సాక్షి ప్రతినిధి, విజయవాడ: టీడీపీలో పెనమలూరు సీటు వ్యవహారం కాకరేపుతోంది. టీడీపీ–జనసేన ప్రకటించిన అభ్యర్థుల తొలి జాబితాలో పెనమలూరు ప్రస్తావన లేకపోవటంతో ఆశావహుల ఆశ.. నిరాశేగానే మిగిలింది. రోజు కొక కొత్త పేరు తెరపైకి రావటంతో అసలు సీటు ఎవరి కిస్తారో అర్థమవక ఆ పార్టీ శ్రేణులు గందరగోళా నికి గురవుతున్నాయి. ఆది నుంచి పార్టీ కోసం కష్ట పడిన వారికి సీట్లు ఇవ్వకుండా డబ్బు మూటలతో వచ్చే నేతలకే టీడీపీ అధినేత చంద్రబాబు, చినబాబు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈకోవలోనే గుడివాడలో వెనిగండ్ల రాము, గన్నవరంలో యార్లగడ్డ వెంకట్రావుకు సీట్లు కేటాయించారు.
స్థానిక ఎమ్మెల్యే కొలుసు పార్థసారథికి గాలం వేసి తీరా పార్టీలో చేరాక సర్వేల బూచి చూపి, నూజివీడుకు పంపారు. మరో వైపు టీడీపీ ఇన్‌చార్జిగా ఉన్న బోడే ప్రసాద్‌కు టికెట్ ఇవ్వకుండా, డబ్బు మూటలతో వచ్చే నాయకుల కోసం గాలిస్తున్నారు. ఓ వైపు సర్వేలన్నీ తనకే అనుకూలంగా ఉన్నాయని, పెనమలూరులో తానే పోటీచేస్తానని బోడే ప్రసాద్ గట్టిగా చెబుతున్నారు. ‘ఎవరికో’ ఇస్తే చేతులు ముడుచుకు కూర్చునే ప్రసక్తే లేదని అధిష్టానానికి హెచ్చరికలు పంపుతున్నారు.
తమ్ముళ్లలో విభేదాలు
పెనమలూరు టీడీపీలో గ్రూపుల గోల ఇప్పటికే పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. నియోజకవర్గ టీడీపీ సీటు తమదేనంటూ మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్, చలసాని పండు కుమార్తె దేవినేని స్మిత గ్రామాల్లో పోటాపోటీగా ప్రచార కార్య క్రమాలు సాగిస్తున్నారు. తానే ఇన్‌చార్జినని, తన వల్లే పార్టీ పటిష్టంగా ఉందని బోడె ప్రసాద్ చెబుతున్నారు. 2014 ఎన్నికల్లో ఒప్పందం మేరకు ఈ దఫా సీటు తమదే నని పండు కుమార్తె స్మిత ధీమాతో ఉన్నారు.
ఉయ్యూరులో మాజీ ఎమ్మెల్సీ వై.వి.బి.రాజేంద్ర ప్రసాద్ వర్గం బోడేకు సహకరించడం లేదు. ఇటీవల పార్టీలో చేరిన ఎమ్మెల్యే పార్థసారథి వర్గం మరో గ్రూపుగా వ్యహరిస్తోంది. పార్థసారథి సైతం తమ గ్రూపు తరఫున కొత్త అభ్యర్థిని ప్రతిపాదిస్తున్నారు. ఇందులో భాగంగానే పార్టీలో ఆయనతోపాటు పార్టీలో చేరిన కమ్మ కార్పొరేషన్ చైర్మన్ తుమ్మల చంద్రశేఖర్‌కు మద్దతు ఇస్తున్నారు. ఇలా ఎవరికి వారే తమ వర్గాలతో ప్రజల్లోకి వెళ్తూ సీటుపై ఆశలు పెంచుకుంటున్నారు.
తాజాగా తెరపైకి తుమ్మల
తొలి నుంచి బోడే ప్రసాద్, దేవినేని స్మిత టీడీపీ టికెట్ ఆశిస్తూ పనిచేస్తున్నారు. ఒకానొక తరుణంలో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడే ఇక్కడ పోటీకి వస్తున్నారన్న ప్రచారం జోరుగా జరిగింది. మరో వైపు పూటకో నేత పేరుతో పార్టీ వర్గాలు ఎన్నికల సర్వే నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే కె.పార్థసారథి, బేగ్, ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, వసంత కృష్ణప్రసాద్, దేవినేని ఉమా పేరుతో సర్వేలు చేయించారు.
తాజాగా ఇటీవల పార్టీలో చేరిన తుమ్మల చంద్రశేఖర్ పేరుతో కూడా సర్వే చేస్తున్నారు. తుమ్మల చంద్ర శేఖర్‌ను బాబు వద్దకు పార్థసారథి తీసుకెళ్లి అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని కోరినట్లు సమాచారం. బయట నేతలకు ఇక్కడ అవకాశం లేకుండా స్థానిక నేతలకే టికెట్ దక్కేలా పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా తుమ్మల సైతం ఎన్నికల్లో అయ్యే ఖర్చు భరిస్తానని, డిపాజిట్ కూడా చేస్తానని చెప్పడంతో అతనివైపు బాబు, చినబాబు మొగ్గుతున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ సాగు తోంది.
దీంతోపాటు బోడే ప్రసాద్, దేవినేని ఉమా, మరికొందరు బయట వ్యక్తుల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం జరగటంతో ‘సీటు’ వ్యవహారం కొలిక్కి రాక పార్టీ శ్రేణుల్లో గందరగోళం నెలకొంది. రానున్న రోజుల్లో పెనమలూరు వేదికగా టీడీపీలో ఎవరికి టికెట్ కేటాయించినా అక్కడి వర్గాలు కత్తులు దూసుకొని, పార్టీ పరువును బజారుకీడ్చడం ఖాయమని టీడీపీ నాయకులే పేర్కొంటున్నారు. చంద్రబాబు, లోకేష్ చిల్లర రాజకీయాలే పెనమలూరు టీడీపీలో చిచ్చు రేపుతున్నాయని పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. టికెట్ వ్యవహరంలో ఇలానే నాన్చుడు ధోరణితో అవలంబిస్తే పార్టీ పుట్టి మునగడం ఖాయమని పరిశీలకులు సైతం స్పష్టంచేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment