సమర్థంగా ఎమ్మెల్సీ ఎన్నికలు
ఉయ్యూరు: కృష్ణా–గుంటూరు జిల్లాల పట్టభద్రుల ప్రాదేశిక నియోజకవర్గ సభ్యుల పోలింగ్ నిర్వహణ సమర్థంగా జరగాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదేశించారు. ఉయ్యూరు పట్టణంలో పోలింగ్ నిర్వహించే జిల్లా పరిషత్ పాఠశాల, రెవెన్యూ డివిజన్ పరిధిలో పోలింగ్ కేంద్రాలకు పోలింగ్ సామగ్రి, బ్యాలెట్ బాక్సులు భద్రపరిచే మార్కెట్ యార్డులోని స్ట్రాంగ్ రూమ్ ప్రాంతాన్ని ఎస్పీ ఆర్.గంగాధర్‌రావుతో కలిసి గురువారం పరిశీలించారు. కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ ఉయ్యూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని 25 పోలింగ్ కేంద్రాలకు బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ సామగ్రిని తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. పంపిణీ, పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సులు భద్రపరిచేందుకు వీలుగా ఆర్‌డీఓ కార్యాలయం ఉన్న మార్కెట్ యార్డులోని స్ట్రాంగ్‌రూమ్ అందుబాటులోకి తెచ్చామన్నారు. పెనమలూరు, తాడిగడప మునిసిపాలిటీ పరిధిలో 11 పోలింగ్ కేంద్రాలు, కంకిపాడు, ఉయ్యూరు, తోట్లవల్లూరు మండలాల్లో 8 పోలింగ్ కేంద్రాలు, మొవ్వ, పామర్రు, పమిడిముక్కల మండలాల్లో ఆరు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ప్రతి డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రంలో నాలుగు ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసి బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ సామగ్రి పంపిణీ చేస్తామన్నారు. పోలింగ్ సామగ్రి తరలించేందుకు వీలుగా సెక్టార్ రూట్ వారీగా ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేశామన్నారు.
పటిష్ట బందోబస్తు..
ఎస్పీ ఆర్.గంగాధర్‌రావు మాట్లాడుతూ పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. వాహనాలకు పార్కింగ్ సౌకర్యం కల్పించామన్నారు. ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు, సిబ్బందిని మాత్రమే డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాలకు అనుమతిస్తామన్నారు. సామగ్రి, బ్యాలెట్ బాక్సులు తరలించే వాహనాలకు ఎస్కార్ట్‌గా సీఐతో కూడిన బందోబస్తు ఉంటుందన్నారు. ఆర్‌డీఓ హెలా షారోన్, తహసీల్దార్ సురేష్‌కుమార్, కమిషనర్ పాయసం వెంకటేశ్వరరావు, డీఎస్పీ సీహెచ్ శ్రీనివాసరావు పాల్గొన్నారు.
కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఉయ్యూరులో పోలింగ్ సామగ్రి పరిశీలన
Comments
Please login to add a commentAdd a comment