గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లాలో ఈనెల 7వ తేదీ నాటికి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల(పీఏసీఎస్) కంప్యూటరీకరణ ప్రక్రియ పూర్తి చేయాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. పీఏసీఎస్‌ల కంప్యూటరీకరణ ప్రగతిపై మంగళవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. 131 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో మార్చి 7 నాటికి కంప్యూటరీకరణ పూర్తిచేసి ఈ – పీఏసీఎస్‌లుగా మార్పు చేయాలన్నారు. వ్యవసాయదారులకు పేపర్ లెస్ ఆన్‌లైన్ సేవలు అందించాలని ఆదేశించారు. ఈ ప్రక్రియలో తలెత్తే సాంకేతిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని స్టేట్ ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ వారికి ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయంలో అలసత్వం వహించిన ఆడిటర్లపై చర్యలు తప్పవని హెచ్చరించారు. సమీక్ష సమావేశంలో జిల్లా సహకార అధికారి డాక్టర్ ఎస్.శ్రీనివాసరెడ్డి, జిల్లా సహకార ఆడిట్ అధికారి సీహెచ్ శైలజ, విభాగ సహకార అధికారి పి.కిరణ్ కుమార్, జిల్లా సహకార కేంద్ర బ్యాంకు జనరల్ మేనేజర్ జి.రంగబాబు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment