ఆరోగ్యశ్రీకి అనారోగ్యం | - | Sakshi
Sakshi News home page

ఆరోగ్యశ్రీకి అనారోగ్యం

Published Mon, Mar 3 2025 2:09 AM | Last Updated on Mon, Mar 3 2025 2:08 AM

ఆరోగ్

ఆరోగ్యశ్రీకి అనారోగ్యం

● నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు బిల్లులు ఇవ్వని ప్రభుత్వం ● వైద్యం చేయలేమని చేతులెత్తేస్తున్న ఆస్పత్రులు ● ఉమ్మడి కృష్ణా జిల్లాలో రోగుల అవస్థలు

ఆరోగ్యశ్రీని పటిష్టంగా అమలు చేయాలి

పేదలకు సంజీవని లాంటి ఆరోగ్యశ్రీ పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలి. నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు పెండింగ్‌ ఉన్న బిల్లులన్నీ చెల్లించాలి. గత ఏడాది ఎన్నికల నోటిఫికేషన్‌ ఇచ్చిననాడు ఉన్న పెండింగ్‌ బిల్లులు చెల్లించకపోవడం దుర్మార్గం. ప్రభుత్వ వైఖరితో నెట్‌వర్క్‌ ఆస్పత్రులు ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితికి చేరుకున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించాలి.

– డాక్టర్‌ మెహబూబ్‌ షేక్‌, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, వైఎస్సార్‌ సీపీ వైద్య విభాగం

ఆరోగ్యశ్రీలో

వైద్యం చేయడం లేదు

గతంలో తెల్లకార్డు తీసుకుని ఆస్పత్రికి వెళితే రూపాయి ఖర్చు లేకుండా అన్నీ ఉచితంగా చేసేవాళ్లు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయి వచ్చిన తర్వాత కూడా రోగి అకౌంట్‌లో డబ్బులు పడేవి. ఇప్పుడు ఆ డబ్బులు రావడం లేదు. వైద్యం కూడా పూర్తి ఉచితంగా చేయడం లేదు. కార్డు తీసుకుని ఆస్పత్రికి వెళితే కొంత మీరు డబ్బులు కట్టాలని అడుగుతున్నారు. అదేమంటే ప్రభుత్వం మాకు డబ్బులు ఇవ్వడం లేదు. ఏమి చేయమంటారు అంటున్నారు.

– వేములకొండ విష్ణు, జి. కొండూరు

లబ్బీపేట(విజయవాడతూర్పు): కూటమి ప్రభుత్వం ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేస్తోంది. ఎన్టీఆర్‌ వైద్య సేవగా పేరు మార్చిన సర్కారు దానిని ఏమార్చుతోంది. పేదలకు వైద్యం అందించిన ఆస్పత్రులకు బిల్లులు చెల్లించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో వైద్యం చేసేందుకు ఆస్పత్రుల యాజమాన్యాలు ఇష్టపడటం లేదు. ఇప్పటికే రెండు నెలల క్రితం ఈహెచ్‌ఎస్‌ సేవలు నిలిపివేసిన నెట్‌వర్క్‌ ఆస్పత్రులు పేదలను ఇబ్బంది పెట్టకూడదని మానవతా దృక్పథంతో సేవలు అందిస్తున్నాయి. ప్రభుత్వం మాత్రం ఆరోగ్యశ్రీని ఎత్తేసి, ఇన్సూరెన్స్‌ ప్రవేశపెట్టడానికి బిల్లులు పెండింగ్‌లో ఉంచింది. ఒక్కో ఆస్పత్రిలో రూ.రెండు నుంచి రూ.3 కోట్ల వరకూ బిల్లులు రావాల్సి ఉండటంతో వైద్యం చేయలేమంటూ చేతులెత్తేస్తున్నారు. దీంతో నిరుపేద రోగులు ఇబ్బందులు పడుతున్నారు.

ఇవే నిదర్శనం..

● ఉయ్యూరుకు చెందిన 38 ఏళ్ల వెంకటేశ్వర్లు ద్విచక్ర వాహనంపై వెళుతూ స్పీడ్‌బ్రేకర్‌ వద్ద అదుపు తప్పి కింద పడ్డాడు. దీంతో ఎడమ మోకీలు లిగమెంటు తెగింది. దానికి రీ కన్‌స్ట్రక్షన్‌ సర్జరీ కోసం నగరం బయట ఉన్న ఓ ఆస్పత్రికి వెళ్లాడు. ముందుగా రూ.45 వేలు చెల్లించి ఆస్పత్రిలో చేరితే ఆరోగ్యశ్రీలో సర్జరీ చేస్తామన్నారు. కష్టపడి పనిచేసుకునే వాళ్లం అంత కట్టలేమని వెళ్లిపోయారు.

● రామవరప్పాడుకు చెందిన ఓ విశ్రాంత ఉద్యోగికి మోకీలు అరిగిపోయింది. దానిని రీప్లేస్‌మెంట్‌ కోసం నగరంలోని ఆస్పత్రులన్నీ తిరిగినా ప్రయోజనం లేదు. ఈహెచ్‌ఎస్‌లో చేయలేమంటూ ఆస్పత్రుల యాజమాన్యాలు చేతులెత్తేశారు. చివరికి ఓ ఆస్పత్రికి వెళ్లగా రూ.60 వేలు అదనంగా కడితే చేస్తామన్నారు.

ఇలా వీరిద్దరే కాదు ఇప్పుడు ఆరోగ్యశ్రీలో చికిత్స పొందాలంటే ఎంతోకొంత ఆస్పత్రికి చెల్లించుకోవాల్సిన దయనీయ పరిస్థితి నెలకొంది. డబ్బులు చెల్లించలేమంటే చికిత్స చేయలేమని ఆస్పత్రుల యాజమాన్యాలు నిర్మొహమాటంగా చెప్పేస్తున్నాయి.

గతంలో ఇలా..

గత ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీ పథకంలో రోగుల వద్ద డబ్బులు వసూలు చేయాలంటేనే ఆస్పత్రుల వారు భయపడేవారు. అందుకు జిల్లాస్థాయిలో మానిటరింగ్‌ కమిటీని ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షించడమే కారణం. ఒకవేళ ఏదైనా ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీలో రోగి వద్ద డబ్బులు కట్టించుకున్నట్లు ఆరోపణలు వస్తే విచారణ చేసి నిర్ధారణ అయితే డబ్బులు కట్టించుకున్న మొత్తానికి పదిరెట్లు అపరాధ రుసుం కింద వసూలు చేసే వారు.

ఇప్పుడు ఆ పరిస్థితి లేదు

ప్రస్తుతం ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రులపై పర్యవేక్షణను కూటమి ప్రభుత్వం గాలికొదిలేసింది. ఈ పథకాన్ని నిర్వీర్యం చేయడంలో భాగంగానే అలా వ్యవహరిస్తున్నట్లు పలువురు చెబుతున్నారు. కొత్తగా తీసుకురావాలనుకుంటున్న ఇన్సూరెన్స్‌ స్కీమ్‌ను ఇప్పటికే నెట్‌వర్క్‌ ఆస్పత్రుల యాజమాన్యాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఒకవేళ దాన్ని తీసుకు వస్తే ముందుగా తమతో చర్చించాలని డిమాండ్‌ చేస్తున్నాయి. అయితే ప్రభుత్వం అవేమి పట్టించుకోవడం లేదు. దీంతో పేదలకు వైద్యం అందని పరిస్థితి నెలకొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
ఆరోగ్యశ్రీకి అనారోగ్యం1
1/2

ఆరోగ్యశ్రీకి అనారోగ్యం

ఆరోగ్యశ్రీకి అనారోగ్యం2
2/2

ఆరోగ్యశ్రీకి అనారోగ్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement