చుక్క రాదు.. దాహం తీరదు
వేసవికి ముందే జిల్లాలో తాగునీటి ఇబ్బందులు
‘నా పేరు బి.కుమారి. కంచికచర్ల అరుంధతీనగర్‌లో నివసి స్తున్నాను. జలజీవన్ మిషన్ పథకంలో ప్రతి ఇంటికీ కుళాయి ఏర్పాటు చేసి నిత్యం తాగునీరు ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. ఆ కుళాయికి 12 రోజులకు ఒకసారే నీరు వస్తోంది. చేసేదేమీ లేక వాటర్ ప్లాంట్ నుంచి రోజుకు 20 లీటర్లు తాగునీరు కొని జాగ్రత్తగా వాడుకుంటున్నాం. కొంతమంది గ్రామానికి కిలోమీటర్ దూరంలోని పేరకలపాడు క్రాస్‌రోడ్డు వద్ద ఉన్న కుళాయి నుంచి క్యానుల్లో తాగునీటిని తెచ్చుకుంటున్నారు. ఇప్పుడే తాగునీటి ఎద్దడి ఇలా ఉంటే ఇక వేసవిలో ఇంకా ఎంత తీవ్రంగా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నాం.
● కొన్ని గ్రామాల్లో వారానికి ఒక రోజే కుళాయిలకు నీటి సరఫరా ● దూర ప్రాంతాల నుంచి తాగునీరు తెచ్చుకొంటున్న వైనం ● పైపులైన్ల లీకులకు మరమ్మతులు చేపట్టని అధికారులు
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఎన్టీఆర్ జిల్లాలో వేసవికి ముందే తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. పలు గ్రామాల్లో తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడింది. వారా నికి ఒక రోజుకు కూడా కుళాయిలకు నీరు విడుదల కాని పరిస్థితుల్లో ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామాల్లో తాగునీటి సరఫరా అస్తవ్యస్తంగా మారింది. పలు గ్రామాల్లో తాగునీటి పైపు లైన్లకు, చేతి బోర్లకు చిన్న చిన్న మరమ్మతులు కూడా చేయడం లేదు. వీటి నిర్వహణ గ్రామ పంచాయతీలదని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు చేతులు ఎత్తేస్తున్నారు. జిల్లాలో 19 సీపీడబ్ల్యూ స్కీమ్‌లు ఉన్నాయి. వీటి నిర్వహణను ప్రభుత్వం గాలికి వదిలేసింది. వాటికి నీరు అందేలా కృష్ణా నదిలో ట్రెంచ్‌లు కొట్టాల్సి ఉన్నా అధికారులు పట్టించుకోవటం లేదు. దీంతో ప్రజలను తాగునీటి సమస్య వెంటాడుతోంది. చేసేదేమీ లేక ఆర్వో ప్లాంట్లకు వెళ్లి రోజూ రూ.20 వెచ్చించి 20 లీటర్ల తాగునీరు కొనుగోలు చేసి, జాగ్రత్తగా వాడుకుంటూ దాహార్తి తీర్చుకుంటున్నామని ప్రజలు వాపోతు న్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో రోజూ నీటి సరఫరా జరిగేదని, ఇప్పుడు వారానికి ఒక రోజు కూడా నీరు రాని దుస్థితి నెలకొందని, అయినా పట్టించుకునే నాథుడే లేడని ప్రజలు వాపోతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే ఇక మండు వేసవిలో పరిస్థితిని ఎలా ఉంటుందో తలచుకొని ఆందోళన చెందుతున్నారు.
నందిగామ నియోజకవర్గంలో..
నందిగామ నియోజకవర్గాన్ని తాగునీటి సమస్య వేధిస్తోంది. కంచికచర్ల మండలంలోని చెవిటికల్లు వద్ద కృష్ణానదిపై కంచికచర్ల, బత్తినపాడు పైలెట్ ప్రాజెక్టులు నిర్మించారు. ఈ రెండు పైలెట్ ప్రాజెక్టుల ద్వారా కంచికచర్ల మండలంలోని పది గ్రామాలు, బత్తినపాడు పైలెట్ ప్రాజెక్టు నుంచి వీరులపాడు మండలంలోని 20 గ్రామాలకు తాగునీరు సరఫరా చేస్తున్నారు. అయితే ఈ నీరు రోజూ రావడంలేదని ఆయా గ్రామాల ప్రజలు పేర్కొంటున్నారు. ప్రస్తుతం వారానికో, పది రోజులకో ఒకసారి కుళాయిల నుంచి నీరు వస్తోందని, ఇలా అయితే ఎలాగని వాపోతున్నారు. ఇప్పడే ఈ విధంగా తాగునీటి ఎద్దడి ఉంటే ఇక మండు వేసవిలో చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొంటున్నారు. గ్రామాల్లో బోరు పంపులకు కూడా మరమ్మతులు చేపట్టడంలేదని, ఫలితంగా వాడుక అవసరాలకూ ఇబ్బందులు తప్పడంలేదని ఆయా గ్రామాల మహిళలు పేర్కొంటున్నారు. పాలకులు, అధికారులు స్పందించి తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
తిరువూరు నియోజకవర్గంలో....
తిరువూరు నగరపంచాయతీ పరిధిలో కుళాయిలకు వారానికి రెండుసార్లు మాత్రమే నీటి సరఫరా జరుగుతోంది. కట్టెలేరులో పంపింగ్ స్కీముకు సరిపడా నీరందడంలేదు. దీంతో బోర్ పాయింట్లు వేసి నీరందించే ప్రయత్నం చేస్తున్నారు. అయినా పలు ప్రాంతాలకు సక్రమంగా తాగునీరు అందడంలేదు. రాజుపేటలోని పలు ప్రాంతాల్లో నాలుగు రోజులకు ఒకసారి కూడా కుళాయి నీరు రావడం లేదు. వేసవిలో ట్యాంకర్ల ద్వారా తాగునీరు అందిచాల్సిన దుస్థితి నెలకొంది. గంపలగూడెం మండలంలోని పలు గ్రామాల్లో ప్రజలు తీవ్ర నీటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. సరిహద్దు గ్రామాల ప్రజలు తెలంగాణకు వెళ్లి తాగునీరు తెచ్చుకుని గొంతు తడుపుకోవాల్సిన దుస్థితి నెలకొంది.
జగ్గయ్యపేట నియోజకవర్గంలో...
జగ్గయ్యపేట మునిసిపాలిటీ పరిధిలోని విలియంపేట, కాకాని నగర్, ఆర్టీసీ కాలనీ, చింతలతోపు ప్రాంతాల్లో తీవ్ర నీటి ఎద్దడి ఉంది. చిల్లకల్లు, తిరుమలగిరి, అన్నవరం ప్రాంతాల్లోనూ తాగునీటి ఇబ్బందులు తప్పడం లేదు. పెనుగంచిప్రోలు మండలం సుబ్బాయిగూడెంలో కొన్ని రోజులుగా కుళాయిల నుంచి తాగునీరు రంగు మారి వస్తోంది. అయినప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. వత్సవాయి మండలంలో మునేరుకు వచ్చిన వరదల కారణంగా పలు చోట్ల పైపులైన్లు కొట్టుకుపోయాయి. దీంతో వత్సవాయి మండల కేంద్రంలో రెండు రోజులకొక సారి నీరు సరఫరా జరుగుతోంది. మక్కపేట, సింగవరం, గోపినేనిపాలెం, భీమవరం, మాచినేని పాలెం, కంభంపాడు గ్రామాలకు నీరు సక్రమంగా సరఫరా కావటం లేదు.
శాశ్వత పథకం ఏర్పాటు చేయాలి
తిరువూరు పట్టణానికి తాగునీటి సరఫరాలో నిరంతరం ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పాలకుల ఉదాసీన వైఖరితో పలు మార్లు రకరకాల పథకాలను ప్రతిపాదించి విరమించుకోవడం పరిపాటైంది. ఇకనైనా శాశ్వత మంచినీటి పథకాన్ని ఏర్పాటు చేయాలి.
– ముదిగొండ దుర్గాప్రసాద్, తిరువూరు
నీటి కొరత లేకుండా చర్యలు
గ్రామాల్లో తాగునీటి కొరత లేకుండా చర్యలు తీసుకొంటున్నా. మార్చి 15వ తేదీలోపు పైపులైన్ల నిర్మాణ పనులను పూర్తి చేస్తాం. కృష్ణా నదిలో సీపీ డబ్ల్యూఎస్ స్కీంలకు నీటి కొరత లేకుండా ట్రెంచ్‌లు కొడుతున్నాం.
– విద్యాసాగర్, ఇన్‌చార్జి ఎస్‌ఈ, ఆర్‌డబ్లూఎస్, ఎన్టీఆర్ జిల్లా
చుక్క రాదు.. దాహం తీరదు
చుక్క రాదు.. దాహం తీరదు
Comments
Please login to add a commentAdd a comment