అమెరికా.. ఎందరికో కలల దేశం. అగ్రరాజ్యమైన అమెరికా వెళ్తే.. ఎంచుకున్న రంగంలో రాణించవచ్చన్న లక్ష్యంతో వేల మంది ప్రవాసాంధ్రులు వెళ్లారు. కొందరిది ఉద్యోగం, మరికొందరిది వ్యాపారం, ఇంకొందరిది వైద్యం, సేవల రంగం. ఇప్పుడు అమెరికాలో కీలకమైన పదవుల్లో తెలుగు వారందరో ఉన్నారు. ఇలాంటి వారు సొంతగడ్డ రుణం తీర్చుకునేందుకు ఉత్తర అమెరికా తెలుగు అసొసియేషన్ (NATA) ఒక వారధిలా మారింది.
మనసంతా జన్మభూమిపైనే..
తెలుగు రాష్ట్రాల నుంచి విదేశాలకు వెళ్లే వారి సంఖ్య ఏటికేడు పెరుగుతోంది. గతంలో ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లేవారు. ఇప్పుడు విద్య, ఉద్యోగ, ఉపాధి కోసం అమెరికా వైపు మొగ్గుచూపుతున్నారు. గత 30 ఏళ్లుగా సాఫ్ట్‌వేర్, వైద్య, ఇతర వృత్తి నిపుణులు అమెరికాకు వెళ్తున్నారు. వేల మంది ప్రవాసాంధ్రులు ఉత్తర అమెరికా తెలుగు అసొసియేషన్ (NATA) ద్వారా తెలుగు రాష్ట్రాల్లో ఏదో ఒక అభివృద్ధి పనుల్లో తమ వంతుగా పాల్గొంటున్నారు.
నాటా సేవాడేస్
ఉత్తర అమెరికా తెలుగు అసొసియేషన్ (NATA) ప్రతినిధులు.. తెలుగు రాష్ట్రాల్లో ఏ ఏ కార్యక్రమాలు చేపట్టాలో ముందుగానే కసరత్తు చేస్తారు. వేర్వేరు పద్ధతుల్లో సేకరించిన సమాచారాన్ని వడపోసి.. తమ లక్ష్యాలను నిర్దేశించుకుంటారు. ప్రతీ ఏటా నాటా ప్రతినిధి బృందం తెలుగు రాష్ట్రాలను సందర్శించి తమ సహకారాన్ని తోడ్పాటును అందిస్తారు.
* ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి
* నాడు-నేడులో భాగంగా మౌలికసదుపాయాల అభివృద్ధి
* ప్రజావసరాల కోసం కమ్యూనిటీ భవనాలు
* మంచినీటి ప్లాంటులు
* బాగా చదువుకునే విద్యార్థులకు ప్రోత్సాహకాలు
* సేవ్ ద గర్ల్ ఛైల్డ్ క్యాంపెయిన్
* మెడికల్ క్యాంపు, బ్లడ్ క్యాంపులు
* అన్నదానాలు, విద్యాబోధన
* ఆటలపోటీలు, క్రికెట్ టోర్నమెంట్‌లు
ఏ దేశమేగినా ఎందు కాలిడినా.. అంటూ కవి రాయప్రోలు సుబ్బారావు నినదించినట్టు... నాటా నేతృత్వంలో ప్రవాసాంధ్రులు మాతృభూమి సేవలో తరిస్తున్నారు. అమెరికాలో స్థిరపడినా తాము పుట్టి పెరిగిన ప్రాంతంపై మమకారాన్ని చాటేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. సాంస్కతిక వారసత్వాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఎక్కువ మంది తమకు విద్యాబుద్ధులు నేర్పిన పాఠశాలల అభివృద్ధికి కృషిచేస్తూ భావిభారత పౌరుల భవిష్యత్తుకు బాటలు వేస్తుండగా, మరికొందరు గ్రామం సహా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆసుపత్రులు, రోడ్లు, కమ్యూనిటీ భవనాల నిర్మాణం, తాగునీటి వసతి తదితర అభివృద్ధి పనులకు సహకారం అందిస్తూ జన్మభూమి రుణం తీర్చుకుంటున్నారు. సమాజం పట్ల సాటి మనిషికి ఉండాల్సిన బాధ్యతను నిర్వర్తిస్తున్నారు.
నాటా ఫౌండర్ ప్రేమ్ సాగర్ రెడ్డి స్వయంగా ఇటీవల ఏపీలో పర్యటించారు. ప్రేమ్ సాగర్ రెడ్డి తన స్వంత గ్రామం అయిన నిడుగుంట పాలెంతోపాటు ఆంధ్రరాష్ట్రం లో పర్యటించి సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా ప్రేమ్ సాగర్ రెడ్డి కి విశ్వ వైద్య విభూషన్ అవార్డును ప్రధానం చేసింది నాటా బృందం.
జూన్ 30 నుంచి జులై 2 వరకు
అమెరికాలోని డాలస్ నగరంలో జూన్ 30 నుంచి జులై 2వ తేదీ వరకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం(నాటా) మహాసభలను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్నట్లు నిర్వహణ కమిటీ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment