నాంచారమ్మ గ్రామోత్సవానికి వేళాయె..
కోడూరు: భక్తుల కొంగుబంగారంగా పూజలందుకుంటున్న విశ్వనాథపల్లి అద్దంకి నాంచారమ్మ అమ్మవారి జాతరను ఈ నెల 28 నుంచి ప్రారంభించనున్నట్లు ఆలయ అధికారి యు.జయశ్రీ శనివారం తెలిపారు. 15 రోజుల పాటు గ్రామోత్సవం నిర్వహించడానికి అన్ని ఏర్పాటు పూర్తి చేసినట్లు చెప్పారు. 28వ తేదీ ఉదయం రామనీడు ఉత్సవం అనంతరం చిన్నఅమ్మవారిని ఆలయం నుంచి బయటకు తీసి గ్రామోత్సవానికి శ్రీకారం చుట్టనున్నట్లు జయశ్రీ తెలిపారు. గ్రామోత్సవంలో మార్చి 12 అమ్మవారి మూలవిరాట్‌కి ప్రత్యేక అలంకారం, 13, 14 తేదీల్లో నాంచారమ్మ ప్రధాన జాతరను నిర్వహించనున్నట్లు చెప్పారు. 15న చిన్నఅమ్మవారిని ఆలయ ప్రవేశం చేయించి ఉత్సవాలను ముగించనున్నట్లు జయశ్రీ తెలిపారు. ఈ సందర్భంగా ఆలయాన్ని రంగులతో ముస్తాబు చేస్తున్నారు.
రైతులను
ఆదుకోవడానికి చర్యలు
నందిగామ రూరల్: టమోటా రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మార్కెటింగ్ శాఖ జిల్లా అధికారి మంగమ్మ చెప్పారు. పట్టణంలో అనాసాగరం సమీపంలోని టమాటా తోటలను శనివారం ఆమె పరిశీలించి రైతుల నుంచి వివరాలను తెలుసుకున్నారు. ఆమె మాట్లాడుతూ రైతులు టమాటాను నేరుగా రైతుబజార్‌కు తీసుకెళ్లి విక్రయించుకోవచ్చన్నారు. రైతుల నుంచి కేజీ రూ. 10 చొప్పున టమాటాను కొనుగోలు చేసి మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యాన రైతుబజార్‌లో విక్రయిస్తారని తెలిపారు. కార్యక్రమంలో ఉద్యానశాఖాధికారి నీలిమ, మార్కెట్ కమిటీ కార్యదర్శి వెంకటేశ్వరరావు, రైతుబజార్ ఈవో రవికుమార్,రైతులు పాల్గొన్నారు.
అట్టడుగు వర్గాల్లో అక్షరజ్యోతి
ఉయ్యూరురూరల్: అట్టడుగు వర్గాల్లోని చిన్నారుల్లో అక్షరజ్యోతిని వెలిగించాలని జిల్లా ట్రైబల్ ఆఫీసర్, సమగ్ర శిక్ష జిల్లా అదనపు కోఆర్డినేటర్ ఫణి ధూర్జటి అంగన్‌వాడీలకు పిలుపునిచ్చారు. స్థానిక జెడ్పీ పాఠశాలలో నాలుగు రోజులుగా అంగన్‌వాడీ కార్యకర్తలకు 120 రోజుల జ్ఞానజ్యోతి శిక్షణ కార్యక్రమం జరుగుతోంది. ఆయన పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ధూర్జటి మాట్లాడుతూ మెరుగైన అభ్యాసన ఫలితాలు రావడానికి ప్రతి అంగన్‌వాడీ కార్యకర్త కృషి చేయాలని సూచించారు. మూడు నుంచి ఆరేళ్ల మధ్య వయసు పిల్లల మెదడు 85 శాతం వృద్ధి చెందు తుందని, పిల్లల సమగ్ర అభివృద్ధికి శిక్షణ తోడ్పడుతుందన్నారు. అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ శ్యాంసుందరరావు మాట్లాడుతూ ప్రభుత్వం వరల్డ్ బ్యాంకు సాయంతో కార్యక్రమం నిర్వహిస్తోందన్నారు. సంఖ్యా పరిజ్ఞానం బాల్యం ఆరంభ దశలోనే కలగాలని, చిన్నపిల్లలకు బొమ్మలు, నమూనాలు, చూపించి విద్య నేర్పితే మనసులో హత్తుకుపోతుందని, ఆట పాటలతో కూడిన విద్యను అందించాలని సూచించారు. డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్స్‌గా రమణ, అబ్దుల్ హబీబ్, హరిబాబు పాల్గొన్నారు.
వీసీకి వీడ్కోలు
కోనేరుసెంటర్: ఆరు మాసాలు పాటు పనిచేసిన తనకు అందించిన సహాయ సహకారాలు మరువలేనని కృష్ణా విశ్వవిద్యాలయం ఇన్‌చార్జి ఉపకులపతి ఆర్.శ్రీనివాసరావు అన్నారు. కృష్ణా విశ్వవిద్యాలయం ఇన్‌చార్జిఉపకులపతిగా ఆరుమాసాలు పాటు పనిచేసి బదిలీపై వెళుతున్న శ్రీనివాసరావును విశ్వవిద్యాలయం అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది శనివారం ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు. కార్యక్రమంలో ప్రొఫెసర్‌లు సుందర కృష్ణ, మారుతీ, దిలీప్, ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రాంబాబు, నూజివీడు పీజీ స్టడీస్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ లావణ్యలత, ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ శ్రావణి పాల్గొన్నారు.
నాంచారమ్మ గ్రామోత్సవానికి వేళాయె..
Comments
Please login to add a commentAdd a comment