![New York New Delhi airline Service is Having Some Unique Issues - Sakshi](/styles/webp/s3/article_images/2021/11/30/New-York-New-Delhi.jpg.webp?itok=AvWaAZ0b)
American Airlines Russian Airspace Issue: అమెరికా - ఇండియాల మధ్య డైరెక్ట్ ఫ్లైట్ సర్వీసుగా అమెరికా ఎయిర్‌లైన్స్ ప్రారంభించిన సర్వీసుకి ఆదిలోనే హంసపాదు ఎదురవుతోంది. మార్గమధ్యంలో తలెత్తున్న ఇబ్బందుల కారణంగా షెడ్యూల్ టైంకి ఈ విమానం నడిపించడం మా వల్ల కాదంటున్నారు అమెరికన్ పైలెట్లు.
ఇండియా, అమెరికాల మధ్య గతంలో అమెరికన్ ఎయిర్‌లైన్స్ డైరెక్టు విమానాలు నడిపించినా 2012లో రద్దు చేసింది. తాజాగా న్యూయార్క్ నుంచి న్యూఢిల్లీకి బోయింగ్ 777 (300ఈఆర్) సర్వీసులను ప్రారంభించింది. ఈ రెండు నగరాల మధ్య దూరం 7320 మైళ్లు ఉండగా ప్రయాణ సమయం 16 గంటలలోపుగానే షెడ్యూల్ చేశారు. అయితే ఈ షెడ్యూల ప్రకారం విమానాలు నడిపించడం వీలు కావడం లేదంటూ వన్ టైం అట్ టైం వెబ్‌సైట్ కథనం ప్రచురించింది.
అయితే ఈ విమానం మార్గమధ్యంలో కొద్ది సేపు రష్యా ఎయిర్ స్పేస్ మీదుగా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. తమ గగన తలం ఉపయోగించుకోవడంపై రష్యా అభ్యంతరం వ్యక్తం చేయడంతో రూటు మార్చి నడిపిస్తున్నారు. దీంతో ప్రయాణ సమయం 16 గంటలు మించుతోంది. ఫలితంగా విమానం షెడ్యూల్ ప్రకారం నడిపించడంలో ఇబ్బందులు వస్తున్నాయి. దీంతో న్యూయార్క్ - న్యూఢిల్లీ విమాన సర్వీసులో తలెత్తున్న ఇబ్బందులు పరిష్కరించాలంటూ అమెరికన్ పైలెట్లు డిమాండ్ చేస్తున్నారు.
ఈ వివాదం చినికిచినికి గాలివానగా మారితే మరోసారి ఈ సర్వీసులు కొనసాగింపుపై ప్రభావం పడే అవకాశం ఉంది. కరోనా సంక్షోభం చక్కబడిన తర్వాత ఇప్పుడిప్పుడే ఇండియా - అమెరికాల మధ్య ప్రయాణాలు ఊపందుకుంటున్నాయి. ఎన్నారైలు తమ ప్రయాణాలకు ప్లాన్ చేస్తున్నారు. ఈ తరుణంలో ఈ విమాన సర్వీసు విషయంలో ఎదురవుతున్న ఇబ్బందులు తెర మీదకు వచ్చాయి.
చదవండి: విదేశాల నుంచి ఇండియా వచ్చే వారికి అలెర్ట్! డిసెంబర్ 1 నుంచి కొత్త రూల్స్
Comments
Please login to add a commentAdd a comment