చికిత్స పొందుతూ మహిళ మృతి
వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ బంధువుల ఆందోళన
లబ్బీపేట(విజయవాడతూర్పు): మెరుగైన వైద్యం కోసం జి. కొండూ రు నుంచి జీజీహెచ్‌కు వచ్చిన 30 ఏళ్ల మహిళ ఆస్పత్రిలో చేరిన కొద్దిసేపటికే మృతి చెందింది. అపస్మారక స్థితికి చేరుకున్న మహిళకు వైద్యులు ఇంజెక్షన్ ఇవ్వడంతోనే ప్రాణాలు పోయాయంటూ మృతురాలి బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. వైద్యుల నిర్లక్ష్యమే ప్రాణాలు తీసిందంటూ ఆరోపించారు. వివరాల ప్రకారం జి.కొండూరు మండలం కందులపాడుకు చెందిన వల్లూరు శిరీష(30) రెండు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతుండగా మెరుగైన వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చారు. ఆమెకు షుగర్‌లెవల్స్ అధికంగా ఉండటంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తూ.. లెవల్స్ కంట్రోల్ చేయడానికి ఇంజెక్షన్ ఇచ్చారు. పరిస్థితి మరింత దిగజారి ఇంజెక్షన్ ఇచ్చిన కొద్దిసేపటికే మహిళ మృతి చెందింది. దీంతో వైద్యుల నిర్లక్ష్యమే కారణంటూ బంధువులు ఆందోళనకు దిగారు. వైద్యులు ఇంజెక్షన్ ఇవ్వడంతోనే కోమాలోకి వెళ్లి ప్రాణాలు విడిచిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నిండా ముప్పై ఏళ్లు కూడా లేవని, సరైన వైద్యం అందితే ప్రాణాలు దక్కేవని, తల్లి, మామయ్యలతో పాటు, ఇతర బంధువులు పేర్కొన్నారు.
వైద్యుల నిర్లక్ష్యం లేదు..
మహిళ ఆస్పత్రికి వచ్చేసరికే పరిస్థితి విషమంగా ఉంది. షుగర్‌లెవల్స్ ప్రమాదకరస్థాయికి చేరుకున్నాయి. అంతేకాదు షుగర్‌లెవల్స్ తీవ్రస్థాయికి పెరగడంతో నిమోనియాకు గురవడంతో ఆస్పత్రికి వచ్చిన కొద్దిసేపటికే మృతి చెందింది. దీనిలో వైద్యుల నిర్లక్ష్యం ఏమీ లేదు.
– డాక్టర్ ఎ. వెంకటేశ్వరరావు, సూపరింటెండెంట్, జీజీహెచ్
Comments
Please login to add a commentAdd a comment