సొమ్ము కాజేసిన ఇద్దరు ప్రైవేట్ ఉద్యోగులపై కేసు
పెనమలూరు: ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీలో పని చేస్తున్న ఇద్దరు ఉద్యోగులు సంస్థ సొమ్ము కాజేయడంతో పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. పెనమలూరు సీఐ వెంకటరమణ తెలిపిన వివరాల ప్రకారం క్రిష్ ఫైనాన్స్ కంపెనీ ప్రధాన కార్యాలయం హైదరాబాద్‌లో ఉంది. ఈ కంపెనీ బ్రాంచి పోరంకిలో ఉంది. దీనిలో పని చేస్తున్న యూనిట్ మేనేజర్ వంగా పృధ్వీబాబు, కలెక్షన్ ఆఫీసర్ కడియం రంజిత్.. రుణాలు తీసుకున్న కస్టమర్ల వద్ద నుంచి వసూళ్లు చేసిన సొమ్ము తిరిగి సంస్థకు చెల్లించకుండా సొంత ఖర్చులకు వాడుకున్నారు. పృధ్వీబాబు రూ.1,20,490, రంజిత్ రూ.1,80,610 మొత్తం రూ.3,01,100 సంస్థ సొమ్ము వాడుకున్నారు. ఉద్యోగులు సొమ్ము వాడుకున్న ఘటనపై సంస్థ క్లస్టర్ మేనేజర్ టి.రాంబాబు ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆటోడ్రైవర్ మృతదేహం లభ్యం
ఇబ్రహీంపట్నం: ఎన్టీటీపీఎస్ కాల్వలో దూకి గల్లంతైన ఆటోడ్రైవర్ మృతదేహం కృష్ణానది పవిత్రసంగమం ప్రాంతంలో ఆదివారం పోలీసులకు లభ్యమైంది. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం కొత్తపాలెంకు చెందిన ఆటోడ్రైవర్ కొంపల్లి రమేష్ (33) కుటుంబ కలహాల నేపథ్యంలో శనివారం సాయంత్రం రోడ్డు పక్కన ఆటో నిలిపి ఎన్టీటీపీఎస్ కాల్వలో దూకి గల్లంతయ్యాడు. ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది రాత్రి వేళ గాలించినా ఆచూకీ లభించలేదు. పవిత్రసంగమం వద్ద మృతదేహం ఉన్నట్లు గుర్తించిన స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. బంధువుల సమక్షంలో పంచనామా చేసి పోస్ట్‌మార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకు మృతదేహాన్ని తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో కండక్టర్ దుర్మరణం
తోట్లవల్లూరు: ఎడ్లబండిని ద్విచక్ర వాహనంతో ఢీకొట్టి ఆర్టీసీ కండక్టర్ దుర్మరణం చెందిన ఘటన తోట్లవల్లూరు, ఉయ్యూరు రహదారిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తోట్లవల్లూరు ఎస్సీ వాడకు చెందిన చీకుర్తి సురేష్(42) ఉయ్యూరు ఆర్టీసీ డిపోలో కండక్టర్. విధులు ముగించుకుని ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో తన ద్విచక్ర వాహనంపై ఉయ్యూరు నుంచి తోట్లవల్లూరు వస్తున్నాడు. కనకవల్లి డ్రెయిన్ సమీపంలోకి రాగానే ముందు వెళుతున్న ఎడ్లబండిని సురేష్ ప్రమాదవశాత్తు వెనుక నుంచి ఢీకొట్టాడు. అతను ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. మృతునికి భార్య, నలుగురు కుమార్తెలు ఉన్నారు.
పమిడిముక్కల సీఐ చిట్టిబాబు, తోట్లవల్లూరు ఎస్‌ఐ అవినాశ్ ప్రమాద ప్రాంతాన్ని సందర్శించి వివరాలను నమోదు చేసుకున్నారు. సురేష్ మృతదేహం చూసి కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరయ్యారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు ఉయ్యూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment