మహిళా శక్తిని చాటేలా మహిళా దినోత్సవం
మధురానగర్(విజయవాడసెంట్రల్):
మహిళా శక్తిని, యుక్తిని చాటిచెప్పేలా మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించేలా అధికారులు కృషి చేయాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. ఈ నెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా స్థాయిలో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమాల సన్నద్ధతపై చర్చించేందుకు కలెక్టర్ లక్ష్మీశ సోమవారం కలెక్టరేట్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక రంగాలతో సహా వివిధ రంగాల్లో మహిళామణులు సాధించిన విజయాలను గుర్తించి, గౌరవించేందుకు.. వారిని స్ఫూర్తిగా తీసుకొని మరింత మంది సమగ్రాభివృద్ధి దిశగా ముందడుగు వేసేలా ప్రోత్సహించేందుకు ఏటా మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహిస్తున్నామని వివరించారు. ఈ వేడుకలను విజయవంతం చేసేందుకు గ్రామీణాభివృద్ధి, పురపాలక, పట్టణాభివృద్ధి, పరిశ్రమలు, మహిళా శిశు సంక్షేమ శాఖ, వ్యవసాయం తదితర వివిధ శాఖల అధికారులు ఆయా శాఖల వారీగా మహిళా కేంద్రీకృత కార్యక్రమాల నిర్వహణకు సిద్ధం కావాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్యక్రమాల చేయూతతో పారిశ్రామికవేత్తలుగా రాణిస్తున్న మహిళామణులతో స్ఫూర్తిదాయక ప్రసంగాలు ఏర్పాటు చేయాలన్నారు. అభివృద్ధి పథంలో నడుస్తున్న స్వయం సహాయక సంఘాలు, వాటి సభ్యులను గుర్తించాలన్నారు. పీఎం ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ (పీఎంఈజీపీ), పీఎం విశ్వకర్మ యోజన వంటి ప్రస్తుతం అమల్లో ఉన్న పథకాల ద్వారా రుణాల మంజూరు పత్రాలు అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. బ్యాంకు లింకేజీ రుణాలు, ఉన్నతి (పీఎం అజయ్), లఖ్‌పతి దీదీ తదితర కార్యక్రమాలకు సంబంధించి ఆర్థిక సహాయ పంపిణీ కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేయాలన్నారు. మహిళా సాధికారతను ప్రతిబింబించేలా వివిధ శాఖల ఆధ్వర్యంలో ప్రత్యేక స్టాళ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఇప్పటికే గ్రౌండింగ్ అయిన యూనిట్లను ఆర్థికంగా ప్రగతి పథంలో పయనించేందుకు చేయిపట్టి నడిపించేలా సరైన మార్గనిర్దేశనం చేయాలని అన్నారు. మహిళల భద్రత కూడా అత్యంత ప్రాధాన్య అంశం కాబట్టి ఆ దిశగా వినూత్న ఆలోచనలతో కార్యక్రమాల అమలుకు చొరవ తీసుకోవాలని పోలీసు అధికారులకు సూచించారు. స్వీయ రక్షణపై మహిళలకు అవగాహన కల్పించే కార్యక్రమాలపైనా దృష్టి సారించాలని ఆదేశించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ శుభం నోఖ్వాల్, డీఆర్‌డీఏ పీడీ కె.శ్రీనివాసరావు, పీవో–యూసీడీ వెంకటరత్నం, డీఎంహెచ్‌వో డాక్టర్ మాచర్ల సుహాసిని, ఐసీడీఎస్ పీడీ డి.శ్రీలక్ష్మి, ఎల్‌డీఎం కె.ప్రియాంక, డీఐపీఆర్‌వో యు.సురేంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు.
పారిశ్రామికంగా రాణిస్తున్న మహిళా మణులతో స్ఫూర్తిదాయక ప్రసంగాలు సమన్వయ శాఖల అధికారులకు కలెక్టర్ లక్ష్మీశ ఆదేశాలు
Comments
Please login to add a commentAdd a comment