కరోనా వచ్చింది మొదలు జాగ్రత్తలు మొదలు , టెస్టుల, చికిత్సా విధానం వరకు నిబంధనల్లో బోలెడు వైరుధ్యాలు ఉన్నాయి. చాలా మంది వీటిని చూసీ చూడనట్టుగా వదిలేస్తున్నారు. కానీ ఓ ఎన్నారై మాత్రం కరోనా టెస్టుల్లో డొల్లతనం.. దాని వల్ల ఎదురవుతున్న ఇబ్బందులపై ఏకంగా హైకోర్టునే ఆశ్రయించాడు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఏవియేషన్ డిపార్ట్‌మెంట్, ఐసీఎంఆర్‌ల పనితీరుని నేరుగా ప్రశ్నించాడు.
అబుదాబీకి పయణం
కేరళాకి చెందిన ముజామిల్ వరికొట్టిల్ (29) అనే యువకుడు పదేళ్లుగా అబుదాబీలో ట్యాక్సీ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అతని సంపాదనపైనే ఇండియాలో కుటుంబం ఆధారపడి ఉంది. కాగా నాలుగు నెలల క్రితం ముజామిల్ కేరళా వచ్చాడు. తిరిగి అబుదాబీ వెళ్లేందుకు టిక్కెట్టు బుక్ చేసుకున్నాడు. 2022 జనవరి 29న కోజికోడ్ నుంచి దుబాయ్ ఫ్లైట్ ఎక్కేందుకు అతను ఎయిర్‌పోర్ట్‌కి చేరుకున్నాడు.
చిక్కొచ్చి పడింది
ఎయిర్‌పోర్ట్ అధికారులు కరోనా టెస్టు చేయించుకోవాల్సిందిగా ముజామిల్‌ని ఆదేశించారు. ప్రయాణానికి రెండు రోజుల ముందు గుర్తింపు పొందిన ల్యాబ్‌లో చేయించిన కరోనా ఆర్టీ పీసీఆర్ నెగటివ్ సర్టిఫికేట్ చూపించినా ఎయిర్‌పోర్ట్ అధికారులు అంగీకరించలేదు. ఎయిర్‌పోర్టులో టెస్ట్ చేయించాల్సిందే అంటూ పట్టుబట్టారు. దీంతో రూ. 2,490 చెల్లించి ఆర్టీ పీసీఆర్ టెస్ట్ చేయించాడు. అప్పుడు పాజిటివ్‌గా రిపోర్టు వచ్చింది. దీంతో ఎయిర్‌పోర్ట్ అధికారులు ముజామిల్‌ని ఫ్లైట్ ఎక్కనీయకుండా ఇంటికి పంపించేశారు.
హైకోర్టులో కేసు
ఫ్లైట్ మిస్ అవడం వల్ల అబుదాబీలో డ్రైవర్ ఉద్యోగాన్ని కోల్పోయాడు ముజామిల్. అంతేకాకుండా ఫ్లైట్ టిక్కెట్ కోసం ఖర్చు పెట్టిన రూ.15,000 వెనక్కి ఇచ్చేందుకు విమాన సంస్థ నిరాకరించింది. ఓ వైపు ఉద్యోగం పోవడం, మరోవైపు ఆర్థిక నష్టం కలగడంతో ముజామిల్ ఈ అంశాన్ని తేలిగ్గా తీసుకోలేదు. వెంటనే తగు ఆధారాలతో కేరళా హైకోర్టును ఆశ్రయించాడు. అతను సమర్పించిన ఆధారాలు బలంగా ఉండటంతో కేంద్ర, రాష్ట్ర ఆర్యోగ శాఖలు, ఐసీఎంఆర్, ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, కాలికట్ ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్‌లను ప్రతివాదులగా చేర్చుతూ కేసును విచారించేందుకు హైకోర్టు అంగీకరించింది. నాలుగు వారాల్లో సమాధానం చెప్పాలంటూ ప్రతివాదులకు నోటీసులు పంపింది.
ముజామిల్ లేవనెత్తిన కీలక అంశాలు
- ప్రయాణానికి రెండు రోజుల ముందు చేయించిన ఆర్టీ పీసీఆర్ టెస్ట్‌ను ఎయిర్‌పోర్ట్ అథారిటీ అధికారులు ఎందుకు అంగీకరించలేదు
- కోజికోడ్ ఎయిర్‌పోర్టులో ఏర్పాటు చేసిన కోవిడ్ టెస్ట్ సెంటర్‌కి ఐసీఎంఆర్ నుంచి ఎటువంటి అధికారిక గుర్తింపు లేదు. ఎటువంటి గుర్తింపు లేకుండా ఎయిర్‌పోర్ట్ అధికారులు ప్రైవేట్‌గా ఈ ల్యాబ్‌ను నిర్వహిస్తున్నారు.
- ప్రయాణానికి రెండు రోజుల ముందు, అంతకు ముందు చేసిన ఆర్టీ పీసీఆర్ టెస్ట్ రిపోర్టులు ఐసీఎంఆర్ సైట్‌లో కనిపిస్తున్నాయి. కానీ ఎయిర్‌పోర్టులో చేసిన రిపోర్టులు కనిపించడం లేదు.
- రెండు రోజులు ముందు చేయించిన ఆర్టీ పీసీఆర్ నెగటీవ్ రిపోర్టు ఉండగా గుర్తింపు లేని ల్యాబ్ నుంచి మరోసారి ఎందుకు కోవిడ్ టెస్ట్ చేయించారు.
- నిబంధనలకు విరుద్ధంగా చేసిన టెస్ట్ వల్ల ఉద్యోగం కోల్పోవడంతో పాటు ఆర్థిక నష్టం జరిగింది. కుటుంబానికి ఆర్థిక అండ లేకుండా పోయింది. అంతేకాదు ప్రయాణం చేయకుండా నా ప్రాథమిక హక్కును అడ్డుకున్నారు.
చదవండి: అమెరికాలో విచిత్ర ఘటన.. ప్రాణాలతో ఉన్నా చనిపోయినట్టుగా..
Comments
Please login to add a commentAdd a comment