వసతి గృహం తనిఖీ
చిలకలపూడి/కోనేరు సెంటర్(మచిలీపట్నం): మండల పరిధిలోని పల్లెతాళ్లపాలెంలో ఉన్న వసతి గృహాన్ని సోమవారం సాయంత్రం జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణసారిక ఆకస్మికంగా తనిఖీ చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఆమె ఈ వసతిగృహాన్ని పరిశీలించారు. వసతి గృహంలో విద్యార్థులకు కల్పించిన వసతి సౌకర్యాలతో పాటు విద్యార్థులు చదువుకునే విద్యుత్ దీపాలు ఏ విధంగా ఉన్నాయి.. ఆహారం మెనూ ప్రకారం అందుతుందా లేదా? విద్యార్థులు పడుకునే నేల పరిశుభ్రంగా ఉందా, లేదా.. అని ఆమె పరిశీలించారు. అనంతరం ఒక్కొక్క విద్యార్థిని పిలిచి ఏమైనా అసౌకర్యాలు ఉంటే తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో న్యాయసేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి కేవీ రామకృష్ణయ్య, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ చీలి ముసలయ్య, వసతి గృహ సంక్షేమాధికారి ఎండీ షహతుల్లా, తాలుకా ఎస్‌ఐ కేవీవీ సత్యనారాయణ పాల్గొన్నారు.
జనసేన ఆరోపణలపై ఉద్యోగ సంఘాల మండిపాటు
ఇబ్రహీంపట్నం: దేశంలోనే ప్రతిష్టాత్మకమైన ఎన్టీటీపీఎస్, దాని యాజమాన్యంపై జనసేన నేతలు చేసిన నిరాధార ఆరోపణలు, అక్రమ కేసులపై సంస్థ ఉద్యోగ సంఘాలు తీవ్రంగా మండిపడ్డాయి. సంస్థపై వ్యాఖ్యలను టీఎన్టీయూసీ, ఏపీఎస్‌ఈబీ, ఏఈఈ, ఏపీ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్, బీసీ వెల్ఫేర్, 327 అసోసియేషన్‌ల నాయకులు సోమవారం ఓ ప్రకటనలో ఖండించాయి. చీఫ్ ఇంజినీర్ టి.నాగరాజు ఆధ్వర్యంలో ఎన్టీటీపీఎస్ రికార్డు స్థాయి జనరేషన్ సాధిస్తూ ఎన్నో రికార్డులు సొంతం చేసుకుందని పేర్కొన్నారు. ప్రభుత్వం, జెన్‌కో ఆదేశాల మేరకు సంస్థ నడుస్తోందని, వ్యక్తిగత ప్రయోజనాల కోసం నడవదన్నారు. సంస్థ వెలుపల రోడ్డుపైన జరిగిన బూడిద లారీ సంఘటన సంస్థకు, సీఈ నాగరాజుకు జనసేన నేతలు ఆపాదించడం ఏమిటన్నారు. హైవేపై జరిగిన విషయానికి సంస్థకు సంబంధం ముడిపెట్టడం ఎందుకని ప్రశ్నించారు. పేరు ప్రఖ్యాతలు కలిగిన సంస్థ ఎంతోమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా జీవనోపాధి కల్పిస్తోందని, రాష్ట్రంలో వెలుగులు నింపుతున్న సంస్థను రాజకీయాల్లోకి లాగవద్దని యూనియన్ నాయకులు హితవు పలికారు.
Comments
Please login to add a commentAdd a comment