మోగనున్న పెళ్లి బాజాలు | - | Sakshi
Sakshi News home page

మోగనున్న పెళ్లి బాజాలు తేది ఎప్పుడెప్పుడు తెలుసుకుందామా?

Published Sat, Oct 26 2024 2:31 AM | Last Updated on Sat, Oct 26 2024 11:24 AM

-

మార్చి వరకు వివాహాలకు శుభ ఘడియలు

పామర్రు/వత్సవాయి: వివాహ వేడుక ప్రతి ఒక్కరి జీవితంలో ఓ మధురానుభూతి. అందుకే అందరూ మెచ్చుకునేలా, పదికాలాలూ గుర్తుండిపోయేలా వైభవంగా జరుపుకోవాలని భావిస్తారు. అందుకు తగ్గట్లే ఏర్పాట్లు చేసుకుంటారు. మూఢం, ఆషాఢం ముగియడంతో మళ్లీ ముహూర్తాల సందడి మొదలైంది. మార్చి నెల వరకూ వివాహ ముహూర్తాలు ఉన్నాయి. జనవరిలో సంక్రాంతి పండుగ ఉండటంతో ఆ నెలలో ముహూర్తాలు ఉండవు. మళ్లీ ఫిబ్రవరి నుంచి మార్చి వరకు శుభకార్యాలకు మహూర్తాలు ఉన్నాయి. దీపావళి తర్వాత వద్ద సంఖ్యలో పెళ్లిళ్లు జరిగే అవకాశం ఉంది. పల్లె, పట్టణం అన్న తేడా లేకుండా పెళ్లి బాజాలు మోగనున్నాయి. పెళ్లిళ్లు, గృహ ప్రవేశాలు, తదితర శుభకార్యాలతో ఊరూవాడా కళకళలాడనున్నాయి.

షాపింగ్‌ సందడి
పట్టణాల్లో పెళ్లిళ్ల షాపింగ్‌ ఊపందుకుంది. దుస్తులు, బంగారు ఆభరణాల కొనుగోలుకు వధూవరుల కుటుంబ సభ్యులు షాపింగ్‌లు ప్రారంభించారు. పెళ్లి దుస్తుల కొనుగోలుకు రూ.లక్షల్లోనే ఖర్చు చేస్తున్నారు. బంగారు ఆభరణాలను తమ స్థాయికి తగ్గట్టు కొనుగోలు చేస్తున్నారు. వస్త్ర, నగల దుకాణాలు కళకళలాడుతున్నాయి. భోజనాలు, క్యాటరింగ్‌, కల్యాణ మండపాలు, ఫంక్షన్‌ హాల్స్‌, డెకరేషన్ల కోసం ముందస్తు ఒప్పందాలు చేసుకుంటున్నారు. శుభ లేఖల ప్రింటింగ్‌, ప్లెక్సీ ఫ్రింటర్స్‌, ఫొటోగ్రాఫర్లు, టెంట్‌ హౌస్‌, వంట మేస్త్రిలు, బ్యూటీషియన్లు, మెహందీ ఆర్టిస్టులు, భజంత్రీలు.. ఇలా పెళ్లి వేడుకతో ముడి పడిన ప్రతి ఒక్కరికీ చేతినిండా పని దొరుకుతోంది. ఆర్థికంగా స్తోమతు ఉన్నవారు వివాహ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఇప్పటి నుంచే వెడ్డింగ్‌ ప్లానర్లతో ఒప్పందాలు చేసుకుంటున్నారు. సాధారణ, మధ్య తర గతి వారు కూడా తమస్థాయికి తగ్గట్లు పెళ్లి వేడు కలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు.

రాజీ లేకుండా..
ఎంగేజ్‌మెంట్‌, ప్రీ వెడ్డింగ్‌, వెడ్డింగ్‌, రిసెన్షన్‌, పోస్టు వెడ్డింగ్‌ ఇలా అనేక దశలుగా పెళ్లి వేడుకలను శ్రీమంతులు రాజీ పడకుండా నిర్వహిస్తున్నారు. ఈ సీజన్‌లో ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా సుమారు నాలుగు వేల వరకు పెళ్లిళ్లు జరిగే అవకాశం ఉంది. కల్యాణ మండపాలకు రూ.30 వేల నుంచి రూ.లక్ష వరకు అద్దెలు వసూలు చేస్తున్నారు. ఇటీవల పామర్రులో నిర్మించిన ఓ కళ్యాణ మండపంలో ఓ వ్యాపారి తన కుమార్తె వివాహ వేడుకను సుమారు రూ.25 లక్షలు వెచ్చించి నిర్వహించారు.

ఆధునిక సెట్టింగ్‌లు
కల్యాణ మండపాల్లో కళ్లు చెదిరే సెట్టింగ్‌లు ఏర్పా టుచేస్తున్నారు. కల్యాణ మండపాల్లో రూ.లక్షల్లో అద్దెలు పలుకుతున్నా అక్కడయితే ఆ సంబరమే వేరని వధూవరుల తల్లిదండ్రులు భావిస్తున్నారు. ఆయా ప్రాంతాలకు తగ్గట్టుగా, ఎవరి స్థాయిలో వారికి రంగుల హరివిల్లులా మండపాలు తీర్చి దిద్దుతున్నారు. వీటికి డిమాండ్‌ను బట్టి ధరలు నిర్ణయిస్తున్నారు.

ఫొటోగ్రఫీలో కొత్త పుంతలు
ముఖ్యంగా పెళ్లిళ్లకు ఫొటోగ్రఫీకి నేడు అందరూ అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఫొటోలు, వీడియో షూటింగ్‌లకు రూ.లక్షల్లో ఖర్చు చేస్తున్నారు. ఇటీవలన పెళ్లిళ్లలో డ్రోన్‌ కెమెరాలు విరివిగా వాడుతు న్నారు. ఎంత ఎత్తు నుంచి, ఎంత దూరం నుంచి అయినా క్వాలిటీ ఫొటోలు, వీడియో వస్తుండ టంతో డ్రోన్‌కు మరింత డిమాండ్‌ ఏర్పడింది. పెళ్లికి ముందే ప్రీ వెడ్డింగ్‌ ఘాట్‌ అని రకరకాలుగా ఫొటోలు, వీడియోలు తీస్తున్నారు.

మంగళవాయిద్యాలకు మంచి గిరాకీ
హిందూ సంప్రదాయంలో మంగవాయిద్యాలు లేకుండా పెళ్లి వేడుక ఉండదు. నూతన వధూవరులను సిద్ధం చేసే సమయం నుంచి పెళ్లి పూర్తయి ఇంటికి వచ్చే వరకు మంగళవాయిద్యాలు తప్పని సరి. బ్యాండు మేళాలు, ఆర్కెస్ట్రాలకు రూ.50 వేల నుంచి రూ.లక్షకుపైగా ఖర్చుచేస్తున్నారు. పెళ్లిళ్లో భోజనాల సంగతి సరేసరి. కొత్త కొత్త వైరెటీలకు ఎంత ఖర్చు పెట్టేందుకై నా వెనుకాడటం లేదు. రకరకాల బిరియానీలు, స్వీట్లు, కారా, కూరలు ఉంటాయి. ఎంచుకున్న మెనూ బట్టి ప్లేట్‌కు ఇంతని ధర నిర్ణయిస్తారు. వంటలు వడ్డిచ్చే వారికి కూడా డిమాండ్‌ ఉంది. పెళ్లిళ్లు చేయించే పురోహితులకు డిమాండ్‌ బాగా ఉంది.

శుభ ముహూర్తాలు ఇవీ..
అక్టోబర్‌ (ఆశ్వయుజ మాసం) : 26, 27

నవంబర్‌ (కార్తిక మాసం) : 3, 7, 8, 10, 14, 16, 17, 20, 22, 27, 28

డిసెంబర్‌ (మార్గశిర మాసం) : 4, 5, 6, 7, 8, 11, 12, 14, 15, 19, 20, 21, 26, 27, 28

జనవరి (మాఘ మాసం) : 31

ఫిబ్రవరి (మాఘ మాసం) : 2, 6, 7, 8, 9, 12, 13, 14, 15, 16, 21, 22, 23, 26

మార్చి (ఫాల్గుణ మాసం) : 2, 6, 9, 12, 15, 16

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement