లి పిల్లలతో డిస్నీల్యాండ్ లో ఆడుకొని వచ్చాను. నేను అక్కడ ఉన్నప్పుడే అప్పటివరకు స్కెచర్స్ లో పనిచేస్తున్న మా అబ్బాయికి ఒరాకిల్ పోర్టులాండ్‌లో అవకాశం రావడంతో ముల్లెమూటా సర్దుకొని అక్కడి నుండి మారాల్సి వచ్చింది.
క్యాలిఫోర్నియా రాష్ట్రంలోని లాస్ ఏంజెల్స్ నుండి పోర్టులాండ్ ( ఒరెగాన్ ) దూరం దాదాపు 900 మైళ్లు. అందరమూ కారులో వెళదామన్నాడు మా అబ్బాయి. నేషనల్ హైవె మీద దాదాపు 350 మైళ్లు, 7 గంటల డ్రైవ్ తర్వాత మేము శాన్ ఫ్రాన్సిస్కో చేరుకుని అక్కడే నైట్ హాల్ట్ చేసాము. ఇదే విమానంలో వచ్చుంటే ఫ్లయిట్ జర్నీ గంటకు మించదు. 1906లో వచ్చిన తీవ్రమైన భూకంపంలో శాన్ ఫ్రాన్సిస్కో దాదాపు మూడు వంతులు దెబ్బతిందట. మళ్ళీ పునర్ నిర్మించుకున్న ఈ నగరం ఒకప్పుడు హిప్పీ సంస్కృతికి తర్వాతి కాలంలో స్వలింగ సంపర్కుల హక్కుల ఉద్యమానికి పేరు గాంచింది.
ఇంకా దాదాపు 550 మైళ్లు వెళితే గానీ మేము గమ్యం చేరలేము. పిల్లలు అప్పటికే అలసిపోయి ఉండడం వల్ల, వాళ్ళను మరునాడు ఫ్లయిట్ ఎక్కించి మా అబ్బాయి నేను మాత్రం ఇక్కడి ప్రసిద్ధ గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ చూస్తూ పోర్ట్ ల్యాండ్ బాట పట్టాము. ఈ నేషనల్ హైవే 101 అంతా ఘాట్ రోడ్డు, ప్రయాణంలో ఎన్నో పదనిసలు. కుటుంబం నుంచి జాతీయ అంతర్జాతీయ రాజకీయాల వరకు అన్నీ మాట్లాడుతూ, ప్రతి 50-60 మైళ్లకు ఒకచోట హైవేల పక్కనున్న రెస్ట్ ఏరియాల్లో కాస్సేపు విశ్రమిస్తూ చేసిన దాదాపు పది గంటల ప్రయాణం తర్వాత మేము పోర్ట్ ల్యాండ్ చేరుకున్నాము.
ఈ సుదీర్ఘ ప్రయాణంలో నాకు బాగా నచ్చినవి ప్రయాణికులు సేద దీరడానికి రెస్ట్ రూంలు. వీటిలో రెస్టారెంట్ల నుంచి ప్లే ఏరియా వరకు అన్ని సౌకర్యాలున్న ‘ రెస్ట్ ఏరియాలు ’ అవే విశ్రాంత ప్రాంతాలు ఎలాంటి బడలికనైనా అట్టే మాయం చేస్తాయి. అందుకే వేల కిలోమీటర్ల (మైళ్ల) దూరాన్ని సునాయసంగా లాగించేస్తుంటారు అమెరికన్లు. హోటళ్ల తరహాలోనే అన్ని సౌకర్యాలుంటాయి, పైగా ఇవి మోటారిస్టుల కోసం కాబట్టి వీటిని మోటళ్లు అంటారు. తక్కువ ఖర్చులో అవసరమైనవన్నీ ఇక్కడ లభిస్తాయి. అందుకే సగటు అమెరికన్లు ఏడాదిలో కనీసం 30 రోజులు ప్రయాణాల్లో ఉంటారట.!
--వేముల ప్రభాకర్
Comments
Please login to add a commentAdd a comment